| అధికారుల్లో జవాబుదారీతనం |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
వనపర్తి , న్యూస్‌టుడే: సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత అధికారుల్లో కొంత వరకైనా జవాబుదారితనం పెరిగింది. అయితే వనపర్తి నియోజకవర్గంలో సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని పొందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇంకా సామాన్య ప్రజలకు చట్టం గురించి పూర్తి అవగాహన రాలేదు.
ఎక్సయిజ్ వివరాలు సామాన్యంగా ప్రొహిబిషను, ఎక్సయిజ్ శాఖలో ఏ వివరాలడిగినా ఇవ్వరు. ఏదో పై పైన సమాచారమిచ్చి తమకు తెలియదనో, కొత్తగా వచ్చామనో దాటవేస్తుంటారు. ఇటీవల ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన ఆకె రవిక్రిష్ణ సమాచార హక్కు చట్టం కింద జిల్లాలో గీతచెట్లు, లైసెన్సు, లైసెన్సులేని కల్లుదుకాణాలు, కేసుల నమోదు తదితర వివరాలను అడిగారు. ఆయన బదిలీ అయినా నెల రోజుల వ్యవధిలోనే ఎక్సయిజ్ అధికారులు సమాచారమివ్వక తప్పలేదు.
మెరుగైన సమాజానికి పునాది - రవిక్రిష్ణ, పార్వతిపురం ఏఎస్పీ ప్రజల్లో చైతన్యం వచ్చింది. అధికారుల్లోనూ మార్పు వచ్చింది. గ్రామీణ స్థాయి ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. సహ చట్టం తమకోసమేనా..? ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయం వారికి తెలియడంలేదు. నేను వనపర్తిలో ఉండగా ఎక్సయిజ్‌శాఖ నుంచి ఈ చట్టం ద్వారా వివరాలు తెప్పించుకున్నాను. మెరుగైన సమాజానికి సమాచారం పునాదిలాంటిది.
అడిగిన వారికిస్తున్నాం -రామచంద్రారెడ్డి, వనపర్తి ఆర్డీఓ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వారికి సమాచారమిస్తున్నాం. అయితే ఈ చట్టం కింద వస్తున్న అర్జీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా తక్కువ వచ్చాయి. వచ్చిన వాటికి సమాచారం ఇచ్చాం.
సహ చట్టం ద్వారా పాస్‌పోర్టు -పి.బాలక్రిష్ణ, వనపర్తి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విదేశీ మంత్రిత్వశాఖకు చెందిన పాస్‌పోర్టు కార్యాలయంలో అట్టడుగున ఉన్న నా దరఖాస్తుకు సహ చట్టం ద్వారా మోక్షం లభించింది. సికింద్రాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అధికార యంత్రాంగం నుంచి కదలిక రావడం, నేను చేసిన దరఖాస్తు వల్ల పాస్‌పోర్టు లభించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఈ చట్టం అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల్లో స్పందన లేని కారణంగా సహచట్టం కమిషనర్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.
తప్పుడు సమాచారాన్ని సేకరించగలిగాను -నర్సింగరావు ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసిన అభ్యర్థి లక్ష్మారెడ్డి తన అఫిడవిట్‌లో పూర్తి సమాచారాన్ని పొందు పర్చకపోవడాన్ని గమనించి సమాచార హక్కు చట్టం వినియోగించాను. కేవలం రూ.10 ఐపీఓతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేశాను. లక్ష్మారెడ్డి పొందుపర్చిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు 2006లో దరఖాస్తు చేశాను. ఇందుకు నెల రోజుల్లోనే కలెక్టర్ నుంచి సమాధానం అందింది. పూర్తి సమాధానం లభించకపోవడంతో శాసనసభ కార్యదర్శికి అప్పీల్ చేయగా పూర్తి సమాచారం లభించింది. దీంతో ఎన్నికల సంఘానికి, శాసన సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. |
|