| వికలాంగుల విద్య పక్కదారి |
| ప్రచురణ తేది: 14/09/2009 |
|
* ఏటా రూ.70 లక్షల ఖర్చు వృథా * సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి
ఒం గోలుపట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో బుద్ధిమాంద్యం, వికలాంగులైన పిల్లలకు ఇంటి వద్దనే విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో రాజీవ్ విద్యామిషన్ అమలుచేస్తున్న సమీకృత విద్యాపథకం జిల్లాలో పక్కదారి పట్టింది. పిల్లలకు విద్య నేర్పించటానికి నియమించిన రిసోర్సుపర్సన్లు(టీచర్లు) లక్షణంగా వేతనాలు అందుకుంటూ పిల్లల ఇళ్లవైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పథకాన్ని పర్యవేక్షించాల్సిన కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి బిల్లులు చేయటానికే పరిమితమయ్యారే తప్ప అమలు తీరును పరిశీలిస్తున్న దాఖలాలు లేవు. ఈ పథకం కింద జిల్లాకు ఏటా రూ.60 నుంచి రూ.70 లక్షలు నిధులు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 45 మండలాల్లో ఐ.ఇ.డి. పథకం అమలులో ఉండగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రిసోర్స్ పర్సన్‌ను నియమించారు. ఒక్కొక్కరు 15 మందిని వికలాంగులైన పిల్లలను ఎంపిక చేసుకొని విద్యా సంవత్సరం పొడవునా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి బోధన చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వికలాంగులకు రిసోర్స్‌పర్సన్లు ప్రత్యేక బోధన చేయాలి. నెలలో 4 సార్లు వికలాంగుల పిల్లల ఇళ్ళ వద్దకు వెళ్ళి బోధన చేయాలి. మరో నాలుగు రోజులు పాఠశాలలను సందర్శించి అక్కడ ఉండే పిల్లలకు పాఠ్యాంశాలు చెప్పాలి.
నెలకు రూ.6వేల వేతనం రిసోర్స్‌పర్సన్స్‌కు నెలకు రూ.6వేలు వేతనం చెల్లిస్తున్నారు. ఆవిధంగా ఏడాదికి రెండున్నర లక్షల రూపాయలు వేతనాల కింద ఖర్చు చేస్తున్నారు. వికలాంగ విద్యార్థుల్లో చెవిటి, మూగ వారుంటే వారికి సంబంధిత పరికరాలను కూడా రాజీవ్ విద్యామిషన్ ద్వారానే సమకూరుస్తారు. ప్రతి నెలా వైద్యశిబిరాలు నిర్వహించి వారికి వైద్య సేవలు అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు ఈవిధంగా చదువు చెప్పి సాధారణ విద్యార్థులతో పాటు పదో తరగతిలో పరీక్షలు రాయించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఆచరణలో అందుకు భిన్నంగా పథకం అమలు జరుగుతుంది. వికలాంగ పిల్లలకు బోధన తూతూమంత్రంగా మారగా కొన్ని చోట్ల ఒక్కసారి కూడా వారి ఇళ్లకు వెళ్ళిన దాఖలాలు లేవు.
లోపాలు వాస్తవమే.. సరిచేస్తాం: రామ్మోహనరావు, రాజీవ్‌విద్యామిషన్ పీఓ వికలాంగ పిల్లలకు చదువు చెప్పటానికి అమలు జరుగుతున్న పథకంలో కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవమే. ఇటీవల జరిపిన సమీక్షా సమావేశంలో ఈలోపాలు గుర్తించి హెచ్చరికలు చేశాం. త్వరలో మరోసారి సమావేశం జరిపి సక్రమంగా పని చేయని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని 45 మండలాల్లో పథకం అమలులో ఉన్నప్పటికి 40 చోట్ల మాత్రమే రిసోర్స్‌పర్సన్లు పని చేస్తున్నారు. |
|