| ప్రజల చేతిలో ఆయుధం.. సమాచార హక్కు చట్టం |
| ప్రచురణ తేది: 28/08/2009 |
|
* పాలకుల్లో జవాబుదారీతనానికి దోహదం * 'ఈనాడు' కృషి అభినందనీయం * నాగార్జున వీసీ హరగోపాలరెడ్డి
ఎ .ఎన్.యు., న్యూస్‌టుడే సమాచార హక్కు చట్టం.. విప్లవాత్మకమైనది. ఇది ప్రజలకు లభించిన ఆయుధం లాంటిది. ప్రజలు అవగాహన పెంచుకొని వినియోగించుకుంటే ప్రభుత్వాలు అవినీతి, అరమరికలులేని జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడానికి ఆస్కారముంటుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వై.ఆర్.హరగోపాలరెడ్డి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో గురువారం 'ఈనాడు - ముందడుగు' ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం - 2005పై ఏర్పాటు చేసిన 50వ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి ఆర్.సురేష్ అధ్యక్షత వహించారు. హరగోపాలరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం 'ఈనాడు' ఒక సామాజిక బాధ్యతగా చేపట్టి గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో అవగాహనసదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చట్టంపై అవగాహన ఏర్పడి భావితరాలకు ఎంతో ఉపయోగపడతారని అన్నారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రజలే పాలకులు కాబట్టి ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలు, ఖర్చు చేస్తున్న నిధుల గురించి తెలుసుకొనే వీలుందన్నారు. దుబారా, అవినీతి జరిగితే ప్రభుత్వాలను ప్రశ్నించడానికి చట్టం దోహదపడుతుందన్నారు. అయితే చట్టాన్ని కొంతమంది వ్యక్తిగత స్వార్థాలకు ఉపయోగించుకొంటూ దుర్వినియోగం చేస్తున్నారని, దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. గౌరవ అతిథి రెక్టర్ ఆచార్య కె.వియన్నారావు మాట్లాడుతూ విప్లవాత్మక సమాచారహక్కు చట్టాన్ని 'ఈనాడు ముందడుగు' ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా చేయడం శుభపరిణామమన్నారు. పారదర్శక పాలనతో పాటు పాలకులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి చట్టం దోహదపడుతుందన్నారు. మరో గౌరవ అతిథి రిజిస్ట్రార్ ఆచార్య ఎం.వి.ఎన్.శర్మ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించడం ద్వారా వారు తమ ప్రాంతాల ప్రజలకు వివరించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తాము తెలుసుకున్న అంశాలను ప్రజలకు తెలియచెప్పడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. చట్టంపై ప్రజలకు అవగాహన ఏర్పడితే సమాజాభివృద్ధి జరుగుతుందని అన్నారు. అతిథి ఓఎస్‌డీ ఆచార్య శామ్యూల్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ విధానంలో చట్టం గురించి ప్రచారం చేయాలన్నారు. మరో అతిథి ఒ.ఎస్.డి. కామర్స్ విభాగాధిపతి ఆచార్య జి.ప్రసాద్ మాట్లాడుతూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. విశ్వవిద్యాలయ సమాచార హక్కుచట్టం ప్రజా సమాచార అధికారి డాక్టర్ వై.కిషోర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తామని తెలిపారు. సమాచారాన్ని అడిగిన వెంటనే అందించడంతోపాటు వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి సురేష్ మాట్లాడుతూ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈనాడు దృఢసంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. వర్సిటీలో తొలుత సదస్సు నిర్వహించిన తర్వాత గుంటూరు జిల్లాలోని అనుబంధ కళాశాలల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వివరాలకు 'ఈనాడు' ముందడుగు విభాగం సెల్‌నంబరు 9951942225 ను సంప్రదిస్తే మా సిబ్బంది పూర్తి సమాచారం తెలియజేస్తారని అన్నారు. అలాగే rti.eenadu.net ను సంప్రంచి పూర్తి సమాచారం పొందవచ్చన్నారు. సదస్సులో అధ్యాపకులు, జర్నలిజం, టూరిజం విభాగ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు చట్టంపై అడిగిన ప్రశ్నలకు 'ఈనాడు ముందడుగు' ప్రతినిధి ఓగురి శ్రీహరి సమాధానాలిచ్చారు.
ప్రశ్నలు - సమాధానాలు * పద్మ : సమాచారహక్కు చట్టం కింద సమాచారం తెలుసుకోవడానికి పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి సమాచారం తీసుకోవచ్చు? జవాబు : పరిమితులు ఏమీ లేవు. సెక్షన్(8)లో ఉదహరించిన మినహాయింపులు తప్ప మిగిలిన సమాచారమంతా తెలుసుకోవచ్చు.
* శివరాం : ఎన్నారైలు కూడా సమాచారం కోరవచ్చా? జవాబు : సెక్షన్(3) ప్రకారం భారతీయ పౌరులు మాత్రమే సమాచారం కోరవచ్చు. ఎన్.ఆర్.ఐ.లు సమాచారం కోరకూడదు.
* మంగారావు : కేబినెట్ నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం వేసే పలు కమిషన్లు ఇచ్చే నివేదికల్లోని అంశాలు చట్టం ద్వారా కోరవచ్చా? జవాబు: ప్రక్రియ పూర్తయిన తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా కోరవచ్చు.
* షిలార్ : మూడో పక్షం అంటే ఎవరు? జవాబు : దరఖాస్తుదారుడు, ప్రభుత్వ సంస్థ కాక మిగతా ఎవరైనా మూడో పక్షం కిందకు వస్తారు.
* పద్మ : సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇతర దేశాలకు విక్రయిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి? జవాబు : సెక్షన్(8)లో దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, అర్థిక, రక్షణ రంగాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకూడదని చట్టం నిర్దేశిస్తుంది. ఎవరైనా సమాచారాన్ని విదేశాలకు విక్రయిస్తే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హులు.
* రాము : పాత్రికేయవిద్యార్థిగా చట్టాన్ని ఎలా వినియోగించుకోవచ్చు? జవాబు : మనదగ్గర ఉన్న 80 శాతం సమాచారంతో పాటు గోప్యతతో కూడుకున్న మిగిలిన 20 శాతం సమాచారాన్ని చట్టం ద్వారా సేకరించి పాఠకులకు పూర్తి కథనాన్ని అందించవచ్చు.
* రవి : సమాచార కోసం దరఖాస్తుచేసిన నెలరోజుల్లోపు అధికారులు స్పందికపోతే ఏమి చేయాలి? జవాబు : వెంటనే ప్రభుత్వసంస్థలోని ఉన్నతాధికారికి అప్పీల్ చేయాలి.
* పద్మ : తెల్లరేషన్ కార్డుదారునికి దరఖాస్తు రుసుం నుంచి మినహాయింపు ఉన్నప్పుడు సమాచార రుసుం మినహాయింపు కూడా ఉండాలిగా? జవాబు : ఇటీవల వచ్చిన కమిషన్ తీర్పు ప్రకారం తెల్లరేషన్ కార్డుదారుడు కూడా సమాచార రుసుం చెల్లించాలి.
* శివరాం : రెండో అప్పీల్‌లో కూడా న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా? జవాబు : రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చు.
* పాండురంగారావు: దరఖాస్తు చేయకుండా ప్రభుత్వమే పూర్తి సమాచారం ఇవ్వవచ్చు కదా? జవాబు : సెక్షన్ 4(1) (బి) ప్రకారం ప్రభుత్వ సంస్థ పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
* నాగేశ్వరరావు: రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఎలాంటి ప్రకటనలు విడుదల చేయడం లేదు. చట్టంపై ప్రజల్లో అవగాహన తేవడానికి 'ఈనాడు' ఎందుకు కంకణం కట్టుకుంది?. జవాబు : 'ఈనాడు' సంస్థ ఛైర్మన్ గారు ప్రజలకు ఇచ్చే కానుకలే 'తెలుగు వెలుగు', 'ఈనాడు ముందడుగు' కార్యక్రమాలు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడాన్ని 'ఈనాడు' ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అంతే గాని ఏ ప్రభుత్వానికి, వ్యక్తులకు వ్యతిరేకం కాదు. అంతిమ లక్ష్యం ప్రజా చైతన్యం.
* మంగారావు: పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తా కథనాలు ఆధారంగా సమాచారం అడగవచ్చా? జవాబు : మీ దగ్గర నిజమైన ఆధారాలుంటే సంబంధిత ప్రజా సంస్థల సమాచారం కోరవచ్చు.
సదస్సులో జర్నలిజం కోఆర్డినేటర్ చెన్నారెడ్డి, విద్యార్థులు శివదీప, గోపి, పరమేశ్వర నాయక్‌లు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. |
|