| సహచట్టంపై ఉద్యమిస్తాం |
| ప్రచురణ తేది: 26/10/2009 |
|
సహచర వేదిక సదస్సులో ఉద్యమకారులు
కడప (ఏడురోడ్లు), అక్టోబర్ 25 (న్యూస్‌టుడే): ''ఎందరో ఉద్యమకారుల సాధన వల్ల సహచట్టం వచ్చింది. ఈ చట్టం ప్రజల ఆయుధం. దీన్ని ప్రతిఒక్కరూ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ చట్టంపై ప్రతిఒక్కరికి అవగాహన కలిగేలా మనమందరం ఉద్యమించాలి' అని సహచర వేదిక సదస్సులో ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సమాచార హక్కు చట్ట రక్షణ వేదిక (సహచర వేదిక) కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ న్యాయవాది వెంకటస్వామిరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రహస్యాల చట్టం అమలులో ఉండేదని, ఏ విషయాన్ని అడిగిన ఇది అధికారుల రహస్యం కిందకు వస్తుంది. కాబట్టి సమాచారం చెప్పకూడదని తప్పించుకునేవారన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం సహచట్టం వచ్చింది. ఇంకా ఈ చట్టంపై ప్రజలకు అవగాహన పూర్తిస్థాయిలో కలుగలేదు. ఈ చట్టం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదేనని ప్రసంగించారు. తర్వాత 'ఈనాడు ముందడుగు' జిల్లా సమన్వయకర్త నాజర్ బాష మాట్లాడుతూ 2005 అక్టోబరు 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. నాలుగేళ్లు పూర్తయి ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతున్నాం. ఇంకా చాలావరకు ప్రజల్లో దీనిపై అవగాహన లేకపోవడం బాధకరమని చెప్పారు. అలాగని ఇది సాధారణ చట్టం కాదు.. ఓ మహోన్నత చట్టమన్నారు. ఈ చట్టం గురించి ప్రజల్లోకి స్వచ్ఛంధంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సహచర వేదిక కార్యక్రమాలకు 'ఈనాడు ముందడుగు' బాసటగా నిలిచి సహాయ సహకారాలను అన్నివేళలా అందిస్తుందన్నారు. అనంతరం ముందడుగు ముద్రించిన దరఖాస్తు నమూనాలను, చట్ట నిబంధన కాఫీలను అందరికి పంపిణీ చేశారు. సీహెచ్ఆర్‌డీ అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ధనంతో ప్రభుత్వాధికారులు చేసే ప్రతి పని గురించి ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ చట్టం కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదని పోస్టుల ద్వారా, కొరియర్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చన్నారు. రాయచోటికి చెందిన ఉపాధ్యాయుడు సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఇటీవల బోగస్ పట్టా పాసుపుస్తకాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనేకచోట్ల ఇలాంటి అక్రమాలు జరిగాయని సహచట్టం ద్వారా ఈ అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు విశ్రాంత మేనేజరు మాట్లాడుతూ నీటిబొట్టు, బొట్టు చేరితే మహాసముద్రం అవుతుంది. అలాగే ఉద్యమకారులు విడివిడిగా కాకుండా అందరూ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమయ్యిందన్నారు. రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేదికలో న్యాయవాదులు నాగసుబ్బారెడ్డి, వెంకట సుబ్బయ్య, జిల్లా వినియోగదారులు అధ్యక్షుడు మునిస్వామి, సామాజిక కార్యకర్త అయ్యలయ్య, దివాకర్‌తోపాటు ఇతరులు హాజరయ్యారు.
అడహక్ కమిటీ ఎన్నిక సహచర హక్కుకు సంబంధించి ఆదివారం అడహక్ కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో కన్వీనర్‌గా అడ్వకేట్ వెంకటస్వామిరెడ్డిని, కడప డివిజన్ కో కన్వీనర్‌గా కె.ఎల్.ఎన్.రావును, రాజంపేట కో కన్వీనర్‌గా వెంకటసుబ్బయ్యను, జమ్మలమడుగు కో కన్వీనర్‌గా దివాకర్‌ను ఎన్నుకున్నారు. |
|