| సమాచార హక్కుతోనే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ |
| ప్రచురణ తేది: 24/10/2009 |
|
నూజివీడు , (న్యూస్‌టుడే): సమాచార హక్కుతోనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మనగలుగుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత యువతపై ఉందని నూజివీడు సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సి.హెచ్.వి.సురేష్ అన్నారు. శుక్రవారం కళాశాలలో 'ఈనాడు- ముందడుగు' ఆధ్వర్యంలో స.హ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులకు అనుగుణంగా ప్రజలకు విద్య, వైద్య ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా అనే దానిపై అవగాహన పెంచుకుని ఈ చట్టం ద్వారా ప్రశ్నించగలగాలన్నారు. పేరుకుపోయిన కుళ్లును కడగడానికి ఈ చట్టం ద్వారా యువత నడుం బిగిస్తే మెరుగైన సమాజాన్ని చూడగలుగుతామని చెప్పారు. పాలనలో ప్రభుత్వాలు పారదర్శకత పాటించడం లేదని స.హ చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు జి.హరిబాబు విమర్శించారు. చట్టాన్ని చేసిన ప్రభుత్వం తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండన్న చందంగా దానిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదిర్శ కొండపావులూరు ముఖర్జీ ప్రసంగిస్తూ సమాచారం పొందడానికి 30 రోజుల సమయం చాలా ఎక్కువని, దానిని ఏడు రోజులకు తగ్గించాలని కోరారు. అధికారంలోకి రావడం, దానిని నిలబెట్టుకోవడంపైనే శ్రద్ధచూపే ప్రభుత్వాలకు ప్రజాసంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. ఈ చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి గల ఆవశ్యకత, దరఖాస్తు చేసుకునే విధానం, సాధించిన విజయాలను 'ఈనాడు-ముందడుగు' కోఆర్డినేటర్ రమేష్ వివరించారు. కళాశాల ఎ.ఒ. కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స.హ చట్టంపై సిబ్బంది, విద్యార్థులు వ్యక్తం చేసిన సందేహాలను రమేష్, ముఖర్జీ, హరిబాబులు నివృత్తి చేశారు.
* నేను గుంటూరు హిందూ కళాశాలలో చదివాను. ఏఐసీటీఈ (ఢిల్లీ) నుంచి నాకు నెలకు రూ. 8 వేలు చొప్పున రావాల్సిన సంవత్సర స్త్టెఫండ్ ఇవ్వలేదు. ఏమి చేయాలి? - ఎన్.వెంకటనాగజ్యోతి * కేంద్ర సమాచార కమిషన్ ద్వారా సమాచారం పొందాలి. దరఖాస్తుకు రూ. 20 స్టాంపు అతికించి ఏఐసీటీఈని సమాచారం కోరవచ్చు. మీ దరఖాస్తు అందిన 30 రోజుల్లో సమాచారం అoదిస్తారు.
* స.హ చట్టం కింద ప్రైవేటు సంస్థల నుంచి కూడా సమాచారం పొందవచ్చా? - కె.మనోజ్‌కుమార్ * ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి, ప్రభుత్వ సహాయంతో నడిచే సంస్థల నుంచి మాత్రమే సమాచారం పొందవచ్చు.
* గత ఏడాది ఈబీసీ ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకున్నాను. అర్హత ఉన్నా మంజూరు కాలేదు - జె.మానస * ఈబీసీ ఉపకార వేతనాలకై ఇంకా ప్రత్యేక శాఖ ఏర్పడలేదు. ప్రస్తుతం దీని నిర్వహణ ఏ శాఖ చూస్తున్నదో వారికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఉపకార వేతనం ఎందుకు మంజూరు కాలేదో తెలుసుకోవచ్చు.
* సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి, సమాచార కమిషనర్‌ల నుంచి కూడా మూడు నెలలకు స్పందన లేకుంటే ఏమి చేయాలి? - గోవిందరావు * 90 రోజుల తరువాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులనుబట్టి నెల లోపు హియరింగ్ ఉంటుంది. దానిలో మీ సమస్య న్యాయబద్దమని తేలితే రవాణా ఖర్చులతోసహా సమాచారం అందిస్తారు. |
|