| అడ్డదారిలో ఆయుధాలు |
| ప్రచురణ తేది: 06/10/2009 |
|
నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: సంక్షేమం ముసుగులో ఆయుధాలు పక్కదారిపడుతున్న ఉదంతమిది. జిల్లాలో 1,357 మందికి తుపాకీ లైసెన్సులను అధికారులు మంజూరు చేశారు. బ్యాంకుల్లో, భారీస్థాయిలో ధనం మారకం జరిగే సంస్థల్లో భద్రత కోసం ఆయుధ లైసెన్సులు మంజూరు చేస్తుంటారు. సమాజంలో ఓ హోదా ఉన్న వ్యక్తుల వ్యక్తిగత భద్రత కోసం కూడా లైసెన్సులు ఇస్తారు. ఇవన్నీ సంక్షేమానికి ఉపయోగపడేవే. జిల్లాకు చెందిన చాలా మంది బెంగళూరు, చెన్నై నగరాల్లో రియల్ వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు. వీరు నెల్లూరులో తుపాకీ లైసెన్సులు పొంది వాటిని అనధికారికంగా బెంగళూరు, చెన్నై నగరాల్లో రియల్ ధందా విధ్వంస కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు.
* సమాజంలో ఓ హోదాలో ఉన్న వ్యక్తి తన ప్రాణానికి ముప్పు ఉందని భావిస్తే ఆయుధ లైసెన్సు కావాలని కలెక్టరేటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్డీవో, ఎస్పీ తదితరులతో కూడిన కమిటీ విచారణ జరిపి లైసెన్సు మంజూరు చేయవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తుంది. లైసెన్సు పొందిన తర్వాత ఆరు నెలల్లోపు ఆయుధాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీన్ని గుర్తింపు పొందిన ఆయుధ డీలరు నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి.. లేదా జిల్లా అధికార యంత్రాంగం వద్ద ఉన్న ఆయుధాలను వేలం వేసినప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఇతర మార్గాల్లో పొందడానికి వీల్లేదు. ప్రతి మూడేళ్లకు ఒకసారి లైసెన్సును రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో, మతకలహాల వంటి ఉద్రిక్త సమయాల్లో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకుంటారు. నిర్ణీత సమయం అనంతరం వాటిని తిరిగి లైసెన్సుదారులకు ఇచ్చేస్తారు. ఎవరైనా ఆయుధాన్ని తిరిగి తీసుకొని వెళ్లకపోతే నిర్ణీత సమయందాక చూసి వేలం వేస్తారు. ఆయుధాన్ని వినియోగించేవారికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాలను నిర్వహించాల్సి ఉంది. కానీ, ఎక్కడా శిక్షణకేంద్రాలు లేవు.
* రెవెన్యూ యంత్రాంగం వద్ద ఉండే లైసెన్సుదారుల జాబితాకు, పోలీసు యంత్రాంగం వద్ద ఉండే లైసెన్సుదారుల జాబితాలకు పొంతనే ఉండటం లేదు. నాలుగైదేళ్ల క్రితం మృతిచెందిన కావలి మాజీ ఎమ్మెల్యే కలికి యానాదిరెడ్డికి ఇంకా లైసెన్సు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతుండగా.. ఆయన పేరుతో ఆయుధం లేదని, లైసెన్సు రెన్యువల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేదని కావలి డివిజన్ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఉదంతాలు ఇంకా చాలా ఉన్నట్లు సమాచారం.
నిబంధనలను కాదంటే కఠినచర్యలు - బి.మల్లారెడ్డి, ఎస్పీ అనధికారికంగా ఆయుధాన్ని కలిగి ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా దాన్ని వాడినా ఆ వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరి వద్ద ఆయుధాలు ఉన్నాయో స్టేషన్లవారీగా రిజిస్టరు ఉంటుంది. ఎప్పటికప్పుడు మా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుంటారు. లైసెన్సు లేకుండా ఆయుధాల వినియోగం జిల్లాలో ఎక్కడా లేదు. |
|