శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: నిలదీయాల్సింది ప్రజలే
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
నిలదీయాల్సింది ప్రజలే
ప్రచురణ తేది: 13/10/2009

అవినీతే.. అసలు సమస్య
సీఐసీ కమిషనర్ శైలేష్ గాంధీ

దేశంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ రాజకీయాలతో, అవినీతితో నిండిపోయాయి. వీటిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకభావంతో ఉన్నారు. నేపథ్యంలో ప్రజలకు అధికార యంత్రాంగాన్ని నిలదీసే అధికారాన్ని సహ చట్టం కల్పించింది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజలు పీఐవోలపై చూపుతున్నారు. అలాగే.. చాలా ప్రభుత్వ శాఖలు నిబంధనల ప్రకారం పని చేయడం లేదు. దాని ప్రభావమూ పీఐవోలపై పడుతోంది. వారిలో చాలా మందికి చట్టంపై అవగాహన లేదు. కావాలనే పీఐవోలు నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తాం. నేను ఒక్కడినే ఏడాది 40 మంది అధికారులకు రూ.ఎనిమిది లక్షల జరిమానా విధించాను.

దేశంలోని సహ ఉద్యమకారులు, దరఖాస్తుదారులకు ఆయనో ఆశాదీపం. కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చిన.. ఇస్తున్న వ్యక్తి. సహ చట్టాన్ని ఉల్లంఘించిన 40 మంది అధికారులకు ఏడాదిలోనే రూ.8 లక్షల వరకూ జరిమానాలు విధించిన 'సమాచార' స్వేచ్ఛా అభిమాని.. ఆయనే శైలేష్ గాంధీ.

సహ ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలను తన దరఖాస్తులతో వెలుగులోకి తెచ్చిన శైలేష్ గాంధీ .. కమిషనర్‌గా కూడా సహ చట్టం పట్ల అంతే నిబద్ధతతో పని చేస్తున్నారు. సహ చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన 'ఈనాడు ముందడుగు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన అభిప్రాయలను తెలుసుకుంది. వివరాలివి..

న్యూస్‌టుడే: ప్రభుత్వ యంత్రాంగాలన్నీ ఆంగ్లంలోనే సమాచారం ఇస్తున్నాయి. సమాచారాన్ని స్థానిక అధికార భాషలో ఇవ్వాల్సిన అవసరం లేదా?
శైలేష్ గాంధీ: వాస్తవానికి దరఖాస్తుదారుకు తెలిసిన భాషలోనే సమాచారం ఇవ్వాలి. అయితే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల్లోనూ సమాచారం ఆంగ్లంలోనే ఉంటుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ దరఖాస్తుదారు కోరారనుకోండి.. ఆయనకు వివరాలను తెలుగులో ఇవ్వాలంటే ఇక్కడి పీఐవోల వల్ల కాదు. వీరికి తెలుగు రాదు. దాన్ని అనువదించడానికి వేరొకరు కావాలి. అందువల్ల అన్ని సందర్భాల్లో స్థానిక భాషలో సమాచారం ఇవ్వలేకపోవచ్చు.

న్యూ: సెక్షన్ 18(1) కింద నేరుగా కేంద్ర/రాష్ట్ర సమాచార కమిషన్లకు ఫిర్యాదు చేయవచ్చా?
శై: చట్ట ప్రకారం చేయవచ్చు. మొదట పీఐవోకి దరఖాస్తు చేసి ఆయన సమాచారం ఇవ్వకుంటే తర్వాత కమిషన్ దృష్టికి తేవొచ్చు. కాని చాలా మంది నేరుగా కమిషన్ వద్దకే వస్తున్నారు. ఇది పద్ధతికాదు.

న్యూ: చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు 'ప్రభుత్వ ఖర్చుల'తో విచారణకు వస్తున్నారు. దరఖాస్తుదారులేమో సొంత సొమ్ములతో రావాల్సి వస్తోంది. ఇది సమంజసమేనా?
శై: అధికారులు తమ ఉద్యోగంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు. విచారణకు వారి ఖర్చులతోనే వెళ్లాలంటే ఎవరూ పీఐవోగా ఉండటానికి ముందుకురారు. అయితే.. పీఐవో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే తప్పక జరిమానా రూపంలో వసూలు చేస్తాం.

న్యూ: దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం వచ్చే వరకూ రెండో అప్పీలుపై విచారణను కొనసాగించాల్సినక్కర్లేదా?
శై: దరఖాస్తుదారుకు పూర్తి న్యాయం జరిగేదాకా విచారణ కొనసాగే పద్ధతి న్యాయస్థానాల్లో ఉంది. సమాచార కమిషన్లలో అవసరం లేదు. అధికారి సమాచారం ఇవ్వని విషయం మా దృష్టికి వస్తే.. ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. అయినా ఇవ్వకుంటే.. విచారించి సంబంధితులపై చర్యలు తీసుకుంటాం.

న్యూ: సమాచార కమిషన్లు అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షల్లో ఉద్యమకారులకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై మీ అభిప్రాయం?
శై: ఇప్పుడు కొంత వరకు అలాగే జరుగుతోంది. నేనూ కొన్ని సందర్భాల్లో ఉద్యమకారుల సాయం తీసుకుంటున్నాను. ముఖ్యంగా సెక్షన్ (4) అమలు పర్యవేక్షణకు వారే నాకు బాగా సాయపడతారు. క్రమం తప్పకుండా ఇలా చేస్తే.. చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేయవచ్చు.

న్యూ: ఇచ్చే సమాచారంలో ప్రతి పేజీపై పీఐవో సంతకం చేయాల్సిన అవసరం లేదా?
శై: పీఐవోలు తప్పకుండా ప్రతి పేజీపైనా సంతకం పెట్టాలి. చేయుకుంటే దరఖాస్తుదారుడు అడగాలి.

న్యూ: సహ చట్టం ప్రచారానికి సంబంధించి సీఐసీ పరంగా ప్రభుత్వాలపై ఏమైనా ఒత్తిడి చేస్తున్నాదా?
శై: చెప్పుకోతగిన స్థాయిలో ఏం చేయట్లేదు.

న్యూ: సహ చట్టానికి మీడియా కల్పిస్తున్న ప్రచారంపై మీ అభిప్రాయం?
శై: చట్టంపై ప్రజల్లో అవగాహన పెంపునకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బాగానే కృషి చేస్తోంది. సహ చట్టం ఆధారంగా పాఠకాదరణ, ప్రజాప్రయోజనం కలిగిన కథనాలను చేసే అవకాశం మీడియాకు ఉంది. ప్రస్తుతం అలాగే చేస్తున్నారు. అయితే.. ప్రతి పత్రికా సమాచార హక్కు చట్టంతో సామాన్యులు సాధించిన విజయాలపై కథనాలు ఇవ్వాలి. వీటి కోసం కొంత 'స్థలాన్ని' కేటాయించాలి. ఎలక్ట్రానిక్ మీడియా సైతం కొంత సమయాన్ని దీనిపై వెచ్చిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.

సమాచార కమిషనర్లుగా.. మూడింట్లో ఒకవంతు మాత్రమే అధికారులను నియమించాలి. తక్కిన వారు న్యాయ, ఇతర రంగాల నిపుణులు, సహ చట్టం వ్యాప్తికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను నియమించాలి. అలాగే అందరూ విశ్రాంత అధికారులనే కాకుండా 60 ఏళ్ల లోపు వయసు ఉన్న వారిని కమిషన్‌లోకి తీసుకోవాలి.

ముందు ప్రజాసేవకులైన న్యాయమూర్తులు.. వారి ఆస్తులును వెల్లడించనివ్వండి. తర్వాత సమాచార కమిషనర్ల వద్దకు వద్దాం. వాస్తవానికి ఇలా జరగాలంటే ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. కాని ఇప్పటి వరకు విషయంలో ప్రజల నుంచి కేంద్ర సమాచార కమిషన్‌కు ఎలాంటి ఒత్తిడీ లేదు.
- బి.వేణుగోపాల్, న్యూస్‌టుడే, న్యూఢిల్లీ

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008