| అమ్మో! జిరాక్స్ బిల్లు రూ.83 వేలు |
| ప్రచురణ తేది: 01/11/2009 |
|
స్టేషనరిదీ అదే తీరు గుంటూరు ఎంపీడీవో కార్యాలయ తీరిది సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి
గుంటూరు , గ్రామీణ గుంటూరు- న్యూస్‌టుడే: గుంటూరు ఎం.పి.డి.ఒ. కార్యాలయంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసేస్తున్నారు. అంచనాలు లేకుండా పనులు మంజూరు చేయడం... అయినవారికే పనులు కట్టబెట్టడం... కొన్నిచోట్ల పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడం... వంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యాలయం జిల్లా పరిషత్‌కు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. కలెక్టర్ బంగ్లాతో సహా ఇతర జిల్లా ప్రధాన కార్యాలయాలన్నీ ఎం.పి.డి.ఒ. కార్యాలయానికి చుట్టుపక్కలే ఉండటం విశేషం.
* ఈ కార్యాలయంపై విభిన్న ఆరోపణలతో పాటు అక్కడ జిరాక్స్, స్టేషనరీ, టీ, స్నాక్స్ తదితరాల పేరిట జరిగిన వ్యయాన్ని పరిశీలిస్తేనే వామ్మో! ఇంతా అనక మానరు. 2008- 2009 ఆర్థిక ఏడాదిలో కార్యాలయ అవసరాల పేరిట వినియోగించిన, బిల్లుల రూపంలో పొందిన మొత్తాన్ని చూస్తే అక్కడి అవినీతి అర్థమవుతుంది.
* తాజాగా సమాచార హక్కు చట్టం కింద పొందిన వివరాలను పరిశీలిస్తే ఆ కార్యాలయ అవినీతి రీతి వెల్లడవుతుంది. గత ఆర్థిక ఏడాదిలో కార్యాలయ అవసరాల నిమిత్తం ఫోటోస్టాట్ (జిరాక్స్) కింద రూ. 83,207బిల్లులు డ్రా అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో రూ. 13,215, మార్చిలో రూ. 12,604 జిరాక్స్ నిమిత్తం ఖర్చయినట్లు చూపారు. మొత్తంమీద నెలకు సగటున రూ. ఏడు వేలు ఖర్చుపెట్టినట్లు. ఇతర పలు ఎం.పి.డి.ఒ. కార్యాలయాలను 'న్యూస్‌టుడే' ఆరా తీయగా రూ.500 నుంచి రూ.వెయ్యి లోపు వ్యయం అవుతుంటుందని తెలిసింది.
* స్టేషనరి పేరిట గత ఆర్థిక ఏడాదిలో రూ. 38,915 ఖర్చు చూపారు. గత ఏడాది ఆగస్టులో రూ. 12,840 వ్యయమైందని బిల్లులు తీసుకున్నారు. నెలకు సగటున రూ. మూడు వేలకు పైగా వెచ్చించారు.
* టీ, స్నాక్స్ కోసం రూ. 54,407 వ్యయం చేశారు. మే నెలలో రూ. 9420, ఆగస్టులో రూ. 15,590 వ్యయం కావడం గమనార్హం.
* ఏడాదిలో జిరాక్స్, స్టేషనరి, టీ, స్నాక్స్‌లకు కలిపి రూ. 1,76,529 వ్యయం చేయడం, బిల్లులు పొందడం విస్మయానికి గురిచేస్తోంది.
* గుంటూరు రూరల్ మండలంలో 21 పంచాయతీలు ఉన్నాయి. గతంలో మండల అధ్యక్షురాలుగా తురకపాలెంకు చెందిన రత్నమేరి ఉన్నారు. ఆమె నిరక్షరాస్యురాలు. ఆమె భర్త పరిస్థితి కూడా అంతే. ఆయన నిరక్షరాస్యుడు. సాధారణ కూలి. వారిని దాదాపు ఏ విషయాల్లోనూ పరిగణలోకి తీసుకోకుండా కార్యాలయ సిబ్బంది వ్యవహారాలు చక్కబెట్టేవారనేది సమాచారం. కొందరు ప్రజాప్రతినిధుల అండదండలను ఆసరాగా చేసుకుని ఇష్టానుసారం నడుచుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
* కార్యాలయ అధిక వ్యయం గురించి ఎం.పి.డి.ఒ. ఇందిరా ప్రియదర్శినిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా తాను కొన్నాళ్ల కిందట బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిరాక్స్ నిమిత్తం రూ.500, స్టేషనరికి రూ.1000 లోపు ఖర్చవుతోందని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అంతకుముందు అయిదేళ్లు ఎం.పి.డి.ఒ.గా పనిచేసిన మాణిక్యరావును వివరణ కోరగా మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరించామన్నారు. బడ్జెట్ అనుమతిని బట్టి ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒకవేళ ఏదైనా ఎక్కువగా జరిగినట్లు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. |
|