| స.హ. చట్టం.. సమస్య పరిష్కారం |
| ప్రచురణ తేది: 01/10/2009 |
|
న్యూస్‌టుడే , కంభంపాడు(ఎ.కొండూరు):
అధికారుల అవినీతి.. అలక్ష్యం.. బాధ్యతారాహిత్యం.. వెరసి ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుడు పని చేయించుకోలేని పరిస్థితి. అన్నీ సక్రమంగా ఉన్నా సకాలంలో పని అవుతుందన్న నమ్మకం లేదు. చెప్పులు అరిగిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల జాఢ్యం వదిలించడానికి సామాన్యూడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం సమాచార హక్కు చట్టం. దీనిని కంభంపాడు శివారు మారుమూల గ్రామమైన అట్లప్రగడకు చెందిన శనగల వేణుగోపాలరెడ్డి ప్రయోగించి విజయం సాధించారు. నివాస గృహ విద్యుత్ కనెక్షన్ కోసం 2009 మార్చిలో ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దీనికి 5 కేవీ ట్రాన్స్‌ఫార్మర్, లైన్ ఏర్పాటు చేయాల్సివుండడంతో ఆ ఏడాది జులై 24న రూ. 32,240 మొత్తానికి బ్యాంకులో డీడీ తీసి ట్రాన్స్‌కో అధికారులకు అందజేశారు. ఆరు నెలలు గడిచినా కనెక్షన్ ఇవ్వలేదు. పలుమార్లు స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా రేపుమాపంటూ కాలయాపన చేశారు. సహనం కోల్పోయి కనెక్షన్ ఇవ్వకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని ఐదు ప్రశ్నలతో స.హ. చట్టం దరఖాస్తును ట్రాన్స్‌కో ఏఈ రవికుమార్‌కు ఇవ్వబోగా తీసుకునేందుకు నిరాకరించారు. దాంతో 'ఈనాడు ముందడుగు'ను ఆశ్రయించి 'న్యూస్‌టుడే' వెంట వెళ్లడంతో ఏఈ దరఖాస్తును తీసుకున్నారు. అంతే రెండో రోజే ఆఘమేఘాల మీద ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ లైన్ పనులను పూర్తి చేసేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా కాని పనులు ఏమైనా ఉన్నాయంటే ప్రయోగించండి పాశుపతాస్త్రమైన స.హ. చట్టం. కార్యసాధనలో సాధించండి విజయం. |
|