| మాకేం తెలియదు! |
| ప్రచురణ తేది: 15/09/2009 |
|
మ హిళలపై యాసిడ్ దాడి.. యువతిపై అత్యాచారం.. మైనర్ బాలిక హత్య.. రాష్ట్రంలో ఏదో ఓ చోట ప్రతిరోజూ చోటుచేసుకుంటున్న దారుణాలివి. వీటిన్నంటి గురించి వింటున్నప్పుడల్లా.. వాటిని నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటనే ప్రశ్న తలెత్తుతుంది.
రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కార్యాలయాల్లో ఈ సమాచారం లేదట. 'మా దగ్గర సమాచారం లేదు. జిల్లాల ఎస్పీల కార్యాలయాలను సంప్రదించండి' అని వారే ఓ దరఖాస్తుకు సమాధానమిచ్చారు. మహిళలను కాపాడటానికి సర్కారు ఏం చేస్తోందన్నది సంబంధిత శాఖ రాష్ట్రస్థాయి కార్యాలయాలకు తెలియదన్న మాట(?).
నివేదికలే ఉండవట! గత అయిదేళ్లలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యల సంఖ్య, కారకులకు పడిన శిక్షలు, స్త్రీలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వివరాలను అడుగుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి దరఖాస్తు వెళ్లింది. సంబంధిత అధికారులు దానిని హోం శాఖకు బదిలీ చేశారు. ఆ సమాచారం డీజీపీ కార్యాలయంలో మాత్రమే లభ్యమవుతుందంటూ హోంశాఖ అధికారులు దరఖాస్తును అక్కడకు పంపారు. డీజీపీ కార్యాలయమన్నా సమాచారమిచ్చిందా అంటే లేదు. మా దగ్గరా లేదు.. జిల్లా ఎస్పీలను సంప్రదించండని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా గత అయిదేళ్లలో మహిళలపై జరిగిన అకృత్యాల వివరాలు హోంశాఖ, డీజీపీ కార్యాలయాల్లో లేవనే అనుకుందాం.. కనీసం వాటిని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలేంటన్న సమాచారమూ ఉండదా? మహిళలపై జరిగిన, జరుగుతున్న దాడులపై జిల్లాల ఎస్పీలే నేరుగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారా? హోంశాఖకు గానీ, డీజీపీ కార్యాలయానికి గానీ సమర్పించరా అనే ప్రశ్నలు ఈ సందర్భంలో తలెత్తుతున్నాయి. గత పదేళ్లలో రాష్ట్రంలో నమోదైన బాలికలు, యువతుల మిస్సింగ్, అపహరణ కేసుల సంఖ్య, వాటిలో పరిష్కరించిన కేసుల సంఖ్యను అడుగుతూ రాష్ట్ర హోంశాఖకు మరో దరఖాస్తు వెళ్లింది. 'మీ దగ్గర ఉన్న నివేదికల ప్రకారమే సమాచారం ఇవ్వండని' దరఖాస్తుదారు కోరారు. ఈ దరఖాస్తునూ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. చివరికి.. జిల్లాల ఎస్పీల కార్యాలయాలను సంప్రదించండనే సమాధానమే ఈ సారీ వచ్చింది. ఉన్న నివేదికల ప్రకారమే ఇవ్వమన్నా.. సమాచారం లేదన్నారంటే.. అసలు ఎలాంటి నివేదికలూ రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో లేవా అనే సందేహం తలెత్తుతోంది. నివేదికలు లేకుండా నేరాల అదుపునకు రాష్ట్రస్థాయి కార్యాచరణ ఎలా సిద్ధం చేస్తారో సంబంధిత అధికారులకే తెలియాలి. - ఎస్.ఎ.నాజర్ బాషా, కడప |
|