| సమరమే..! |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
* అవినీతిపై బ్రహ్మాస్త్రం.. సమాచార హక్కు చట్టం * నేటితో చట్టానికి నాలుగేళ్లు
ప్రతి ప్రజా సంస్థలో పారదర్శకత్వం, జవాబుదారితనం పెంచుటకు సమాచార హక్కు చట్టం రూపొందించారు. దీంతో కొంత వరకు అవినీతి వెలుగులోకి వస్తోంది. అటు ప్రజాప్రతినిధుల్లోనూ, ఇటు అధికారుల్లోనూ కొంత గుబులు పుట్టిస్తుంది. నేటితో సమాచార హక్కు చట్టం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం..
-న్యూస్‌టుడే, కలెక్టరేట్ జిల్లాలో సమాచారహక్కు చట్టం అమలు అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని శాఖలు చక్కగా అమలు చేస్తుంటే, మరికొన్ని మొక్కుబడిగా కొనసాగిస్తున్నాయి. ఇచ్చే సమాచారంలోనూ దరఖాస్తుదారు కోరిన విధంగా ఇవ్వడం లేదు. చట్టంపై అవగాహన కల్పించడానికి 'ఈనాడు-ముందడుగు' ఆధ్వర్యంలో ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తోంది.
* అమలు తీరిలా..: జిల్లాలో సమాచారహక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ వివిధ శాఖల్లో 766 దరఖాస్తులు రాగా, వాటిలో 661 పరిష్కరించారు. 105 పరిష్కరించలేదు. ఇక అప్పీల్ విషయానికి వస్తే 117 రాగా 97 పరిష్కరించారు. 20 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిలో దరఖాస్తుదారుడు కోరిన విధంగా ఇచ్చిన సమాచారం కొన్నే ఉన్నాయి.
* దరఖాస్తులు రాని శాఖలు: సమాచార హక్కు చట్టంపై అసలు దరఖాస్తు రాని శాఖలు చాలా ఉన్నాయి. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం, వికలాంగుల శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఈఆర్‌డబ్ల్యూఎస్, ఎక్సైజ్, ఎంసీఎల్పీ, వయోజన విద్య ఇలా అనేక శాఖల పరిధిలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు..
సమాచార హక్కు చట్టం అంటే.. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు, ప్రభుత్వ పాలన పారదర్శకంగా కొనసాగేలా.. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రైవేట్ సంస్థల నుంచి పౌరులు సమాచారం పొందేందుకు ప్రజలు తయారు చేసుకున్న చట్టం.
* అమలు ఎందుకంటే: ప్రతి ప్రజా సంస్థలో పారదర్శకత్వాన్ని జవాబుదారీతనాన్ని పెంచడానికి కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్లను స్థాపించడానికి సమాచార హక్కు చట్టం రూపొందించారు.
ఏం తెలుసుకోవచ్చు..? 1) మీ ప్రాంతంలో రేషన్‌షాపు వివరాలు, నెలవారీ వస్తున్న సరకు వివరాలు, పనివేళలు, నియమాలు, నియంత్రించే అధికారుల వివరాలు.
* మీరు ప్రభుత్వ పథకానికి/ రేషన్ కార్డుకోసం/ ఇళ్ల స్థలానికి పెట్టిన దరఖాస్తు ఏమైంది? వాటిని ఎలా మంజూరు చేస్తారు? లబ్ధిదారుల జాబితాలు
* మీ ఆరోగ్యకేంద్రం అందించే సేవల వివరాలు, పనివేళలు, ఉండాల్సిన మందుల వివరాలు.
* మీ ప్రాంతంలో ఒక రోడ్డు, డ్రైను వేస్తుంటే దాని అంచనా కాపీ, కాంట్రాక్టరు వివరాలు, నాణ్యత పరీక్ష కోసం నమూనాలు తీసుకోవచ్చు. ఇలా మీ నిత్యజీవితంలో మీకోసం, మీచుట్టూ జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాల వివరాలు పొందవచ్చు.
2) ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యకలాపాల సమాచారం. * కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, న్యాయస్థానాలు, పోలీసు తదితర సంస్థలు, పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల అధీనంలో ఉన్న సమాచారం పొందవచ్చు. అవి అందించే సేవలు, నిర్వహిస్తున్న పథకాలు, లబ్ధిదారుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సంస్థల బడ్జెట్లు, జమ ఖర్చుల పట్టిక పొందవచ్చు.
3) రికార్డుల, పనుల పరిశీలన. * ఈ అన్ని సంస్థలలో రికార్డులను పరిశీలించవచ్చును. వాటి నుంచి నోట్సు తీసుకోవచ్చు. ధ్రువీకరణ కాపీలు పొందవచ్చు. * ప్రభుత్వం నిర్వహించే వివిధ పనుల పరిశీలనకు, సర్టిఫైడ్ నమూనాలు..
సమాచారం పొందటం ఎలా...? * తెలుగులో దరఖాస్తు చేసుకోవచ్చు. * కోరుతున్న సమాచార వివరాలు నిర్ధిష్టంగా ఉండాలి. * సమాచారం అడగడానికి కారణాలు చెప్పనవసరం లేదు * ఉత్తర ప్రత్యుత్తరాల నిమిత్తం చిరునామా ఇవ్వాలి. * దరఖాస్తుతో పాటు నిర్ణయించిన రుసుము చెల్లించాలి. * సమాచారానికి నిర్ణయించిన ఫీజు, సమాచారం పొందే ముందు చెల్లించాలి. * దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ఫీజులుండవు. * మీరు సమాచారం కోరుతున్న సంస్థ కార్యాలయంలో ఉండే పబ్లిక్ ఇన్‌ఫర్‌మేషన్ ఆఫీసర్ లేదా వారి సహాయకులుగా నియమించిబడిన వారికి దరఖాస్తు చేయాలి.
కాలపరిమితి : * దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా సమాచారం అందించాలి. * వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు సంబంధించి సమాచారాన్ని 48 గంటల్లోనే అందించాలి. * పూర్తి సమాచారం ఇవ్వడం, చట్టరీత్యా సాధ్యం కానప్పుడు, పాక్షిక సమాచారాన్ని పొందవచ్చు. * దరఖాస్తు తిరస్కరిస్తే రాతపూర్వకంగా కారణాలు తెలపాలి.
* అప్పీలు: * దరఖాస్తు స్వీకరణకు నిరాకరించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, గడువులోగా ఇవ్వకపోయినా, పూర్తి సమాచారం ఇవ్వకపోయినా, సమాచారానికి ఫీజు ఎక్కువని భావించినా అప్పీలు చేసుకోవచ్చు. * మొదటి అప్పీలు ఆ ప్రభుత్వ శాఖ, సంస్థలో నిర్ధేశించిన పై అధికారికి 30 రోజుల్లోగా అప్పీలు చేసుకోవాలి.
* సమాచార కమిషన్: * సమాచారహక్కు చట్టం అమలుకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్రం, రాష్ట్ర కమీషన్లను ఏర్పాటు చేశారు. * తొలి అప్పీలులోనూ సమాచారం ఇవ్వకపోతే తుది అప్పీలు ఈ కమిషన్‌కు చేసుకోవాలి. దాని నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది.
మినహాయింపులు ..: * సమచార హక్కు చట్టంలో సమాచారం ఇవ్వడానికి కొన్ని అంశాలను మినహాయింపు చేశారు. * దేశసార్వభౌమత్వానికి, సమగ్రతకు, వ్యూహాపరమైన, శాస్త్రీయ, ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే సమాచారం. * విదేశీ సంబంధాలను దెబ్బతీసే, ఏదేని నేరాన్ని ప్రేరేపించేందుకు ఉపయోగించే సమాచారం. * కోర్టులో ట్రిబ్యునల్ ద్వారా స్పష్టంగా నిషేధింపబడిన, కోర్టు ధిక్కారం కిందకు వచ్చే సమాచారం. * పార్లమెంట్ రాష్ట్ర శాసన సభల హక్కుల బంధం కిందికి వచ్చే సమాచారం.
వెలుగులోకి .. సమాచారహక్కు చట్టంతో అనేక అక్రమాలను సామాన్య ప్రజలు బయటకు తీసుకురాగలిగారు.. దీంతో పాటు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి పేదలకు న్యాయం చేయగలిగారు..
వర్మీ కంపోస్టు: వాటర్‌షెడ్ ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలిపేందుకు ఓ అనామక సంస్థలకు రూ.లక్షలు ధారపోస్తున్నట్లు సమాచారహక్కు చట్టం ద్వారా సంజీవ్‌యాద్‌వ్ వెలుగులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఒప్పందం లేదు. దానికి తగ్గట్లుగానే మూడేళ్ల తర్వాత ఆక్షేత్రమంతా అగ్నికి ఆహుతికి గురైంది. బైఫ్ అనే పుణే సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం 2004-05లో 4.31లక్షలు, 2005-06లో 1.25లక్షలు, 2006-07లో 1.30లక్షలు, 2008-09లో 2లక్షలు విడుదల చేశారు. రూ.లక్షల విలువ చేసే అవినీతిని సమాచారహక్కు చట్టం ద్వారా బయటికి తీసుకొచ్చారు.
సర్పంచ్ అవినీతిపై భూత్పూర్ సర్పంచ్ ప్రమీళా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారన్న సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా రవికుమార్ సేకరించారు. 85 కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తే.. ఒక్కోదానికి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలి. కానీ కేవలం రూ.4 వేలు మాత్రమే పంచాయతీ ఖాతాలో జమఅయ్యాయి.. నేరుగా రూ.81 వేలను సర్పంచి భర్త తీసుకున్నారు. ఇలా తైబజార్, గృహనిర్మాణాలు, లేఅవుట్లు, తదితర వాటిలో జరుగుతున్న అవినీతిని అధికారుల దృష్టికి తేగలిగారు.
ఇందిరమ్మ అవినీతిపై: కొల్లాపూర్ మండలం గోపాలపూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై రామేశ్వర్‌రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారులకు చెల్లించిన డబ్బు, డ్రా చేసిన బ్యాంకులు తదితర వివరాలను ఇవ్వాలని కోరారు. అయితే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే దాదాపు 25 మంది జాబితాలో లేనివారు ఒక్కొక్కరు రూ.22వేలు బ్యాంకు నుంచి డ్రా చేసిట్లు తేలింది. |
|