శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: నిధులు పోయాయి.. దోమలు మిగిలాయి...
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
నిధులు పోయాయి.. దోమలు మిగిలాయి!
ప్రచురణ తేది: 02/11/2009

ఫాగింగ్ చేశారు.. డీడీటీ సాధారణ స్ప్రేయింగ్ చేశారు.. గంబూషియా చేపలనూ ప్రయోగించారు.. మొత్తమ్మీద అయిదేళ్లలో రూ.అరకోటికి పైగా ఖర్చు పెట్టారు. అయినా.. ప్రకాశం జిల్లాలో దోమల పని పట్టలేకపోయారు. ఫలితం.. 550 మలేరియా పాజిటివ్ కేసులు. అంత ఖర్చు పెట్టి.. అన్ని పనులు చేస్తే ఇంకెలా మలేరియా వస్తోంద నుకుంటున్నారా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారుల మహత్యమిది.

చట్టం ఆధారంగా 'ఈనాడు ముందడుగు' సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే.. దోమల నియంత్రణకు సంబంధించి జిల్లా అధికారులవి ఉత్తర ప్రగల్భాలేనన్న సంగతి స్పష్టమైంది. రూ.55 లక్షల నిధులు బూడిదలో పోసిన పన్నీరైన విషయమూ బయటపడింది. ప్రకాశం జిల్లాలో మలేరియా నివారణకు గత అయిదేళ్లలో ఖర్చు పెట్టిన మొత్తం రూ.55,01,400. ఇన్ని నిధులు నిజంగా ఖర్చయితే.. జిల్లాలో మలేరియానే కాదు దోమల జాడే కనిపించకూడదు. కానీ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లెక్కల ప్రకారమే ఏడాదిలో 800 మంది విషజ్వరాల బారినపడ్డారు. మరో 100 మందిని డెంగ్యూ, గన్యా వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టాయి.

నివారణ నామమాత్రం
మలేరియా, బోదకాలు, డెంగ్యూ, గన్యా వ్యాధి కారకాలన్నింటినీ మోసుకొచ్చేది దోమే. దీని నివారణే పారిశుద్ధ్య ప్రక్రియలో కీలకం. దోమల నివారణకు పంచాయతీ స్థాయిలో 12 ఆర్థిక సంఘం, పంచాయతీ నిధులు కేటాయిస్తారు. పురపాలక సంఘాల్లో అయితే వీటిపై వెచ్చించే మొత్తం ఇంకా ఎక్కువే. కేవలం దోమల మందు చల్లేందుకే ప్రత్యేక సిబ్బంది ఉంటారు. మశకాల్ని హతమార్చేందుకు ఫాగింగ్ యంత్రాలను వినియోగిస్తారు. ఇన్ని ఉన్నా.. జిల్లాలో జ్వరాలు హోరెత్తిస్తున్నాయి.సాక్షాత్తూ కందుకూరు ఆర్డీవో నరసింగరావు సతీసమేతంగా డెంగ్యూ బారినపడ్డారంటేనే పారిశుద్ధ్యం స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కోటలు దాటిన మాటలు
మలేరియా ప్రబలకుండా తీసుకున్న జాగ్రత్తలేంటని 'ఈనాడు ముందడుగు' ప్రశ్నిస్తే.. చేసిన పనులంటూ కొన్నింటిని అధికారులు పేర్కొన్నారు. మలేరియా ఎక్కువున్న ప్రాంతాల్లో సాధారణ డీడీటీ స్ప్రేయింగ్, ఫోకల్ స్ప్రే, యాంటీ లార్వల్ ఆపరేషన్, ఎబేట్/బైటెక్స్ ద్రావణ పిచికారీ, ఫాగింగ్, నీటి గుంటల్లో గంబూషియా చేపలను వదలడం తదితరాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇన్ని చేసినా.. జిల్లాలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారమే 550 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లెక్కల్లోకి రానివి వేలల్లో ఉన్నాయి. అధికారులు చెప్పిన పనులన్నీ నిజంగా జరిగితే.. ఇన్ని కేసులెందుకు నమోదయ్యాయి? మందులు చల్లినా.. చావనంత బలంగా దోమలుంటున్నాయా? సమాధానాలు చెప్పాల్సింది జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులే.

పొంతన లేని సమాధానాలు:
జిల్లాలో ఫాగింగ్ ఎక్కడెక్కడ చేశారు?దాని కోసం ఎన్ని నిధులు ఖర్చుబెట్టారు?ఖర్చు నివేదికలు ఇవ్వమని అడిగితే.. డీఎంఅండ్‌హెచ్‌వో పొంతన లేని సమాచారం ఇచ్చారు. జిల్లాలో అనేక గ్రామాల్లో ఫాగింగ్ చేశామాన్నారు. అయితే.. ఫాగింగ్‌కు మాత్రం నిధులు కేటాయించలేదని చెప్పారు. నిధులు లేకుండా 'అనేక గ్రామాల్లో' ఎలా చేశారో చెప్పలేదు. ఒకవేళ ఫాగింగ్ చేసే ఉంటే.. అందుకు నిధులు ఖర్చవుతాయి కదా. డీఎంఅండ్‌హెచ్‌వో సమాధానంలో మాత్రం వాటి ఊసే లేదు.
- కె.శ్యాంప్రసాద్ ముఖర్జీ, న్యూస్‌టుడే, ఒంగోలు

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008