నిజాలు రాబట్టడమే వ్యాపకం రెండొందల రోజుల్లో వంద దరఖాస్తులు గుంటూరు-న్యూస్‌టుడే: ప్రజాసేవ చేయడానికి ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టాన్నే ఆయన ఆయుధంగా మలచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని ... పలుశాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టడమే ఆయన తన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వచ్చిన సమాచారం ఆధారంగా ఖజానాకు వచ్చిన నష్టాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని, జరుగుతున్న అవినీతిని గుర్తించి ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాయడం ఆయన వ్యాపకం. రెండొందలు రోజుల్లో వంద స.హ.చట్టం కింద దరఖాస్తులు చేసి పలు శాఖల నుంచి ఆయన కీలక సమాచారం రాబట్టడం గమనార్హం.
గుంటూరు నగరానికి చెందిన పులివర్తి నరశింహులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అకౌంట్స్ విభాగంలో ఓ చిరుద్యోగి. 1975 నుంచి 2005 వరకు 30 సంవత్సరాలపాటు ఉద్యోగ విధులు నిర్వహించిన సమాజానికి తనవంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2006లో 'వెంగమాంబ ఎంబోల్డ్, సెంటియంట్, టాలెంటెడ్, అడ్వాన్స్‌డ్ లేడర్' (వెస్టల్) ఓ స్వచ్ఛందసేవా సంస్థను నెలకొల్పారు. తొలుత మహిళా సమస్యలపై దృష్టిపెట్టిన ఆయన గత సంవత్సరం నుంచి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేయడాన్ని తన వ్యాపకంగా మార్చుకున్నారు. నిధుల వినియోగం, నిబంధనల అమలు, తీసుకున్న నిర్ణయాలు తదితరాలపై స.హ.చట్టం కింద సమాచారం సేకరిస్తుంటే సంబంధిత అధికారులు, సిబ్బంది కూడా విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటారనేది ఆయన ఉద్దేశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పనిచేస్తున్న అత్యధిక శాఖలకు దరఖాస్తులు చేశారు. కొన్ని శాఖలు పంపిన సమాధానాల్లో లొసుగులు బయటపడ్డాయి. వాటిని గుర్తించి వారిపై అధికారులకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కొంత సమాచారాన్ని దినపత్రికలకు ఇవ్వడం ద్వారా వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చారు. గత సంవత్సరం జనవరి నుంచి జులై వరకు రెండొండల రోజుల వ్యవధిలో మొత్తం 100 దరఖాస్తులు చేశారు. సమాధానాలు రాబట్టారు.
రాబట్టిన కీలక సమాచారాలు * నగర ప్రజల నుంచి రూ.1.62 కోట్లకుపైగా గ్రంథాలయ సెస్సును వసూలు చేసికూడా ఆ మొత్తాన్ని గ్రంథాలయశాఖకు నగరపాలకసంస్థ సొంతానికి వినియోగించుకుంది.
* దైవ పూజలకు ప్రత్యేకంగా తయారుచేస్తున్న దీపారాధన నూనెను నిబంధనలు విపరీతమైన అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏశాఖ నియంత్రణ లేకపోవడంతో ప్రజలు నష్టపోతున్నారు. ఫలితంగా వినియోగదారులపై ఏటా రూ.కోట్ల రూపాయల భారం పడుతోందని ఆయన జిల్లా కలెక్టర్ రామాంజనేయులకు ఫిర్యాదు చేశారు. ఆయన దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.
* ప్రజల నుంచి సేవాపన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించని సంస్థల (సర్వీసు ప్రొవైడర్లు) వివరాలు రాబట్టారు. ఫలితంగా సెంట్రల్ ఎక్సైజ్ విభాగానికి రూ.53 కోట్లకుపైగా నష్టం వచ్చిందని తేల్చారు.
* బాలికా సంరక్షణ పథకం రిజర్వేషన్ల అమలులో అవకతవకలు.
* అనుమతులకు మించి భారీఎత్తున 'ఫాగింగ్ మిషన్ల' కొనుగోలు
* ఎస్.టి. విద్యార్థుల వసతి గృహాల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేని విషయం, అరకొరగా ఉన్న విషయం అధికారుల సమాధానాల్లో వెలుగుచూసింది.
చట్టం స్ఫూర్తి నెరవేరాలన్నదే ఆకాంక్ష - పులివర్తి నరశింహులు, వెస్టల్ నిర్వాహకులు పారదర్శకపాలనకు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి ప్రజలు స.హ.చట్టాన్ని పాశుపతాస్త్రంలా వినియోగించుకోవాలన్నదే నా ఆశయం. పలు పథకాల నిబంధనలను తెలుసుకుని పలుశాఖలకు దరఖాస్తులు చేస్తున్నాను. ప్రజలు స.హ.చట్టాన్ని విస్తృతంగా వినియోగిస్తే అవినీతి గణనీయంగా తగ్గుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. |