|
|
| కారుచీకట్లో కాంతిపుంజం |
| ప్రచురణ తేది: 26/10/2009 |
|
అధికార యంత్రాంగపు నిర్లక్ష్యాన్ని అక్రమాలను వెలుగులోకి తెచ్చే అవకాశాన్ని స.హ. చట్టం ప్రజలకు కల్పిస్తోంది. సహ దరఖాస్తులతోనే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 'ఈనాడు ముందడుగు' ఎన్నో అవినీతి భాగోతాలను బయటపెట్టింది. ఉద్యమకారుల కృషితో మరికొన్ని వెల్లడవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో స.హ.తో సాధించిన స్ఫూర్తివంతమైన విజయాల్లో కొన్ని ..
సహ 'ప్రకాశం' రాజీవ్ విద్యామిషన్ నేతృత్వంలో బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు విద్య నేర్పేందుకు ప్రత్యేక విద్య పేరిట ఓ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 45 మంది రిసోర్సుపర్సన్లను నియమించి వారికి జీతభత్యాల కింద ఒక్కొక్కరికి ఏటా రూ.72వేలు చెల్లిస్తున్నారు. రిసోర్సుపర్సన్లు మండలానికి ఏడెనిమిది మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ఇంటికి వెళ్లి చదువు చెప్పాలి. స.హ. చట్టం ద్వారా ఈ పథక అమలును తరచి చూస్తే.. రెండేళ్లుగా దీని కింద రూ.46లక్షలు వెచ్చించినా ప్రయోజనం శూన్యం. పథకం సరిగా నడవడం లేదని సాక్షాత్తూ పీఓనే అంగీకరించారు. లోపాలను సరి చేస్తామన్నారు.
ఆస్తులున్నా .. ప్రకాశం జిల్లా పరిషత్తుకు సుమారు రూ.300 కోట్ల ఆస్తులున్నాయి. అయినా నెలకు రూ. 50 వేల అద్దెతో ప్రైవేటు భవనంలో నడుస్తోంది. కారణం.. ఆస్తుల వివరాలేవీ ఎవరికీ తెలియదు. డీఆర్సీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు అడిగినా వివరాలందవు. దీనిపై సహ చట్టం కింద దరఖాస్తులు చేస్తే వాస్తవాలు వెల్లడయ్యాయి. జడ్పీకున్న 930 ఎకరాల్లో 525 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్న కఠోర సత్యం బయటపడింది.
లెక్కలు తేల్చిన దరఖాస్తు ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయానికి రూ.1.22 కోట్లతో భవనం నిర్మించారు. ఇందులో ఫర్నిచర్‌కు రూ.65 లక్షలు ఖర్చు పెట్టారు. మార్కెట్‌లో రూ.2వేలు దాటని కుర్చీకి రూ.9వేలు బిల్లు పెట్టారు. పనులన్నింటినీ ఇష్టారాజ్యంగా విడదీసి అయినవాళ్లందరికీ కట్టబెట్టారు. ఈ లెక్కా డొక్కా నిగ్గు తేల్చిందీ సమాచారహక్కు చట్టం ప్రకారం చేసిన ఒక్క దరఖాస్తే. - కె.శ్యాంప్రసాద్ ముఖర్జీ, న్యూస్‌టుడే, ఓంగోలు
నెల్లూరు సహ వెలుగులు అడ్డదారిలో ఆయుధం రెవెన్యూ, పోలీసు యంత్రాంగాల మధ్య సమన్వయలోపంతో జిల్లాలో ఆయుధాల లైసెన్సుల వ్యవహారం అడ్డగోలుగా తయారైంది. రెవెన్యూ, పోలీసు విభాగాల వద్ద ఉన్న లైసెన్సుల జాబితాలకు పొంతనే లేదు. జిల్లా పరిధిలో లైసెన్సు తీసుకున్నవారు పక్క రాష్ట్రాల్లో రియల్ఎస్టేట్ దందాలకు ఆయుధాలను వాడుతున్నా పట్టించుకునేవారే లేరు. దీనిపై 'ఈనాడు ముందడుగు' సమాచారాన్ని సేకరించింది. జిల్లాలో ఎంతమందికి తుపాకుల లైసెన్సులు ఇచ్చారన్న వివరాలు అడిగితే.. నాలుగేళ్ల కిందట చనిపోయిన కావలి మాజీ ఎమ్మెల్యేకు సైతం లైసెన్సు ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు తమ జాబితాలో పేర్కొన్నారు. వాస్తవానికి ప్రతి మూడేళ్లకు ఒకసారి లైసెన్సును రెన్యువల్ చేయించుకోవాలి. దీని ప్రకారం చూస్తే మాజీ ఎమ్మెల్యే లైసెన్సు పునరుద్ధరణ అసాధ్యం. అలాంటిది అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. రికార్డుల్లో ఇంకా ఆ నాయకుడికి లైసెన్సు ఉన్నట్టుగానే ఉంది. వాస్తవాలు బయటపడటంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. - పి.మృత్యంజయకుమార్, న్యూస్‌టుడే, నెల్లూరు
ఎంత బాధ్యతారాహిత్యం! ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాన్ని, ఉద్యోగుల బాధ్యతారాహిత్యాన్ని తెలిపే ఉదంతమిది.. జిల్లాలో కొందరు ఉద్యోగులు మాత్రం ఏళ్ల తరబడి గైర్హాజరీలో ఉన్నారు. విధులుకు డుమ్మా కొట్టినా.. ఠంఛనుగా జీతం తీసుకుంటున్న వారి లీలలను సహ చట్టం వెలుగులోకి తెచ్చింది. దాంతో వారికి ఉద్వాసన పలికేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయాల్లో అయిదుగురు సిబ్బంది రెండేళ్లుగా విధులకు గైర్హాజరవుతూ కూడా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. కార్యాలయంలో ఉన్న సిబ్బంది, వారి హాజరుపై చేసిన సహ దరఖాస్తుకు అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ జరగుతోంది.
ప్రజాప్రయోజనం నెరవేరిందిలా.. జిల్లాలో రూ.పది లక్షల వ్యయంతో 65 టీవీలను సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా పంచాయతీలకు ఇచ్చారు. గ్రామీణులకు విజ్ఞానం, వినోదాన్ని అందించే లక్ష్యంతో వీటిని పంపిణీ చేశారు. అయితే.. ఎక్కడా లక్ష్యం నెరవేరలేదు. దీనిపై 'ఈనాడు ముందడుగు' దరఖాస్తు చేసింది. అన్ని పంచాయతీల్లో, కమ్యూనిటీ భవనాల్లో టీవీలు ఉన్నాయనే సమాచారం వచ్చింది. దానిపై క్షేత్ర పరిశీలన చేస్తే.. ఒక్క పంచాయతీలోనూ ప్రజలకు అందుబాటులో టీవీ ఉన్న దాఖలానే లేదు. సర్పంచులు, వీఆర్వోల ఇళ్లలోనే ఉన్నాయి. విషయం వెల్లడవటంతో టీవీలను అధికారులు కమ్యూనిటీ హాళ్లకు, పంచాయతీ కార్యాలయాలకు తరలించారు. |
|