| ఇది సామాన్యుల విజయం... |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
స .హ.చట్టంతో సదుపాయాలు సాధించిన 'ఆల్‌బ్యాంక్' వాసులు
వారంతా సామాన్య ఉద్యోగులు... ఉదయం ఆఫీసుకెళ్లి... రాత్రికి ఇంటికొచ్చి ప్రశాంతంగా గడపాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవారు... నగరపాలక సంస్థ ఎన్ని పన్నులు వేసినా... ఎంత ముక్కుపిండి వసూలు చేసినా... కిక్కురుమనకుండా చెల్లించేవారు... అయితే వారు నివసించే ప్రాంతంలో కార్పొరేషన్ ఎలాంటి సదుపాయాలూ కల్పించలేదు... దాదాపు పాతికేళ్లు అలానే భరించిన వారంతా తర్వాత విసిగిపోయారు... ఇక కుదరదంటూ యుద్ధాన్ని ప్రకటించారు... సమాచార హక్కు చట్టాన్నే ఆయుధంగా చేసుకుని... విరామమెరుగని పోరాటం చేశారు... చివరికి విజయాన్ని సాధించారు... ఏమా జయం... ఏమిటా కథ... చదవండి..,
న్యూస్‌టుడే , రాజమండ్రి గ్రామీణం: రాజమండ్రి నగరంలోని ఆల్‌బ్యాంకు కాలనీ వాసులు అధ్వానంగా ఉన్న తమ ప్రాంతాన్ని సమాచార హక్కు చట్టంతో తీర్చిదిద్దుకున్నారు. 1985లో ఏర్పడిన ఈ కాలనీలోని ప్రజలు కనీస వసతులైన రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీలు వంటి మౌలిక సదుపాయాలకు దాదాపు 20ఏళ్ల వరకూ దూరంగా ఉండిపోయారు. దీనిపై వారు ఎన్నోసార్లు నగర కార్పొరేషన్ కమిషనర్‌ను మొరపెట్టుకున్నారు. అయినా ఏళ్లు గడుస్తున్నాయి కానీ సదుపాయాలు సమకూరలేదు.
స .హ. చట్టం తోడుగా... ఇంతలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఏదోలా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కాలనీ వాసులు తలచారు. ఒకరిద్దరు కలిసి గత ఏడాది జులై 12న కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశారు. తాము కాలనీ ఏర్పడిన నాటినుంచీ ఇప్పటివరకూ ఎంత సొమ్ము పన్నుల రూపంలో చెల్లించామో చెప్పమని.. దానికి ప్రతిగా కార్పొరేషన్ తమకు ఏమేం సదుపాయాలు కల్పించిందో తెలపాలని దరఖాస్తులో ప్రశ్నించారు. దీనికి మొదట్లో సమాధానం లేదు. తర్వాత మరికొందరు... అనంతరం ఇంకొందరు.. అలా 40మంది వరకూ విరామమెరుగకుండా దరఖాస్తు చేశారు. దీంతో కార్పొరేషన్ అధికారులు దిగివచ్చారు. నాటి కమిషనర్ కాలనీని సందర్శించారు. ఏడాదిలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన సమయానికి సదుపాయాలు సమకూరాయి. రోడ్డు వేశారు. డ్రెయిన్లు నిర్మించారు. ప్రతి ఇంటికీ మున్సిపల్ కుళాయి వచ్చేసింది. దాదాపు 90శాతం సమస్యలు పరిష్కృతమయ్యాయి. ఇది స.హ.చట్టం వల్లే సాధ్యమైందని కాలనీ వాసులు ఆనందం వ్యక్తంచేశారు.
పోస్టల్ ఆర్డర్స్ ఇచ్చినా తోచిపుచ్చారు స.హ. చట్టంలో దరఖాస్తుతో పాటు పోస్టల్ ఆర్డర్స్ జత చేశాం. నగరపాలక సంస్థ అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో పోస్టల్ ఆర్డర్స్ జత చేసిన దరఖాస్తులను తిరస్కరించారు. జీవో నంబరు 740 ప్రకారం పోస్టల్ ఆర్డర్స్ జత చేయవచ్చని వివరణలో దరఖాస్తు పెట్టాం. అప్పుడుగానీ మా దరఖాస్తును స్వీకరించలేదు! - విజయ్‌కుమార్, ఆల్‌బ్యాంకుకాలనీ
పన్నులు చెల్లించినా... డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా అప్రూవల్ లేఅవుట్ అయిన తమ ప్రాంతంలో స్థానికులందరూ సక్రమంగా టాక్సులు చెల్లిస్తున్న ఎందుకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. సహ చట్టంతోనే అధికారుల్లో చలనం వచ్చింది. - పి.రవిశంకరప్రసాద్, ఆల్‌బ్యాంకు కాలనీ |
|