| మా నిబంధనలు మావి |
| ప్రచురణ తేది: 08/09/2009 |
|
స హ దరఖాస్తులను కొందరు అధికారులు గుడ్డిగా తిరస్కరిస్తున్నారనడానికి సాక్ష్యమిది. కోరిన సమాచారం ఉన్న దస్త్రం (ఫైల్) సంఖ్య చెప్పలేదంటూ దరఖాస్తును తిప్పి పంపిన అధికారులు.. సహ చట్టంలోని ఏ నిబంధనల ప్రకారం అలా చేస్తున్నామన్న సంగతిని మాత్రం చెప్పలేదు. సూరారం కాలనీలోని డీపీసీపీ ప్రభుత్వ పాఠశాలకు, వాణిజ్య సముదాయానికి కేటాయించిన భూముల వివరాలను కోరుతూ కుత్బుల్లాపూర్‌కు చెందిన హెచ్.ఉపేంద్రాచారి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి సహ దరఖాస్తు చేశారు. దానికి స్పందించిన కుత్బుల్లాపూర్ తహశీల్దార్ 'దరఖాస్తు సూటిగా లేదు. సమాచారం ఉన్న దస్త్రాల సంఖ్యను దరఖాస్తుదారు చెప్పలేదు. సత్వర గుర్తింపునకు సంబంధిత దస్త్రాలు సిద్ధంగా లేవు కాబట్టి దరఖాస్తు పరిగణనలోకి రాదు' అని సమాధానమిచ్చారు. సహ చట్టంలోని సెక్షన్ 8 మినహాయింపులు వర్తించే సమాచారం మాత్రమే నిషేధం. దస్త్రాల సంఖ్య చెప్పకుంటే సమాచారం ఇవ్వక్కర్లేదని చట్టంలో ఎక్కడా లేదు. సమాచారాన్ని సేకరించి దరఖాస్తుదారుకు ఇవ్వడానికి 30 రోజుల సమయం ఉన్నా.. తహశీల్దార్ ఆ ప్రయత్నం చేయలేదు. దీనిపై ఆర్డీవో కార్యాలయానికి దరఖాస్తుదారు ప్రథమ అప్పీలు చేశారు. ఇప్పటికైనా దరఖాస్తుదారుకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే! |
|