| కనిపించని లెక్కలు...రూ. 70 లక్షలకు రెక్కలు ! |
| ప్రచురణ తేది: 09/10/2009 |
|
* అన్నవరం జమాఖర్చుల్లో నగదు తరుగు! * నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది పెంపు * ఆడిట్ శాఖ తనిఖీల్లో వెల్లడైన సత్యాలు
న్యూస్‌టుడే , కాకినాడ అన్నవరం- వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 2007-08 ఆర్థిక సంవత్సరం జమా ఖర్చులకు సంబంధించి రూ. 70,23,848.90 మేరకు నగదు మాయమైంది. 2008 ఆగస్టు 3 నుంచి 2009 మార్చి 25 వరకూ కాకినాడ జిల్లా ఆడిట్ శాఖ- సహాయ ఆడిట్ అధికారి వి.రాజారామమోహనరావు బృందం నిర్వహించిన చిట్టాల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. సత్యదేవుడి అన్నదాన పథకం సహా మొత్తం వచ్చే ఆదాయాన్ని అన్నవరం, తుని, పిఠాపురం, తొండంగిల్లోని ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, పోస్టాఫీసు తదితర మొత్తం 8 బ్యాంక్ ఖాతాల్లో దేవస్థానం భద్రపరుస్తోంది. అందులో కనబడుతున్న మొత్తానికి, దేవస్థానం నిర్వహించే నగదు పుస్తకం(క్యాష్ బుక్)లోని సొమ్ము నిల్వకు సరి పోల్చితే, మొత్తం మీద రూ. 70.23 లక్షలకు పైగా తక్కువ సొమ్మున్నట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఈ తేడాకు సంబంధించి దేవస్థానం అధికారులు బాధ్యుల్ని విచారించి, ఆ సొమ్ము రికవరీ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాచార హక్కు చట్టం(ఆర్.టి.ఐ) ద్వారా 'న్యూస్‌టుడే' సేకరించిన సమాచారంలో ఇలాంటి అంశాలెన్నో వెల్లడయ్యాయి. దేవుడి సొమ్ము విషయంలో దేవస్థానం అధికారులెంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారో.. భగవంతుడి డబ్బుని ఇష్టారాజ్యంగా ఎలా వాడేస్తున్నారో తెలిపే మరికొన్ని వివరాలివీ..
ఆ అడ్వాన్సులకు లెక్కల్లేవు(ట)! దేవస్థానం నిర్వహించే వివిధ ఉత్సవాలు, సంప్రదాయ కార్యక్రమాలు, వేడుకల ఏర్పాట్ల కోసం పలువురు సిబ్బంది ముందస్తు సొమ్ము తీసుకోవటం అన్నది అన్ని చోట్లా జరిగేదే. అయితే, తాము తీసుకున్న సొమ్ముకు సంబంధించి ఎంత ఖర్చు చేశారు? ఇంకెంత మిగిలింది? లేదా అదనంగా ఖర్చు అయ్యిందా? వంటి అంశాలతో సంబంధిత బిల్లులు, వోచర్లు, వినియోగ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో(2007-08) దేవస్థానం అధికారులు, ఉద్యోగులు పలువురు వివిధ కారణాలతో తీసుకున్న అడ్వాన్స్‌ల వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని ఆడిట్ నివేదికలో స్పష్టం చేశారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.నూకరాజు తీసుకున్న రూ. 1,00,465కూ, దేవస్థానం పి.ఆర్.ఒ. టి.రాముడు తీసుకున్న రూ. 70 వేలకు, ల్యాండ్ స్కేపింగ్ పనుల కోసమని సహాయ ఇంజినీర్ డి.జి.కె.రాజు తీసుకున్న రూ.2,25,000లకు, గోశాల పనుల కోసమని ఎ.ఇ. ఎన్వీబీ కుమార్‌కు ఇచ్చిన రూ.7,50,000లకు, ఫర్నిచర్ నిమిత్తం ఎ.ఇ. వి.రామకృష్ణ తీసుకున్న రూ. 2,50,000లకు, సొంత సేద్యం కోసం ఎస్.ఎ. ఏవీఎస్ఎన్ ప్రసాద్‌కు ఇచ్చిన రూ. 3,20,600కి, డి.ఇ.ఇ. పి.గుర్రాజుకు ఇచ్చిన రూ.లక్షకి, శాంతి కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాల కోసమని బి.హెచ్.హరిబాబుకు ఇచ్చిన రూ. 1,.45,000కి సరైన బిల్లులు, వోచర్లు, వినియోగ పత్రాలేవీ సమర్పించలేదు.
ఇష్టారాజ్యంగా సిబ్బంది పెంపు వివిధ సందర్భాల్లో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేవస్థానంలో సిబ్బంది పోస్టుల్ని పెంచారు. అయితే.. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి మాత్రం తీసుకోలేదు. వివిధ దశల్లో మంజూరైన పోస్టుల మేరకు వాస్తవంగా 270 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు 360కి పెంచారు. అంటే సుమారు 90 మంది అదనంగా ఉద్యోగాలు పొందారు. టైపిస్ట్, ఆయుర్వేద డాక్టర్, ప్రధాన అర్చకులు, కండక్టర్లు, ఎల్.జి.ఎస్. తదితర సిబ్బందితో పాటు దేవస్థానం పి.ఆర్.ఒ. పోస్టు కూడా అదనంగా నిబంధనలకు విరుద్ధంగా సృష్టించినవి కావడం విశేషం. మూడు గ్రేడ్లుగా వర్గీకరించిన వ్రత పురోహితుల సంఖ్య 87కి మించకూడదన్న నిబంధనల్ని బుట్టదాఖలు చేశారు. మార్చి 94 నుంచి ఇష్టారాజ్యంగా సంఖ్య పెంచటంతో, ప్రస్తుతం నాలుగు గ్రేడ్లుగా 154 మంది వ్రత పురోహితులున్నారు.
ఆడిట్ అభ్యంతరాలున్న మరి కొన్ని పెద్ద మొత్తాల వివరాలివీ.. * దేవస్థానానికి సంబంధించి 2006-07 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,24,990; 2007-08లో 33మందికి రూ. 39,38,425 చొప్పున ముందస్తు గృహ నిర్మాణ రుణాలుగా అందచేశారు. కానీ వీటికి సంబంధించి మంజూరు ఆదేశాలుగానీ, తనఖా పత్రాలుగానీ, రుణ వినియోగ ధ్రువీకరణ పత్రాలు వంటివేవీ ఆడిట్‌కి సమర్పించలేదు.
* దేవుడి సొమ్మును భద్రపరిచే విషయంలోనూ ఆదాయాన్నిచ్చే మార్గాల్ని అన్వేషించటంలో దేవస్థానం విఫలమైంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లకి సంబంధించి వడ్డీలపై సరైన అవగాహన లేక 10.25 % వడ్డీ వచ్చే బ్యాంకుల్ని వదిలేసి, కేవలం 9.5 % వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లోనే పెద్ద మొత్తాలకు ఎఫ్.డి.ఆర్.లు వేశారు. అలా 0.75 % వడ్డీ తక్కువ లభించటంతో దేవస్థానానికి సుమారు రూ.62,993/-నష్టమొచ్చిందని ఆడిట్ శాఖ వెల్లడించింది.
* సహజ హాస్పిటల్ పేరిట నిర్వహించిన పద్దులో సుమారు రూ. 11,97,148/- వ్యయం చూపారు. కానీ ఇందుకు సంబంధించి వోచర్లు, స్టాక్ రిజిస్టర్ తదితర అనుబంధ దస్త్రాలేవీ ఆడిట్ బృందానికి సమర్పించలేదు.
* దేవస్థానం పరిధిలో రూ. 47,76,358లతో చేపట్టిన నిర్మాణ, ల్యాండ్ స్కేపింగ్, సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి సరైన ఎస్టిమేట్లు, ఓచర్లు, మెజర్‌మెంట్స్(ఎం.) బుక్, అగ్రిమెంట్ దస్త్రాలేవీ లేవని ఆడిట్ అభ్యంతరం తెలిపారు. అలాగే రూ. 13,70,110లతో చేపట్టిన విద్యుదీకరణ పనులకు సంబంధించి కూడా ఎలాంటి అనుబంధ ఫైళ్లు, ఓచర్లు, ఎం.బుక్స్ సమర్పించలేదు.
దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం: రామచంద్రమోహన్, ఈవో అన్నవరం దేవస్థానం ఆదాయ, వ్యయాల చిట్టాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వ ఆడిట్ శాఖ తెలిపే అభ్యంతరాల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోకపోవటం తప్పేనని దేవస్థానం కార్యనిర్వాహక అధికారి, ఆర్.జె.సి. రామచంద్రమోహన్ అంగీకరించారు. 'ఈ ఏడాది నుంచి ఆడిట్ అభ్యంతరాల్ని చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నాం. దేవస్థానం బస్సుల నిర్వహణ లాభదాయకంగా మారేందుకు కృషి చేస్తాం. అలాగే భారీ మొత్తాల్లో ముందస్తు హౌసింగ్ రుణాలు తీసుకొన్న సిబ్బంది నుంచి సొమ్ము రికవరీ చేస్తాం..' అని ఈవో 'న్యూస్‌టుడే'కి తెలిపారు.
|
|