శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: ప్రజారోగ్యానికి 'పొగ'
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
ప్రజారోగ్యానికి 'పొగ'
ప్రచురణ తేది: 06/10/2009

చట్టాల అమల్లో నిర్లక్ష్యం
బహిరంగ ధూమపానంపై చర్యలేవి?
పెరుగుతున్న 'పొగాకు' మరణాలు

సిగరెట్, బీడీ, గుట్కా, ఖైనీ.. రూపమేదైనా పొగాకు గుణమొక్కటే. తన మత్తులో పడిన వారి ప్రాణాలను నిశ్శబ్ధంగా బలి తీసుకోవడమే దాని లక్షణం. అలా.. మత్తు కోరల్లో చిక్కి 20 శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల మంది ప్రాణాలు పొగొట్టుకున్నారని అంచనా. ప్రస్తుత స్థాయిలోనే పొగాకు వినియోగిస్తూ ఉంటే మరణాల సంఖ్య శతాబ్దంలో మరింత పెరగొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్..) అంచనాల ప్రకారం.. పొగాకు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య భారత్‌లో వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. 'యువశక్తి' మీదే ఆధారపడ్డ మన దేశానికి.. ఇది ఆందోళన కలిగించే విషయమే.

భారతీయ పురుషుల్లో సగం మందికి పైగా పొగాకును ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నారు. ప్రాంతాలను బట్టి 15 నుంచి 60 శాతం మంది మహిళలూ దాన్ని వాడుతున్నారు. పొగాకు వినియోగంతో ఏడాదికి మన దేశంలో మరణించిన వారి సంఖ్య 1980లో 6 లక్షల 30 వేలుంటే.. ప్రస్తుతం మరణాలు పది లక్షలకు చేరుకున్నాయి. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న పొగాకు ముఖ్యంగా కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్, గుండె జబ్బులకు కారణమవుతోంది.

చట్టాలేం చెబుతున్నాయంటే..
భారత ప్రభుత్వం 1975లో చేసిన సిగరెట్స్ (తయారీ, సరఫరా, పంపిణీ క్రమబద్ధీకరణ) చట్టం ప్రకారం ప్రతి సిగరెట్ పెట్టెపై 'చట్టబద్ధమైన హెచ్చరిక'ను ముద్రించాలి. ప్రజారోగ్యాన్ని పెంపొందించాలని చెబుతున్న భారత రాజ్యాంగంలోని 47 ఆర్టికల్‌కు అనుగుణంగా 2003లో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్రచార నిషేధం, వాణిజ్యం, తయారీ, సరఫరా, పంపిణీల క్రమబద్థీకరణ) చట్టం వచ్చింది. వివిధ తేదీలో అమల్లోకి వచ్చిన చట్టంలోని సెక్షన్ల ప్రకారం..

* బహిరంగ ప్రదేశాల్లో పొగతాగట నేరం.
* పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష ప్రచారం నిషేధం. (వాటిని అమ్ముతున్న ప్రదేశాల్లో ప్రచారానికి అనుమతి ఉంది)
* 18 ఏళ్ల లోపు చిన్నారులకు పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు.
* విద్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు సాగరాదు.
* పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై చిత్రాల రూపేణా హెచ్చరికలను ముద్రించాలి.
* పొగాకు ఉత్పత్తుల్లోని 'టార్, నికోటిన్' మోతాదులను ప్యాకెట్లపై కచ్చితంగా తెలపాలి.

వీటిని పాటిస్తున్నారా?
పని ప్రదేశాలు, దుకాణాలు, సినిమా హాళ్లు, పబ్‌లు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, స్టేడియాలు, కార్యాలయాలు, ఆసుపత్రుల భవనాలు, రైల్వేస్టేషన్‌లు, బస్టాండులు, విద్యాలయాలు, న్యాయస్థానాలు, ఆడిటోరియాలు, ఫంక్షన్ హాల్స్, పబ్లిక్ సర్వీసు వాహనాలు తదితరాలన్నీ బహిరంగ ప్రదేశాలే.అలాంటి చోట్ల పొగతాగరాదు. సంబంధిత ప్రదేశం యజమాని, మేనేజర్, సూపర్‌వైజర్ లేదా అది ఎవరి ఆధీనంలో ఉంటుందో అతను.. వీరికి కూడా చట్టం నిర్దేశాలను జారీ చేసింది. తమ అధీనంలోని బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. అందరికీ కనబడే విధంగా 'ఇచ్చట పొగ తాగుట నిషేదం' అనే బోర్డులను ఏర్పాటు చేయాలి. చట్టాన్ని అతిక్రమించిన వారిపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న వారి పేర్లనూ రాయాలి. ఫిర్యాదులపై స్పందించకపోతే వారు జరిమానా చెల్లించాలి. నిబంధనలను అతిక్రమించి పొగ తాగిన వారిపై జరిమానా విధించవచ్చు. అయితే.. ఇప్పటి వరకూ చాలా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు కాలేదు. చట్ట అమలుపై అధికారులూ శ్రద్ధ చూపట్లేదు. సహ చట్టం సెక్షన్ 6(1) ప్రకారం దీనిపై సమాచారం కోరవచ్చు.

అలాగే.. 30 అంతకంటే ఎక్కువ మంది కూర్చునే వీలున్న రెస్టారెంట్లు, 30 అంత కంటే ఎక్కువ గదులు ఉన్న హోటళ్లు, ఎయిర్‌పోర్టుల్లో పొగ తాగే వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలి. వీటిని వేరే గదులతో కలపకూడదు.

సహతో ఏం అడగొచ్చు?
విద్యాలయాలకు వంద మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులను అమ్మే వారిపై తీసుకున్న చర్యలేంటి? ఆయా దుకాణాలను ఎలా అనుమతించారని స్థానిక పురపాలక సంఘాన్ని ప్రశ్నించవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగిన వారిపై జరిమానాలు విధిస్తున్నారా అని అడుగుతూ సంబంధిత కార్యాలయ పీఐవోకు దరఖాస్తు చేయవచ్చు.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008