| అడిగితే పోయేదేం లేదు అలసత్వం తప్ప |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
ప్రశ్నిస్తే ... సమాధానం వస్తుంది. అడిగితే.. బాధ్యత పెరుగుతుంది. నిలదీస్తే... నిజం తెలుస్తుంది. తెలిస్తే... న్యాయం జరుగుతుంది.
చె న్నూరు మండలం రామనపల్లి గ్రామంలో 2007 సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబరు 2008 వరకు 90 మంది పేద మహిళలకు కాన్పులు జరిగాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేసుకున్న స్త్రీకి రూ.1000, ప్రైవేటు ఆస్పత్రిలో కాన్పు చేసుకున్న మహిళకు రూ.800 జననీ సురక్ష యోజన, సుఖీభవ పథకాల కింద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందాల్సి ఉంది. అయితే వాటిని అందించడంలో ఆ శాఖ నిర్లక్ష్యం చేసింది. అధికారులు 25 మందికి ప్రోత్సాహకాల సొమ్మును అందజేసి చేతులు దులుపుకున్నారు. తమకూ ప్రోత్సాహకాలు అందుతాయని ఆశించిన మిగతా వారికి నిరాశే మిగిలింది. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ విషయమై వాకబు చేస్తే సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ స్థితిలో గ్రామానికి చెందిన వి. శ్రీనివాసులురెడ్డి అనే దరఖాస్తుదారుడు 10.12.2008 తేదీన వైద్య ఆరోగ్య శాఖకు సహ చట్టం ద్వారా దరఖాస్తు పంపారు. ఆ గ్రామంలో ప్రోత్సాహకాలు అందని మహిళల వివరాలు, ఆలస్యానికి కారణాలు తెలియజేయమని కోరారు. దరఖాస్తు అందిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో చలనం వచ్చింది. సమాచారం పంపడమే కాకుండా 33 మంది మహిళలకు ప్రోత్సాహకాల సొమ్ము అందజేశారు. |
|