| బినామీ 'దోపిడీ' |
| ప్రచురణ తేది: 19/09/2009 |
|
* పాత రహదారులకు కొత్త బిల్లులు * తాత్కాలిక ఉద్యోగే గుత్తేదారు * 'ఈనాడు - ముందడుగు'తో బట్టబయలు న్యూస్‌టుడే - శ్రీకాకుళం, పాలకొండ ఆయన పేరు రాజారావు. పాలకొండ పంచాయతీరాజ్ సబ్ డివిజన్లో తాత్కాలిక వర్కు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధికారులకు పనిభారం తగ్గించడానికి కాదు..శాఖపరంగా చేపట్టే పనులకు గుత్తేదారుగా వ్యవహరించడానికి !! కొన్నాళ్లుగా సాగుతున్న ఈ బినామీ వ్యవహారానికి కొందరు అధికారులు వత్తాసు పలికారు. రూ.29లక్షలతో చేపట్టిన రహదారుల నిర్మాణాల్లో పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టించారు. పాత రహదారుల్ని కొత్తగా చూపిస్తూ ఉన్నతాధికారుల కళ్లకు గంతలు కడుతున్న వైనం 'ఈనాడు-ముందడుగు'తో బయటపడింది.
పాలకొండ పంచాయతీరాజ్ సబ్‌డివిజన్ పరిధిలో 2008-09 ఆర్థిక సంవత్సరానికి రూ.29లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటి ద్వారా కంకర, సిమెంట్ రహదారులు నిర్మించాలి. వాస్తవానికి ఏ గ్రామ పరిధిలో పనులు జరిగితే ఆ గ్రామానికి చెందిన వ్యక్తులే పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా పాలకొండ పంచాయతీరాజ్ శాఖలో తాత్కాలిక వర్క్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న రాజారావే అత్యధిక పనులు చేజిక్కించుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఆయన పంచాయతీరాజ్‌శాఖలో బినామీ గుత్తేదారుగా పనులు చక్కబెడుతున్నారు. గ్రామ కమిటీలో అనధికారికంగా పేరు చేర్చి మరీ అధికారులు అనుమతులు మంజూరుచేశారు. పాత రహదారుల్ని కొత్తగా చూపిస్తున్నా పట్టకుండా బిల్లులు చేస్తూ ఔదార్యం ప్రదర్శిస్తున్నారు. సమాచార చట్టం ఉపయోగించి 'ఈనాడు- ముందడుగు' ప్రతినిధి 2008-09 ఆర్థిక సంవత్సరానికి పాలకొండ సబ్ డివిజన్‌లో జరిగిన పనులు, ఖర్చుల వివరాలు దరఖాస్తు చేయడంతో అక్రమాలు బయటపడ్డాయి.
అవినీతికి అనవాళ్లు * 2008 సంవత్సరంలో డోలమడ-జి.వి.పురం గ్రామాల మధ్య రూ.రెండులక్షల ఎ.సి.డి.పి. నిధులు వెచ్చించి రహదారిని నిర్మించారు. ఇదే రహదారికి రూ.రెండు లక్షలు నిధులు మంజూరుచేసి రాజారావు పేరిట రూ.1.96 లక్షలు బిల్లులు చేశారు.
* ఎన్.కె.రాజపురం-హరిపురం గ్రామానికి 2007లో రూ.2 లక్షలు వెచ్చించి కంకర రోడ్డు నిర్మించారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో పనులు చేసినట్లు చూపి రూ.2 లక్షలు బిల్లులు చేశారు.
* ఓని- విజయరాంపురం గ్రామానికి గతంలోనూ పంచాయితీరాజ్ నుంచి రూ.2 లక్షలు ఖర్చు చేసి రహదారి నిర్మించారు. దీనిపై కంకరరోడ్డు వేసినట్లు చూపి రూ.1.92 లక్షలు బిల్లులు స్వాహాచేశారు.
* పాలకొండ ఏరియా ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు వెళ్లే రహదారి కొత్తగా వేసినట్లు చూపి రూ.1.14 లక్షలు బిల్లులు స్వాహా చేశారు.
* పాలకొండలోని వెంకటరాయుని కోనేరు గట్టుపై రూ.రెండు లక్షలు వెచ్చించి నిర్మించిన సిమెంటు రహదారిలోనూ నాసిరకంగా పనులు జరిపి స్వాహా చేశారు.
గతంలోనే అనుమతులు పాలకొండ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పనులకు గతంలోనే అనుమతులు వచ్చాయని డీఈ శరత్ కుమార్, ఇన్‌ఛార్జి ఏఈ సత్యనారాయణ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. రాజారావు బినామీ గుత్తేదారుగా పనులు చేయడంపై ప్రశ్నిస్తే తాత్కాలికంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నట్లు చెప్పారు. అతను స్థానికుడు కాకపోయినా ఎందుకు పనులు చేయిస్తున్నారని ప్రశ్నిస్తే గతంలో ఉన్న అధికారులు అనుమతులు ఇవ్వడం వల్ల మేం ఏమీ చేయలేకపోయామని వెల్లడించారు. |
|