| ఎన్ని ఆటంకాలొచ్చినా.. |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
* సాధించేదాకా వదలని విక్రమార్కులు * 'ఈనాడు' ముందడుగు స్ఫూర్తి
సూర్యాపేట , న్యూస్‌టుడే: అక్రమాలు బయటపడకుండా ఎంత గుట్టుచప్పుడు కాకుండా ఉన్నా .. కొందరు వ్యక్తులు అధికారుల నుంచి సమాచారం వచ్చే వరకు విక్రమార్కుడిలా పట్టు వీడలేదు. సహ చట్టం అమలులోకి రావడంతో... 'ఈనాడు-ముందడుగు' రెండేళ్ల నుంచి ప్రజలను చైతన్యం చేయడానికి అండగా నిలుస్తోంది. మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలు.. అధికారులు.. రాజకీయనాయకులు.. ప్రజాప్రతినిధులను ఛైతన్యం చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గత ఏడాది జులై నుంచి ఇప్పటికీ దాదాపు 50 మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగిన కొందరు అవినీతి.. అక్రమాలను వెలుగులోకి తీసుకురాగలిగారు. సమాచారం ఇవ్వడానికి అధికార గణం ముప్పుతిప్పలు పెట్టినప్పటికీ రాబట్టగలిగారు. భూ అక్రమాలు.. ఇసుక దందాలు.. ప్రభుత్వ శాఖల ఆదాయ, ఖర్చులు, ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో అవినీతి, చెరువుల ఆక్రమణలు, ఆరోగ్య శాఖ, విద్యుత్, పురపాలక సంఘాల అవినీతి, సంక్షేమ కార్యక్రమాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, రుణమాఫీలో లొసుగులు వెలుగులోకి తీసుకురాగలిగారు.
విజయాలు కొన్ని.. * కోదాడలో కొందరు రియల్ వెంచర్ల లేఅవుట్ల విషయంలో సమాచారం తీసుకోవడంతో అక్రమాలు వెలుగుచూశాయి. గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలాలు కూడా విక్రయించినట్లు బయటపడింది. దీంతో అక్కడి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులపై చర్యలు తీసుకోగలిగారు.
* మిర్యాలగూడలో ఆక్రమణలకు గురైన ఎన్నెస్పీ క్వార్టర్ల విషయంలో ఓ కౌన్సిలర్ సహచట్టం ద్వారా వివరాలు తీసుకున్నారు. అక్రమాలను 'ఈనాడు' వెలుగులోకి తీసుకరావడంతో కలెక్టర్ విచారణ చేపట్టారు.
* జిల్లాలో ఇసుక తవ్వకాలపై కొందరు సమాచారం తీసుకోవడంతో వీటి ఆధారంగా కథనాలు ఇవ్వడంతో అధికార యంత్రాంగం అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది.
* తుంగతుర్తి మండలంలోని గుమ్మడవెల్లి, కుక్కడం గ్రామాల్లో ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో అక్రమాలు జరిగాయి. సహచట్టం ద్వారా కొందరు ఆధారాలు రాబట్టడంతో రూ.కోటి వరకు దుర్వినియోగమైనట్లు తేలింది. సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
* నల్గొండలో ఓ ఉద్యోగికి పదోన్నతుల విషయంలో అన్యాయం జరిగింది. దీనిపై సహచట్టం సాయంతో వివరాలు సేకరించారు. దీంతో అక్రమపద్ధతిన పదోన్నతులు పొందిన వారి బండారం బయటపడింది. దీంతో ఆయనకు న్యాయం జరిగింది.
* జాజిరెడ్డిగూడెం మండలంలో వికలాంగుడు తనకు ఎపీపీఎస్సీలో ఉద్యోగం పొందే విషయంలో తనకు జరిగిన అన్యాయంపై వివరాలు సేకరించి.. ఉద్యోగ పోరాటం సాగిస్తున్నారు. అదే మండలంలో మరొకరు తనకు బ్యాంకురుణం ఇవ్వకుండా అధికారులు కొర్రీలు పెడుతుండటంతో సహచట్టం తోడ్పాటును అందించింది.
* సూర్యాపేట మున్సిపాలిటీలో మంజూరైన రూ.100కోట్లు నిధులు ఏళ్ల తరబడి మూలుగుతున్న విషయాన్ని సహచట్టం ఉపయోగించి బయటపెట్టడంతో అధికారుల స్పందించారు. |
|