| 'బదిలీ'కి బద్ధకం |
| ప్రచురణ తేది: 08/09/2009 |
|
సెక్షన్ 6(3) దరఖాస్తుదారు కోరిన సమాచారం వేరే ప్రజా సంస్థలో ఉంటే.. సంబంధిత దరఖాస్తును అయిదు రోజుల్లోగా ఆ సంస్థకు బదిలీ చేయాలి. ఆ విషయాన్ని వెంటనే దరఖాస్తుదారుకు తెలియజేయాలి.
రాష్ట్రంలో చాలామంది ప్రజా సమాచార అధికారులు ఈ సెక్షన్‌ను మర్చిపోతున్నారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారం వేరే ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉన్న సందర్భాల్లో దరఖాస్తులకు అక్కడికి బదిలీ చేయట్లేదు. 'మీరు కోరిన సమాచారం మా దగ్గర్లేదు. సంబంధిత శాఖను సంప్రదించండి' అంటూ తిప్పి పంపేస్తున్నారు. దరఖాస్తుదారు అప్పీలుకు వెళితేగానీ 'బదిలీ' జరగట్లేదు. అందుకు సాక్ష్యాలివి..
* సమాచారం వేరే కార్యాలయంలో ఉంటే 5 రోజుల్లోగా బదిలీ చేయాలి. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు మాత్రం 12 నెలల తర్వాత చేశారు. అదీ రాష్ట్ర కమిషన్ నుంచి షోకాజు నోటీసు వచ్చిన తర్వాత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనుగోలు చేసిన వైద్య పరికరాలు, వాహనాలు తదితర వివరాలను కోరుతూ చేసిన దరఖాస్తుకు అధికారులు స్పందించలేదు. ప్రథమ అప్పీలుకు వెళ్లినా ఫలితం లేదు. కమిషన్‌కు రెండో అప్పీలు చేయడంతో.. సంబంధిత అధికారులకు నోటీసులు అందాయి. దరఖాస్తుదారుకు 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా కమిషన్ ఆదేశించింది. అప్పుడు అధికారులు స్పందించారు. వాహనాల నిర్వహణ ఖర్చుల సమాచారం తమ దగ్గర లేదని.. దాని కోసం దరఖాస్తును ఏటీవో కార్యాలయానికి బదిలీ చేశారు. జిల్లాస్థాయి కార్యాలయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామస్థాయిలో..?
* రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. డీఎస్సీ 1998 నియామకాలకు సంబంధించిన సమాచారం కోసం పాఠశాల విద్యా డైరక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేస్తే.. 'మీరు కోరిన సమాచారం మా దగ్గర అందుబాటులో లేదు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాలను సంప్రదించండి' అని సమాధానమిచ్చారు. మొదటి అప్పీలు చేయడంతో స్పందించిన డైరక్టర్ పూనం మాలకొండయ్య దరఖాస్తును సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేశారు.
* గత అయిదేళ్లలో కోడూరు మండలానికి ఖర్చు చేసిన నిధుల వివరాలు కోరుతూ కడప పంచాయతీరాజ్ శాఖకు దరఖాస్తు చేస్తే.. 'ఆ వివరాలన్నీ రాజంపేట ఏఈ కార్యాలయంలో లభిస్తాయి' అని చెప్పారు. దరఖాస్తును బదిలీ చేయలేదు. మొదటి అప్పీలు చేసిన తర్వాత 'దరఖాస్తును సంబంధిత కార్యాలయానికి బదిలీ చేస్తున్నాం' అని లేఖ పంపారు.
* పారిశ్రామిక అవసరాలకు కడప జిల్లాలో విక్రయించిన భూముల వివరాలపై ఏపీఐఐసీకి దరఖాస్తు వెళ్లింది. దానికి సంబంధిత అధికారులు స్పందిస్తూ 'మీరు కోరిన సమాచారం మా వద్ద లేదు, సంబంధిత శాఖను సంప్రదించండి' అని జవాబిచ్చారు. దరఖాస్తుదారు మొదటి అప్పీలు చేశారు. దానిపై విచారణ అయిన తర్వాత గానీ దరఖాస్తును బదిలీ చేయలేదు.
* తొమ్మిది అంశాలకు సమాచారం కోరుతూ ఓ దరఖాస్తుదారు మహా విశాఖ నగరపాలకసంస్థకు సహ దరఖాస్తు చేశారు. దానికి సంబంధిత పీఐవో స్పందిస్తూ 'మీరు కోరిన సమాచారం ఈ కార్యాలయంలో లేదు. వుడాను సంప్రదించండి' అని సమాధానమిచ్చారు. దరఖాస్తును వుడాకు మాత్రం బదిలీ చేయలేదు. దీనిపై ప్రథమ అప్పీలు దాఖలైంది.
సెక్షన్ 6(3)ని ఇలా నిర్లక్ష్యం చేస్తుండటంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పీలు దాకా వెళ్లాల్సి వస్తుండటంతో విలువైన సమయం వృదా అవుతోంది. కొన్నిసార్లు దరఖాస్తు లక్ష్యం నీరుగారిపోతోంది. అంతిమంగా సహ స్ఫూర్తి దెబ్బతింటోంది.
- ఎస్.ఎ.నాజర్‌బాషా, కడప |
|