| మడ మొక్కల పెంపకంలో అవినీతి వేర్లు |
| ప్రచురణ తేది: 06/11/2009 |
|
* ' ఈనాడు-ముందడుగు'తో వెలుగులోకి
నిజాంపట్నం , న్యూస్‌టుడే: రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మడ మొక్కల పెంపకం ఆ శాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పచ్చదనంతో పరిమళించాల్సిన మడ మొక్కలు జాడే ఆ ప్రాంతంలో కనిపించడం లేదు. కానీ వేల రూపాయలు మాత్రం ఖర్చయిపోయాయి. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకునే మడ మొక్కలు అధికారుల రికార్డుల్లో పెరుగుతున్నాయి. అటవీ భూమిలో నాటిన మొక్కలు చిగురించకుండానే నామరూపాలు లేకుండా పోయాయి. అయినా వాటిని పరిశీలనకు వచ్చిన ఉన్నతాధికారులు మాత్రం మొక్కలు పెంపకం సంతృప్తికరంగానే ఉందని కితాబివ్వడం పలు అనుమానాలకు దారి తావిస్తోంది.
గుంటూరు డివిజన్ అటవీశాఖ ఆధ్వర్యంలో 2006 నుంచి 2009 ఆగస్టు వరకు వీఎస్ఎస్(వన సంరక్షణ సమితి) ఆధ్వర్యంలో నిజాంపట్నంలోనే మొక్కలు పెంపకానికి రూ.71.81 లక్షలు మంజూరు అయ్యాయి. రూ. 61.48 లక్షల పనులు పూర్తి చేశామనిపించారు. ఈ పనులన్నీ వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరగాయని మాత్రం అధికారులు చెబుతున్నారు.
2006-07 సంవత్సరానికి 16 పనులకు రూ.12.26 లక్షలు మంజూరు కాగా, రూ. 11.65 లక్షల పనులు పూర్తి చేసినట్లు నిధులు చెల్లించారు. వాటిలో 30 హెక్టార్లలో మడ మొక్కల పెంపకానికి రూ.7.17 లక్షలు మంజూరు కాగా, రూ. 7.16 లక్షల ఖర్చు చేశారు. అయినా మడ మొక్కలు జాడ మాత్రం లేదు. మిగిలిన నగదు 15 వివిధ పనుల కింద ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు.
2007-08 సంవత్సరానికి 13 పనులకుగాను రూ.28.33 లక్షలు మంజూరయ్యాయి. అందులో రూ.23.27 లక్షలు ఖర్చు చేశారు. వాటిలో 20 హెక్టార్లలో మడ మొక్కలు పెంపకానికి రూ.4.8 లక్షలు కేటాయించారు. అయితే రూ.1.33 లక్షలతో మడ మొక్కలు పెట్టినట్లు చూపారు. ఆ ప్రాంతంలో మడ మొక్కలను వేలి మీద లెక్కపెట్టవచ్చు. రూ.1.5 లక్షలతో ఫైబరు బోటు మాత్రం కొనుగోలు చేశారు. మిగిలిన నిధులు సర్వీ మొక్కల బ్యాగ్ నర్సరీ, వాటికి కంచె తదితర పనులకు వినియోగించినట్లు చూపారు.
2008-09 సంవత్సరానికి 12 పనులకు రూ.30.22 లక్షలు మంజూరు కాగా, రూ. 25.94 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ పనుల్లోనూ అధికారుల చేతివాటం ప్రదర్శించారు. 16 హెక్టార్లలో మడ మొక్కలు పెంపకానికి రూ.2.44 లక్షలు మంజూరు కాగా, రూ. 2.43 లక్షల ఖర్చు చేశారు. సర్వీ మొక్కల నర్సరీ, తదితర పనులకు ఇతర నిధులు ఖర్చు చేశారు.
2009-10 సంవత్సరానికి సర్వీ మొక్కల బ్యాగ్ నర్సరీకి రూ.99 వేలు మంజూరు కాగా, రూ.60 వేలు ఖర్చు చేశారు.
అటవీశాఖలో జరిగిన పనులన్నీ వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగాయని చెబుతున్నారు. కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి బిల్లులు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి చేపట్టిన మడ మొక్కల పెంపకం నుంచి కొందరు అధికారుల అవినీతి చిగురించింది తప్ప మడ మొక్కలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో పనిచేసిన గుంటూరు డివిజనల్ అటవీ అధికారి రామ్మోహనరావు, ప్రస్తుతం పనిచేస్తున్న శ్రీనివాసశాస్త్రి సైతం మడ మొక్కలు పెంపకాన్ని పరిశీలించి వెళ్లడం తప్ప జరిగిన అవినీతిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. ఒక్క నిజాంపట్నంలోనే ప్రజాధనం లక్షల్లో దుర్వినియోగమైతే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మడ మొక్కల పెంపకం సంతృప్తికరం నిజాంపట్నంలో మడ మొక్కల పెంపకం సంతృప్తిగానే ఉంది. ఎవరైనా ఎప్పుడైనా పరిశీలించవచ్చు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులు బాగున్నాయి. |
|