| అక్రమార్కులపైనే గురి! |
| ప్రచురణ తేది: 13/10/2009 |
|
ర వీంద్రనాథ్ గురు.. 65 ఏళ్ల ఈ మాజీ శాస్త్రవేత్త పేరు చెబితే బృహత్ బెంగళూరు మహానగర పాలికె సిబ్బంది ఒక్కసారిగా సర్దుకుంటారు. ఇంతకు ఆయన ప్రత్యేకత ఏంటంటే.. వాణిజ్య సముదాయాలు, వ్యాపార భవంతుల నిర్మాణాల వివరాలను అడుగుతూ రవీంద్రనాథ్ గత నాలుగేళ్లµలో 300లకుపైగా సహ దరఖాస్తుల్ని సమర్పించారు. 275కు పైగా కట్టడాలు.. అనుమతించిన ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్నట్లు నిరూపించారు. అక్రమ నిర్మాణాల్ని కూల్చి వేయించారు. అలాగే.. ఏళ్ల తరబడి పన్నులు కట్టని కల్యాణ మండపాల యాజమాన్యాల ముక్కు పిండి మరీ పన్ను కట్టించారు.
కొత్త బాధ్యతలతో.. రవీంద్రనాథ్.. తమ ఇంటి దగ్గర్లోని పాదచారుల మార్గాన్ని సమీపంలోని ఓ పెద్ద భవనం యజమాని ఆక్రమించినట్లు గుర్తించారు. ఆక్రమణను తొలగింప చేసేందుకు స.హ. చట్టాన్ని గురి పెట్టారు. ఆ భవన అసలు నిర్మాణ ప్రణాళిక నకలు ప్రతుల్ని కోరుతూ దరఖాస్తు చేశారు. ఫలితం లేదు. నిరాశ చెందకుండా దానిపైనే వరసుగా పాతిక దరఖాస్తుల్ని సంధించారు. దీంతో ప్రణాళిక నకలు చేతికి అందింది. పాదచారి మార్గానికి పట్టిన కబ్జా గ్రహణం వీడింది. దీనికి కక్షగట్టి దుండుగులు రవీంద్రనాథ్ గురు నివాసంపై రాళ్లు రువ్వారు. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రతిఫలంగా అప్పుడు పగిలిన కిటీకిని రవీంద్ర ఇప్పటికీ అంతే ఉంచారు.
నా వంతు ప్రయత్నమిది 'నా జీవితంలో సగ భాగాన్ని ప్రభుత్వసేవలో, కుటుంబ పోషణలో గడిపాను. తక్కిన దాన్ని సమాజానికి ఉపయోగించాలని తొలి విజయం సాధించినప్పుడు నిర్ణయించుకున్నాను. స.హ. వినియోగంలో అడుగడుగునా అవరోధాలే. మహానగర పాలికె అధికారుల్లో కొందరు భవన నిర్మాణ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. ఒకసారి భవన నిర్మాణ ప్రణాళిక ఆమోదం పొందితే చాలు... ఆ తర్వాత యజమానులు, కాంట్రాక్టర్లు తమకు ఇష్టమొచ్చిన రీతిలో కట్టుకుంటారు. అధికారులూ మొక్కుబడిగానే తనిఖీ చేస్తారు. ఈ అవినీతిని అడ్డుకోవడానికి సహతో ప్రయత్నిస్తున్నా' ఉంటుందని రవీంద్రనాథ్ చెప్పారు. - కె.ఆదినారాయణమూర్తి, న్యూస్‌టుడే, బెంగళూరు |
|