| అన్ని చోట్లా... స.హ. సదస్సులు ఏర్పాటు చేయాలి |
| ప్రచురణ తేది: 28/08/2009 |
* 'ఈనాడు' శిక్షణ తరగతుల్లో వక్తల అభిప్రాయం
దమ్మపేట, న్యూస్‌టుడే ఏజెన్సీలో ప్రతి గిరిజన గ్రామంలో సమాచారహక్కు చట్టంపై సదస్సులు నిర్వహించాలని ఎఫికోర్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ లలిత్‌జేనా అభిప్రాయపడ్డారు. లంకాలపల్లి గ్రామంలో జీవనజ్యోతి హాస్పిటల్ ఆవరణలో ఎఫికోర్ సంస్థ తరఫున పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులకు 'ఈనాడు' ముందడుగు ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 'ఈనాడు' ముందడుగు సహ కార్యకర్త మహేశ్ చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లలిత్‌జేనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టంపై అవగాహన ఉంటే ప్రభుత్వం, సమాజంలో మార్పు తథ్యమన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయవాది రామారావు మాట్లాడుతూ గిరిజన చట్టాలు, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే అనర్థాలు వివరించారు. స్వాతంత్య్రం 60 ఏళ్లలో ఆవిర్భవించిన అత్యున్నత చట్టం స.హ. అని అన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు 'ఈనాడు' ఇలాంటి కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయం అన్నారు. తాము తెలుసుకున్న అంశాలను తమ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల సభ్యులు తెలిపారు.
మొదటిసారి తెలుసుకున్నా: విశ్వనాథ్, తమిళనాడు స.హ.చ గురించి మొదటిసారి 'ఈనాడు' ముందడుగు ద్వారా సవివరంగా తెలుసుకున్నా. ఈ చట్టం ద్వారా మా రాష్ట్రంలో పేదవారికి, బాధితులకు సాయపడతా.
అవినీతిపై పోరాటం: సామ్యేలు లీమా, ఒరిస్సా రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా అవినీతిపై ఈ చట్టం ద్వారా అందరితో దరఖాస్తులు చేయిస్తా. అవినీతిపై పోరాటం చేస్తా.
ఉపయోగకర చట్టం: ఇమాన్యుయేల్ జాన్, హర్యానా ప్రజలకు ఉపయోగకర చట్టం. దీనిని సద్వినియోగం చేసుకొని ప్రజల్లో చైతన్యం తెస్తా. చట్టంపై అవగాహన కల్పించినందుకు 'ఈనాడు' ముందడుగుకు రుణపడి ఉంటా.
పథకాలు పేదలకందేలా చేస్తా: మమత, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మా రాష్ట్రంలో ప్రజలకందటం లేదు. అసలు వాటి గురించి ప్రజలకు పూర్తిగా తెలియదు. పథకాలు సక్రమంగా పేదల దరిచేరేందుకు బ్రహ్మాస్త్రాం ఈ చట్టం.
ప్రతి గ్రామంలో సదస్సులు: తిమోతి, మణిపూర్ స.హ. చట్టం సదస్సులో పాల్గొనటం ఇదే మొదటిసారి. మహారాష్ట్రలో ప్రజలకు దీని గురించి తెలియదు. 'ఈనాడు' స్ఫూర్తితో మా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సదస్సులు ఏర్పాటుచేస్తా.
గిరిజన గ్రామాల్లో.. : శ్యామ్యేల్, భద్రాచలం ఈ చట్టంపై అవగాహన కోసం ప్రతి గిరిజన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తా. ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన తప్పనిసరి. |
|