శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
మా గురించి

ఈనాడు ముందడుగు

తెలుగు గడ్డమీద అవినీతిరహిత మహోదయం కోసం తెలుగువాడి పక్షాన ఈనాడుతన అక్షర అక్షౌహిణులను మోహరిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి చీడను చిదిమేసే లక్ష్యంతో, మడమ తిప్పని మహోద్యమ నిర్మాణానికి ఈనాడు ముందడుగుపేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సామాజిక న్యాయ ప్రయోక్త, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆదర్శాల్ని గుండెల్లో పొదుపుకొని- మహోద్యమ పథంలో ముందడుగే ఆ మహనీయుని దివ్య స్మృతికి ఈనాడుసమర్పిస్తున్న ఘన నివాళి ! నేటి నుంచి సమాచార హక్కును రాష్ట్ర ప్రజలందరి చేతి వజ్రాయుధంగా మలచడమే ఈనాడు ముందడుగుపని. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సమాచార హక్కును అరి భంజక కరవాలంగా ఝళిపించాలి అని పిలుపునిస్తున్నారు రామోజీరావు.

 

కడుపులో దాచిన అమృత భాండాన్ని ఛేదిస్తేనేగాని రావణాసురుడి పది తలలు తెగిపడవన్నది రామాయణంలో విభీషణుడిచ్చిన సమాచారం. శ్రీరాముడెంతటి అవతార పురుషుడైనా ఆ సమాచారం అందిన తరువాతే సాధ్యపడింది సహా దానవ సంహారం! మహాభారతంలోనూ అంతే! మంచి చెడుల మధ్య జరిగిన కురుక్షేత్ర సమరంలో అత్యవసర సమయంలో తెలిసిన కీలక సమాచారమే పాండవుల విజయానికి కారణభూతమైంది. సమాచారం అన్నది ఓ తిరుగులేని అస్త్రం. ప్రజలే ప్రభువులంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో జాగృత జనవాహిని చేతిలో అది అక్షరాలా పాశుపతాస్త్రం! పాలనకు పీడన అనే దురర్థం స్థిరపడరాదన్నా, పీడకుల పీచమణచే శక్తి బడుగు జనావళికి దక్కాలన్నా- ఓ హక్కుగా సమాచారాన్ని ఒడిసిపట్టి, ఒడుపుగా ప్రయోగించే నైపుణ్యాన్ని సమస్త ప్రజానీకం సంతరించుకోవాలి. సమాచార హక్కు చట్టంతో అవినీతిపరుల ఆట కట్టించే మహోద్యమానికి తెలుగువాడే నాందీ వాచకం పలకాలి!

 

కేంద్రప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చి రెండున్నరేళ్లు దాటింది. అరవయ్యేళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే విప్లవాత్మక చట్టం తెచ్చిన ఘనత తమ సొంతమని సంకీర్ణ సారథులు లేని గొప్పలు చెప్పుకోవచ్చు గాక, ఆచరణలో దాన్నెలా నీరుగారుస్తున్నారో అడుగడుగునా తేటపడుతూనే ఉంది. 1923నాటి అధికార రహస్యాల చట్టాన్ని కడుపులో దాచిన అవినీతి దశకంఠులతో కిందనుంచి పైస్థాయిదాకా పాలన వ్యవస్థ అంతా లుకలుకలాడి పోతోంది! ఏటా రెండు లక్షలకోట్ల రూపాయలకుపైగా లంచాల మేత సాగుతోందంటే, సర్కారీ అవినీతి ఎంత చట్టబద్ధమైందోబోధపడుతుంది. ఆరు దశాబ్దాలుగా భారతీయ సమాజంలో అవిద్య, అజ్ఞానాల్ని దినదినాభివృద్ధి చేసిన పెద్దలు- ప్రజల్లో ప్రశ్నించే నైజాన్ని క్రమంగా కాలరాశారు. ఇప్పుడిప్పుడే గొంతెత్తుతున్న జనవాహిని సమాచార హక్కును సమర్థంగా వినియోగించుకునే వీల్లేకుండా దారులు మూస్తున్నారు. సమాచార హక్కు దండం పట్టి, సిసలైన సార్వభౌములుగా జనం పాలకశ్రేణుల్ని వారి తప్పొప్పులకు జవాబుదారీ చేయాల్సిన సమయమిదే. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు సాగే ఈ పోరాటంలో అంతిమ విజయం అశేష ప్రజానీకానిదే!

 

ప్రజలకు హక్కులు, ప్రభుత్వాధికారులకు బాధ్యతలు బదలాయించి అన్నిస్థాయిల్లోనూ పారదర్శక పాలన సాగించాలని అధికారం చేపట్టిన కొత్తలో ప్రధానమంత్రి అభిలషించారు. ఇప్పటికీ నడుస్తున్న కథ వేరు! శాసన వ్యవస్థ చేసే ఏ చట్టమైనా ప్రజల కోసమే అంటున్నప్పుడు, ఏ నిబంధనల అమలుకైనా ప్రజాప్రయోజనాలే పరమావధి అయినప్పుడు పాలనలో అసలు దాపరికమెందుకు? దశాబ్దాలుగా ఈ దాపరికమే అవినీతికి ఎరువుగా మారింది. తమను ఎవరూ గమనించడం లేదన్నప్పుడే నేరగాళ్లు రెచ్చిపోతారు. అవినీతిపరులు అభినవ బకాసురులవుతారు. ప్రజల రోజువారీ అవసరాలు తీర్చే ప్రభుత్వ కార్యాలయాల్లో చిలక్కొట్టుడుఅవినీతి ఒకరకం!. అస్మదీయుల కోసం చట్టాల్నే చాపచుట్టేసి ఏకమొత్తంగా ప్రజాధనాన్ని లూటీ చేసే జగజ్టెట్టీల ఆర్థిక నేరాలు మరోరకం!. పాలనలో అవినీతి అన్ని విభాగాలకూ పాకిపోయి జనజీవనాన్ని దుర్భరం చేస్తున్న వేళ ఇంకా ఓపిక పట్టడం సరికాదు; సమాచార హక్కు చట్టంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్నే ఓ పట్టు పట్టాలి. అవినీతి రహిత పాలన మన హక్కు. దాన్ని సాధించేందుకు సమాచారోద్యమ కొదమ సింహాలై ప్రతి ఒక్కరూ జూలు విదల్చాలి!

 

పదకొండో ప్రణాళికలో ఖర్చు చేయాలనుకొంటున్న మొత్తం దాదాపు రూ.36లక్షల కోట్లు. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లక్షకోట్ల రూపాయల పైచిలుకు! అదంతా ఎవడబ్బ సొమ్ము? హమారా పైసా, హమారా హిసాబ్’ (డబ్బు మాది, లెక్కలు మాకే) అంటూ రాజస్థాన్ లోని ఓ పల్లెలో పురుడు పోసుకొన్న ఆందోళన సమాచార హక్కు చట్టానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. పౌరులు కోరిన ఏ సమాచారాన్నైనా నిర్ణీత కాలంలో వారికి అందించేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ తగు ఏర్పాట్లు చేసుకోవాలని, సమాచారం అందలేదన్న ఫిర్యాదులపై విచారణకూ ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలనీ చట్టమే నిర్దేశించింది. సమాచార చట్టం తాలూకు ప్రయోజనాల్ని జనంలో విరివిగా ప్రచారం చెయ్యడమూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి. అవేమీ సక్రమంగా చేయని ప్రభుత్వాల సాక్షిగా అవినీతి విక్రమిస్తోంది. ఈ అరాచకత్వాన్ని చెండాడేందుకే మోగించాలి సమాచార సమరభేరి!

 

వల్లించేది ప్రజాశ్రేయం, వెచ్చించేది ప్రజాధనం అయినప్పుడు ప్రభుత్వం ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తోందన్న సమాచారం ప్రజలకు తెలియకుండా తొక్కిపట్టడం ప్రజాద్రోహం! గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటిదాకా 1618కోట్ల రూపాయలు కూలీగా చెల్లించారట! ఉపాధి హామీ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటున్న పెద్దలు ఏయే పనులు ఎంత సక్రమంగా పూర్తిచేశారో ప్రజలకు తెలియజేయనక్కర్లేదా? దేవాలయ భూముల బాగోతం మొదలు డిపెప్ కుంభకోణం దాకా పత్రికలే వెలుగులోకి తెస్తుంటే, వాటిపైనా సంకుచిత రాజకీయ ముద్రలేసి తప్పించుకోజూస్తున్న తెంపరితనం పాలకులది. దొంగే దొంగా, దొంగాఅంటూ ఎదురుదాడికి దిగుతున్న వేళ- సమాచార హక్కు చట్టంతో ప్రజలే అవినీతి బాసుల ముసుగులు తొలగించే మహోద్యమ వీరులు కావాలి!

 

తెలుగు గడ్డమీద అవినీతిరహిత మహోదయం కోసం తెలుగువాడి పక్షాన ఈనాడుతన అక్షర అక్షౌహిణులను మోహరిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి చీడను చిదిమేసే లక్ష్యంతో, మడమ తిప్పని మహోద్యమ నిర్మాణానికి ఈనాడు ముందడుగుపేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సామాజిక న్యాయ ప్రయోక్త, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆదర్శాల్ని గుండెల్లో పొదుగుకొని మహోద్యమ పథంలో ముందడుగే ఆ మహనీయుని దివ్యస్మృతికి ఈనాడుసమర్పిస్తున్న ఘన నివాళి! నేటి (అంబేద్కర్ జయంతి) నుంచి సమాచార హక్కును రాష్ట్ర ప్రజలందరి చేతి వజ్రాయుధంగా మలచడమే ఈనాడు ముందడుగుపని. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సమాచార హక్కును అరి భంజక కరవాలంగా ఝళిపించాలి. ఏ స్థాయిలో ఉన్నా అవినీతిని గురితప్పక ఖండించాలి. ఈ మహాక్రతువులో ఈనాడు ముందడుగురాష్ట్ర ప్రజలందరికీ అన్ని అంచెల్లోనూ చేదోడువాదోడుగా ఉంటుంది. సమాచార హక్కుపై జనజాగృతి కోసం పత్రికలో ఈనాడు ముందడుగుప్రత్యేక పేజీలు కేటాయించడమేకాదు, జిల్లాస్థాయిలో సమాచార సారథుల్నీ నియమిస్తోంది. అవినీతిపై పోరులో ప్రజలందరికీ మార్గదర్శనం చేయడం వీరి పని. సమాచారం కోరే దరఖాస్తు ఫారాల్ని ముద్రించి అడిగినవారందరికీ ఉచితంగా అందివ్వడమేకాదు, వారి ఆశయ సాధనకు ఈనాడు ముందడుగుతోడుగా నిలుస్తుంది. తమ నోటిదగ్గర ముద్దను కబళిస్తున్న అవినీతి గద్దలను ఎలా ఎదుర్కోవాలో తెలియని కోట్లాది ప్రజలకు అండగా రాష్ట్ర విశాలహితం కోరి ఈనాడు ముందడుగుమోగిస్తున్న కదనకాహళి ఇది. అవినీతి భరతం పట్టేందుకు చట్టబద్ధంగా సాగే పోరు ఇది. బాధ్యతగల పౌరులూ స్వచ్ఛంద సంస్థలూ ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములైతే నీతి నిలుస్తుంది, తెలుగు జాతి గెలుస్తుంది.

 

సమాచార హక్కే మన ఆయుధం

అవినీతి అంతానికి పోరాడదాం! 

రామోజీరావు

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by Cogent మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008