|
|
| నకిలీ బంగారంపై రుణాలు |
| ప్రచురణ తేది: 02/11/2009 |
|
సహ చట్టంతో వెలుగులోకి వచ్చిన ఏపీజీబీ నిర్వాకం ఇప్పటి వరకూ నకిలీ పాసు పుస్తకాలు, తప్పుడు ఆస్తుల పత్రాలతో బ్యాంకులకు టోపీ పెట్టిన ఘటనలనే చూశాం. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను పొందిన వ్యవహారం తాజాగా కడప జిల్లాలో బయటపడింది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో (గతంలో రాయలసీమ గ్రామీణ బ్యాంకు) జరిగిన ఈ అక్రమాలు బయటపడకుండా.. ఇచ్చిన రుణాల రికవరీకి అధికారులు ప్రయత్నిస్తున్నారు. విశ్రాంత బ్యాంకు మేనేజర్, సహచర వేదిక సభ్యుడు యు.రంగారెడ్డి సేకరించిన సమాచారంతో వాస్తవాలు వెల్లడయ్యాయి.
ఎలా ఇచ్చారో..? ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రాయచోటి, పెట్నికోట శాఖల్లో (2004లో) నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేశారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో రావడంతో విజిలెన్స్ అధికారులు విచారించి అక్రమాలను నిర్ధారించారు. బ్యాంకు యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరించడంతో 2006లో తిరిగి అక్రమాలు జరిగాయి.వల్లూరు, పెద్దచెప్పలి, ఓబుళవారిపల్లి, నెల్లూరు శాఖల్లో రూ.65,13,500లను నకిలీ బంగారంపై రుణాలుగా ఇచ్చారు. ఆలస్యంగా కళ్లు తెరిచిన బ్యాంకు ఉన్నతాధికారులు రుణ గ్రహీతలపై కేసులు నమోదు, సిబ్బందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి చేతులు దులుపుకున్నారు. రుణాల రికవరీలో నిర్లక్ష్యం వహించారు. ఓబుళవారిపల్లి శాఖలో పూర్తిగా, మిగిలిన వాటిల్లో పాక్షికంగా సొమ్మును రాబట్టారు. 2009 ఆగస్టు 29 నాటికి కేవలం రూ.17,45,436 రికవరీ చేశారు. - జి.సోమనాధ్, న్యూస్‌టుడే, కడప |
|