| సీఐల ఆస్తుల వెల్లడిపై గోప్యమెందుకు? |
| ప్రచురణ తేది: 05/09/2009 |
|
ఆస్తుల చిట్టా దాఖలు చేయని ఇన్‌స్పెక్టర్లు స.హ.కు ఇవ్వని సమాచారం
(న్యూస్‌టుడే, విశాఖపట్నం) తప్పు ఒప్పులను నిర్ణయించే న్యాయమూర్తులే తమ ఆస్తుల వివరాలను బహిరంగ పరుస్తుంటే... నగరంలోని కొందరు ఇన్‌స్పెక్టర్లు మాత్రం తమ ఆస్తుల వివరాలు బయటకు తెలియకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదేమిటంటే అదంతా తమ వ్యక్తిగతం అందులో ఎలాంటి ఆదాయాలున్నాయో... అవన్నీ చెపితే ఎలా...? పూర్తిగా ఇది వ్యక్తిగతం అంటూ సమాచారహక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తును తిరస్కరించిన వైనమిది.
నగరంలో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలంటే భయపడుతున్నారు. అందులోనూ కొందరు సీఐలు ఈ పంథాను అవలంబిస్తున్నారు. ఇదేమిటంటే తమ ఆస్తులతో మీకేంటి పని అని దాటవేసే ధోరణితో మాట్లాడుతున్నారు. సమాచార హక్కు చట్టం కింద కడపకు చెందిన ఎస్.ఎన్.బాషా అనే వ్యక్తి నగరంలో సీఐల ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసుశాఖలోని పౌరసమాచార అధికారి (పి.ఐ.ఒ.)కి ఈ ఏడాది జులై ఒకటిన దరఖాస్తు చేశారు. ఇటీవల కాలంలో ముగ్గురు సీఐల అవినీతి బాగోతం బయటపడిన నేపథ్యంలో నగరంలో ప్రజలకు సేవలందించే సీఐల ఆస్తుల వివరాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరులకు ఉందన్నది దరఖాస్తులో పేర్కొన్నారు. 30 రోజుల్లో ఈ వివరాలు ఇవ్వాల్సి ఉండగా... పీఐవో నుంచి ఎలాంటి సమాచారం బాషాకు అందలేదు. దీంతో మొదటి అప్పీలు కింద అప్పిలేట్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై అప్పిలేట్ అథారిటీ నుంచి నగరంలోని సీఐలకు ఆస్తుల వివరాలు తెలపాలని కోరుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. తమ స్థిర,చరాస్తుల వివరాలు పూర్తిగా వ్యక్తిగతమని వాటిని ఇవ్వబోమంటూ పలువురు సీఐలు అప్పిలేట్ అథారిటీకి విన్నవించుకున్నారు. ఈ మేరకు నగరంలో పనిచేసిన సీఐలు బి.వి.జి.ప్రసాద్, టి.ఎం.ఎస్.ప్రకాశ్‌లను అవినీతి ఆరోపణలు రావడంతో డీఐజీ వారిని సస్పెండ్ చేశారని, వారికి సంబంధించిన వివరాలు తమ కార్యాలయంలో అందుబాటులో లేవని జవాబిచ్చారు. ఇతర సీఐలు ఇచ్చిన సమాధానం మేరకు ప్రజాప్రయోజనం లేని ఈ సమాచారాన్ని ఇవ్వబోమంటూ దరఖాస్తును అప్పిలేట్ అథారిటీ తిరస్కరించింది. నగర పోలీసుల నుంచి సమాచారం లభించకపోవడంతో బాషా సమాచార హక్కు చట్టం కమిషన్‌కు అప్పీలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
కచ్చితంగా ఇవ్వాల్సిందే పోలీసులపై తీవ్రంగా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి ఆస్తుల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా ఉన్నప్పుడు ఆస్తుల వివరాలు వెల్లడించడంలో ఎందుకు భయపడుతున్నారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో పారదర్శకంగా ఉండాల్సిన సీఐలు కచ్చితంగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నది బాషా ఉద్దేశం. |
|