శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: ఉత్తుత్తి ఎత్తిపోతలే....!
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
ఉత్తుత్తి ఎత్తిపోతలే....!
ప్రచురణ తేది: 09/10/2009

* కాగితాల్లో లెక్కలతో పొంతన లేని వైనం
* '
ఈనాడు-ముందడుగు'తో వెలుగులోకి

విజయనగరం, అక్టోబర్ 8 (న్యూస్‌టుడే):
నిర్వహణ లోపాలతో జిల్లాలోని సాగునీటి ఎత్తిపోతల పథకాలు పడకేశాయి. కరవు కాలంలో ఆసరాగా ఉంటాయనుకున్న పథకాలు రైతులకు నిరాశ మిగుల్చుతున్నాయి. సాగునీటి వనరు ఆయకట్టులో చివరి భూములకు నీరందించడంలో ఎత్తిపోతల పథకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఏడాది కరవు ఛాయలు కమ్ముకున్నందున వీటి అవసరం మరింత ఎక్కువగా ఉంది. అయినా ఇవేవీ పని చేయకపోవడం రైతులకు శరాఘాతంగా మారింది. నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై 'ఈనాడు-ముందడుగు' సమాచార హక్కు అస్త్రాన్ని ఉపయోగించి తీసుకున్న సమాచారంతో అసలు విషయాలు బయటపడ్డాయి. జిల్లాలో మొత్తం 41 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, అందులో 12 పథకాలు పని చేసే స్థితిలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే వాస్తవానికి ఇందులో రెండు, మూడు పథకాలు మినహా మిగతా పథకాలేవీ ఉపయోగంలో లేవు. ఉన్న పథకాలు సైతం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల మొరాయిస్తున్నాయి. జిల్లాలోని 41 ఎత్తిపోతల పథకాల కింద 9033 ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. ప్రస్తుతం ఆయకట్టులో 100 ఎకరాలు కూడా సాగుకు నోచుకోకపోవడం ఎత్తిపోతల పథకాల పనితీరుకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం పూసపాటిరేగ మండలం కోనాడలో ఎత్తిపోతల పథకం పని చేస్తోందని, 440 ఎకరాల ఆయకట్టు సాగవుతుందని తెలిపారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎత్తిపోతల పథకం మోటారు మరమ్మతులకు గురయ్యింది. విద్యుత్తు బోర్డులు పాడైపోయాయి. పైపులు విరిగిపోయాయి. కరెంటు సరఫరా ఉన్నా ఇవేవీ ప్రస్తుతం పని చేయడం అనుమానమే. పతివాడలో 50 ఎకరాల ఆయకట్టుతో ఎత్తిపోతల పథకం పని చేస్తోందని చెబుతున్నా, అక్కడ పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా ఏమీ లేదు.

నానాటికి తీసికట్టుగా నిర్వహణ
జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్ని ఎత్తిపోతల పథకాల నిర్వహణ తీరు నానాటికి తీసికట్టుగానే తయారయ్యింది. 1995 సంవత్సరం వరకు వీటి నిర్వహణ బాధ్యత కూడా ఏపీఎస్ఐడీసీయే చూసుకునేది. సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన సిబ్బంది ఉండటంతో వారి ఆధ్వర్యంలో నిర్వహణ సవ్యంగా సాగేది. ఎత్తిపోతల పథకం ఆయకట్టు మొత్తానికి నీరందేది. 1995 తరువాత ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను రైతు కమిటీలకు అప్పగించారు. కరెంటు బిల్లులు, మరమ్మతులు మొదలైన వ్యయాల మొత్తం రైతు కమిటీలే భరించాల్సి వచ్చేది. దీంతో లక్షల్లో వచ్చే కరెంటు బిల్లులు చెల్లించక కొన్ని పథకాలు మూలనపడ్డాయి. తరువాత కాలంలో 2004 నుంచి ఎత్తిపోతల పథకాల కరెంటు బిల్లులు ప్రభుత్వమే భరిస్తోంది. అయినా పథకాల పనితీరులో పెద్దగా మార్పులేదు. ఏపీఎస్ఐడీసీ కూడా కేవలం కరెంటు బిల్లులు కట్టేసి చేతులు దులుపుకుంటుండటంతో ఎత్తిపోతల పథకాలు ఆశించిన ఫలితాలివ్వడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రూ.కోట్లలో వ్యయం
జిల్లాలో ఏర్పాటైన ఎత్తిపోతల పథకాలకు రూ.కోట్లలో వ్యయం చేశారు. మేరకు రైతులకు ఉపయోగపడకపోవడం విశేషం. ఒక్కో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆయకట్టులో ఎకరాకు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు వ్యయమవుతుందని అధికారిక అంచనా. జిల్లాలో 9,033 ఎకరాల ఆయకట్టుకు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. తక్కువలో తక్కువ ఎకరాకు రూ.50,000 వ్యయమయ్యిందని భావించినా రూ.45.17 కోట్లు ఖర్చు అయ్యింది. అయితే మేరకు లబ్ధి చేకూరలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలాల్లో అంతేగతి...
జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ఎందుకూ కొరగాని విధంగా ఉన్నాయి. ఇందులో పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పూసపాటిరేగ, సీతానగరం, రామభద్రపురం, గజపతినగరం, కురుపాం, మక్కువ, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట, డెంకాడ, సాలూరు మండలాల్లో రెండు, మూడు చొప్పున ఎత్తిపోతల పథకాలు ఉండగా అవేవీ ప్రస్తుతం పనిచేయడం లేదు.

ప్రభుత్వం ఆదుకుంటేనే సమస్య తీరేది
చంపావతి నది కాల్వపై నిర్మించిన కోనాడ ఎత్తిపోతల పథకం పని చేయకపోవడం వల్ల అన్నపూర్ణగా పేరొందిన ప్రాంతం బీడు భూమిగా మారింది. కోనాడ, వెల్దూరు, బూరపేట ప్రాంతాలకు కాలువల ద్వారా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి నీటి సరఫరా చేసేవారు. ఫలితంగా సమృద్ధిగా పంటలు పండేవి. పథకం రైతులు నిర్వహించుకోవాలని ప్రభుత్వం చేతులెత్తేయడంతో పంటలు లేక వలసపోవాల్సి వస్తోంది.

పల్లంటి సింహాచలం, రైతు
ప్రభుత్వమే నిర్వహించాలి
20 ఏళ్ల కిందట ప్రభుత్వాలు పథకాన్ని సమర్థంగా నడిపేవి. గత 15 యేళ్ల నుంచి పథకాన్ని రైతులే నిర్వహించుకోవాలనడంతో పథకం మూలకు చేరింది. 480 ఎకరాల వరకు ఉన్న సారవంతమైన భూములన్నీ బీడు భూములుగా మారిపోయాయి.
గరే వెంకటరమణ, రైతు

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008