| సహ చట్టంతో అవినీతికి కళ్లెం |
| ప్రచురణ తేది: 04/11/2009 |
|
బోధన్ , న్యూస్‌టుడే: సమాచార హక్కు చట్టం అవినీతికి కళ్లెం లాంటిదనిపట్టణ న్యాయవాది దత్తాత్రి కులకర్ణి పేర్కొన్నారు. మంగళవారం విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ీఈనాడు - ముందడుగు' అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2005లో స.హ. చట్టం అమలులోకి వచ్చాక అవినీతిని నియంత్రించే ఆయుధం ప్రజలకు లభించిందని కులకర్ణి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు తీసుకునే నిర్ణయాలు, నిధుల కేటాయింపు, వాటి వినియోగం పౌరులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా ప్రశ్నించి, వివరాలు రాబట్టడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. మౌలిక, రాతపూర్వక, ముద్రిత సమాచారం పొందే వీలును స.హ. చట్టం కల్పిస్తోందన్నారు. తంతి తపాలా శాఖ రిజిస్టర్డు పోస్టు ద్వారా కూడా సమాచారం కోరవచ్చన్నారు. దేశ భద్రత, రక్షణ శాఖ మినహాయించి ఇతర అంశాలపై వివరాలు తెలుసుకోవచ్చన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స.హ. చట్టం పరిధిని యువత గ్రహించాలన్నారు. రూ. 10, రూ.5 రుసుము చెల్లించి వివరాలు కోరవచ్చని తెలిపారు. తెల్ల రంగు రేషన్ కార్డులున్న వ్యక్తులు ఉచితంగా చట్టాన్ని ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. విద్యా వికాస్ డైరెక్టర్ వై.శ్రీనివాసరావు ప్రసంగిస్తూ.. ప్రస్తుత పరిస్థితిలో ఈ చట్టం పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముందడుగు ప్రతినిధి రాజేందర్ చట్టం వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. |
|