| పర్యావరణానికి పెనుముప్పు |
| ప్రచురణ తేది: 01/09/2009 |
|
1975 - 1995 మధ్య దేశ ఆర్థిక వృద్ధి రేటు 2.5 శాతమైతే.. కాలుష్యం దానికి 8 రెట్ల్లు పెరిగింది. గత 15 ఏళ్లలో అది ఇంకా విస్త్రతమైంది. పారిశ్రామికీకరణ మోజులో ఉన్న ప్రభుత్వాలు.. కోరలు చాస్తున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోతున్నాయి. ఫలితంగా ఎక్కడ లేని రోగాలన్నీ ప్రజలను కమ్ముకుంటున్నాయి. మరోవైపు ఏటా దేశంలో 2.8 శాతం అడవులు హరించుకుపోతుండటం.. పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
దే శ ఐటీ రాజధాని బెంగళూరులోని 18 ఏళ్లలోపు చిన్నారుల్లో సగం మందికి పైగా ఆస్తమాతో బాధపడుతున్నారని ఓ అధ్యయన సారంశాం. నగరంలో పెరిగిన వాయు కాలుష్య ప్రభావమది. దేశంలో 24 ప్రాంతాలను తీవ్ర కాలుష్య బాధిత ప్రదేశాలుగా గుర్తించారు. వాటిలో మన రాష్ట్రంలో విశాఖపట్నం, పఠానుచెరు - బొల్లారం (హైదరాబాద్) పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. పారిశ్రామికీకరణ ఊపందుకున్నప్పటి నుంచి దేశంలో కాలుష్యం పెరుగుతోంది. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాల వల్ల భూమి, నీరు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. మరి వాటిని నియంత్రించాల్సిన కేంద్ర/ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పని చేస్తున్నాయా? చేస్తుంటే కూడా ఈ పరిస్థితి ఏంటి? కాలుష్యకారకులపై తీసుకుంటున్న చర్యలేంటి.. ఈ ప్రశ్నలకు జవాబులు రావాలంటే సహ ప్రయోగమే మార్గం.
' గాలి'లో ప్రాణాలు
దేశంలో 70 శాతం వాయు కాలుష్యానికి వాహనాలే కారణం. కాలం చెల్లిన వాటిని కూడా 'నడిపిస్తుండటం'తో వాతావరణంలోకి విపరీతంగా విషవాయువులు వెలువడుతున్నాయి. శ్వాసకోస వ్యాధులు, కాన్సర్ తదితరాలకు ఇవి కారణమవుతున్నాయి. మరోవైపు మన దేశంలో 500 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం.. 500 టన్నుల కార్బన్ వ్యర్థాన్ని వాతావరణంలోకి విడిచిపెడుతోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన పదార్థాలు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. దాని ఫలితమే అకాల వర్షాలు, వరదలు.
నీళ్లలో గరళం కాలుష్యం వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది నీటి వనరులే. భూగర్భ జలాలు, చెలమలు, నదులు అన్నీ రసాయనిక వ్యర్థాలతో నిండిపోతున్నాయి. వ్యర్థాలను శుద్ధి చేయకుండా.. నేరుగా నదులు, కాల్వల్లోకి వదలుతున్నారు. చక్కెర, తోలు, రంగులు, ఫార్మా, టెక్స్‌టైల్స్, పెట్రో కెమికల్స్, పురుగు మందుల పరిశ్రమలు, డిస్టలరీలు, థర్మల్ విద్యుత్కేంద్రాలు, తదితరాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలను పెద్ద పరిశ్రమలు నిర్వహిస్తున్నా.. మిగిలిన వాటి వల్ల నష్టం ఎక్కువగా ఉంది. మన దేశంలో 10 శాతం వ్యర్థ జలాల శుద్ధి మాత్రమే జరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. మరోవైపు వ్యవసాయంలో పురుగు మందుల వాడకం పెరగడంతో.. పొలాల సమీపంలోని భూగర్భ జలాలూ తీవ్రంగా కలుషితమవుతున్నాయి. టాక్సిక్ వ్యర్థాలు, ఆర్గానిక్ కలుషితాల వల్ల నీళ్లు గరళమయమవుతున్నాయి.
శబ్దం .. కర్ణకఠోరం ధ్వని 'హద్దు' దాటితే గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి.65 డెసిబళ్లు మీరితే గుండె జబ్బులు, చెవుడు తప్పవు. వాహనాల రొదల నుంచి లౌడ్‌స్పీకర్ల, మందుగుండు సామగ్రి మోతల వరకు అన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీసేవే. అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్‌ను వినియోగించడం.. శబ్ద కాలుష్య నియమాలు (రెగ్యులేషన్, కంట్రోల్), 2000 ప్రకారం నిషేధం. ఈ నిబంధన అమలు తీరు అందరికీ తెలిసిందే. శబ్ద కాలుష్యంపై ఎవరైనా ఫిర్యాదులు చేసినా పోలీసులు పర్యావరణ పరిరక్షణ, శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాల కింద కేసులు నమోదు చేయట్లేదు. ముంబాయిలోని సగంపైగా ఠాణాల్లో గత మూడేళ్లలో ఈ చట్టాల కింద ఒక్క కేసూ నమోదు కాలేదన్న సంగతి సహ చట్టంతోనే వెలుగులోకి వచ్చింది.
చట్టం ఇలా ఉంది.. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద నేరం రుజవు అయితే అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతుంటే.. రోజుకు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తారు. ఏడాదికి పైగా అలా సాగితే.. సంబంధిత వ్యక్తులను ఏడేళ్ల వరకూ కారాగారానికి పంపించవచ్చు. |
|