శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: నిబంధనలను పట్టించుకోరు!
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
నిబంధనలను పట్టించుకోరు!
ప్రచురణ తేది: 22/09/2009

సూటిగా ఉన్న సహ చట్టం నిబంధనలకు కూడా కొందరు పీఐవోలు తిలోదకాలిస్తున్నారు. కనీస అవగాహనను కూడా కనబర్చకుండా వ్యవహరిస్తూ దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నారు. సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. ఇవ్వకపోతే సెక్షన్ 7(6) ప్రకారం దరఖాస్తుదారుకు ఉచితంగా సమాచారం ఇవ్వాలి. నిబంధనలు ఇంత పక్కాగా ఉన్నా.. గడువు దాటిన తర్వాత సమాచారం ఇవ్వడానికీ అధికారులు రుసుం అడుగుతున్నారు. 30 రోజుల్లోగా దరఖాస్తుదారుకు సమాచారం అందిస్తేనే రుసుం తీసుకోవాలనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు.అలాంటి ఉదంతాలివి..

* అవినీతికి పాల్పడిన గ్రామ సర్పంచిలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను అడుగుతూ వరంగల్ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి దరఖాస్తు వెళ్లింది. నిర్దేశిత గడువులోగా పీఐవో స్పందించలేదు. దరఖాస్తుదారు ప్రథమ అప్పీలు చేయడంతో రూ.300 కట్టి సమాచారం తీసుకోవాలని చెప్పారు. సమాచారం అత్యవసరమవడంతో దరఖాస్తుదారు రుసుం చెల్లించి సమాచారం తీసుకున్నారు. తర్వాత దానిపై రాష్ట్ర కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించిన కమిషన్.. గడువు దాటిన తర్వాత సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలని చెబుతూ దరఖాస్తుదారుకు రూ.300లను వెనక్కు ఇప్పించింది.

* మార్చి 2007 నుంచి నవంబర్ 2008 వరకు హుండి ఆదాయం, ఖర్చుల వివరాలను కోరుతూ దరఖాస్తుదారు వరంగల్ భద్రకాళి ఆలయ అధికారులకు దరఖాస్తు చేశారు. గడువులోగా సమాధానం రాకపోవడంతో మొదటి అప్పీలు వెళ్లింది. సమాచారం ఇవ్వాలని .. ఆదేశించడంతో పీఐవో లేఖ పంపారు. రూ.3 వేలు కడితే సమాచారం ఇస్తామన్నారు. దరఖాస్తుదారు కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో.. సెక్షన్ 7(6) ప్రకారం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది.

* పరకాల మేజర్ గ్రామ పంచాయతీ జమా ఖర్చుల వివరాలను అడుగుతూ దరఖాస్తు చేస్తే గడువులోగా సమాచారం రాలేదు. మొదటి అప్పీలు చేయడంతో సమాచారం ఇవ్వాలని అప్పీలేట్ అధికారి చెప్పారు. అప్పుడు స్పందించిన పీఐవో సమాచారం కావాలంటే రూ.30,240 కట్టాలన్నారు. కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లడంతో దరఖాస్తుదారుకు ఉచితంగానే ఇవ్వాలని తీర్పు వచ్చింది.

* వరంగల్ జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కేటాయించిన నిధుల వివరాలను కోరుతూ సంక్షేమ శాఖ కార్యాలయానికి దరఖాస్తు వెళ్లింది. సంబంధిత పీఐవో స్పందించలేదు. మొదటి అప్పీలు చేసినా ఫలితం లేదు. దీనిపై దరఖాస్తుదారు రెండో అప్పీలు చేయడంతో.. ఉచితంగా సమాచారం ఇవ్వాలని కమిషన్ చెప్పింది.

* వరంగల్ జిల్లాలో 2004 - 05 ఆర్థిక సంవత్సరం నుంచి జనవరి 31, 2009 మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చిన పరిహారం వివరాలను అడుగుతూ జిల్లా డీఆర్వో కార్యాలయానికి ఒకరు దరఖాస్తు చేశారు. దాన్ని సెక్షన్ 6(3) కింద ములుగు డివిజన్ కార్యాలయానికి బదిలీ చేశారు. గడువు దాటిన తర్వాత మేల్కొన్న అధికారులు రుసుం చెల్లించమన్నారు. దానిపై మొదటి అప్పీలు చేసినా స్పందన లేదు. దాంతో దరఖాస్తుదారుకు కమిషన్‌కు రెండో అప్పీలు చేశారు.

* హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన సమాచారాన్ని అడుగుతూ జూన్ 25, 2009 జగద్గిరిగుట్టకు చెందిన మధుబాబు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి దరఖాస్తు చేశారు. దానికి జులై 29 స్పందించిన సంబంధిత పీఐవో రూ.1410 కడితే సమాచారం ఇస్తామని చెప్పారు.
- ఎస్.ప్రశాంత్, వరంగల్

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008