| ఇంకా వీడని నిర్లక్ష్యం |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
* సూచికలకే పరిమితం * అవగాహన అంతంతమాత్రమే * సహ చట్టానికి నాలుగేళ్లు పూర్తి
సూర్యాపేట , న్యూస్‌టుడే: మీరు ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి చూడండి.. సమాచార హక్కు చట్టం సూచికలు (బోర్డులు) అలంకార ప్రాయంగా కనిపిస్తుంటాయి. వాటిల్లో పేర్కొన్న అధికారులు మారినా బోర్డులు మార్చడానికి సైతం నెలల సమయం పడుతోంది. సమాచారం కావాలని అడిగిన వారిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు.. సకాలంలో సమాధానం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అడిగిన సమాచారం లేదని.. సమాచార అవసరం ఏమిటని.. అసంపూర్తిగా ఇస్తూ ఇంకా అధికారులు పారదర్శకతను నిరూపించుకోలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబరు 12న అమల్లోకి వచ్చింది. ఇప్పటికి నాలుగేళ్లు గడిచాయి. ఇంకా తప్పటడుగులు వేసే దశలోనే ఉంది. ప్రజలకు అవగాహన కల్పించడం మాట అటుంచి...ఇప్పటికీ జిల్లా అధికారులు సమాచార హక్కు చట్టంపై శిక్షణలకే పరిమితమయ్యారు.
పడుతూ .. లేస్తూ.. సమాచార హక్కు చట్టానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉన్నప్పుడే సుపరిపాలన అందించడం సాధ్యం. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉంటాయి. జిల్లాలో రూ.కోట్లల్లో నిధులు వెచ్చిస్తున్నా.. పాలకుల అవినీతి, బంధుప్రీతి వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోంది. అవినీతి తారాస్థాయికి చేరడంతో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలో పదిహేను పైసలు మాత్రమే సద్వినియోగమవుతోంది. మిగిలినది రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతోంది. అంచలంచెలుగా అవినీతి పెరుగుతూ పోతోంది. అన్ని కార్యాలయాల్లో నోటీసు బోర్డులు, వార్తాపత్రికలు, బహిరంగ ప్రకటనల ద్వారా సహచట్టంపై ప్రచారం నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో ఈ ప్రక్రియ బోర్డులకే పరిమితమైంది.
బండారం బయట పడుతుండటంతో.. సహ చట్టం ద్వారా విషయాలు బయటకు వస్తే.. అవినీతి పరుల బండారం బయట పడుతోందని నిజాలకు పాతరేస్తున్నారు. ఇష్టారీతిన నిధులు మింగేస్తున్నారు. అందుకే జిల్లాలో అధికారులు, నాయకులు చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేయాలా? అని కుయుక్తులు పన్నుతున్నారు. సమాచారం అడిగిన వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం కావాలని దరఖాస్తు చేసుకోగా.. ఇవ్వకుండా ఈ సమాచారం ఎందుకు? అవసరం ఏమిటి? అని తిరిగి ఎదురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు కమిషనర్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల చేతులు తడిపితే కానీ పనులు కావు. కనీసం పలుకుబడి అయినా ఉండాలి. ఇవేవీ లేకుంటే రోజుల తరబడి తిప్పడం, కాగితాలు లేవనో.. నిబంధనలు ఒప్పుకోవనో కొర్రీలు పెడుతున్నారు. దీంతో సహ చట్టం అభాసుపాలవుతోంది.
అవగాహన పెరిగింది: హన్మంతరెడ్డి, డీఆర్‌వో గతంలో కంటే ప్రస్తుతం సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కలిగింది. దరఖాస్తు దారుల సంఖ్య కూడా పెరిగింది. అడిగిన సమాచారం వెంటనే అందజేస్తున్నాం. ఉన్న సమాచారాన్ని దాచవద్దని.. లేని సమాచారాన్ని సృష్టించ వద్దని ప్రభుత్వ కార్యాలయాలకు సూచించాం. చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి అధికార యంత్రాంగానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. |
|