| రూ.34 లక్షల ప్రజాధనం వృథా |
| ప్రచురణ తేది: 28/10/2009 |
|
అస్మదీయులకు చేనేత సహకార సంఘాలు 'ఈనాడు- ముందడుగు'తో వెలుగులోకి
మంగళగిరి , న్యూస్‌టుడే: చేనేత సహకార సంఘాల ఏర్పాటులో ప్రభుత్వం తప్పుచేసి పప్పులో కాలేసింది. కాంగ్రెస్ పాలకులు అస్మదీయులకు సంఘాలు మంజూరు చేసి లక్షలాది రూపాయలు వృథా చేసింది. జిల్లావ్యాప్తంగా 17 చేనేత సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్.సి. నం 7941/2007-ఎఫ్2 ద్వారా 2008 జనవరి 24, మార్చి 26 రెండు దఫాలుగా అనుమతి ఇచ్చినట్టు 'ఈనాడు- ముందడుగు'కు ఇచ్చిన సమాచారంతో బయటపడింది. సహకార రంగంలో కార్మికులకు ఉపాధి చూపడానికి ఉద్దేశించిన ఈ సంఘాలు ఆచూకీ కరవైంది. రికార్డులలో మాత్రం సంఘాలు పనిచేస్తున్నట్టు, కార్మికులకు దండిగా ఉపాధి చూపుతున్నట్టుగా నమోదుచేస్తున్నారు. వంద మంది కార్మికులు ఉండాల్సిన సంఘాలను కేవలం కుటుంబ సభ్యులతో కూడిన పాలక మండళ్ళతోనే నడిపించేస్తున్నారు. నియమావళి ప్రకారం ఆయా సంఘాలు కనీసం 1700 మందికి ఉపాధి చూపాల్సి ఉంది. సంఘాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులకు రూ.34 లక్షలు ఆర్.సి.నం. 260/08-డి, 2008 జనవరి 29, ఏప్రిల్ 9 తేదీల్లో విడుదల చేసింది. ఈ మొత్తాన్ని జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేసిన చేనేత సహకార సంఘాలకు షేరు క్యాపిటల్ కంట్రిబ్యూషన్ కింద రూ.2 లక్షల వంతున అందజేశారు. ఐలవరం, దాచేపల్లి, చేబ్రోలు, ఎర్రబాలెం, నవులూరుల్లో ఒక్కో చేనేత సహకార సంఘం, మంగళగిరిలోనే 11 సంఘాలు ఒకేసారి ఏర్పాటయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్యారా సంఘాలు రూ.2 లక్షలు వంతున అందుకున్నాయి. సంఘాల ఏర్పాటుకు కనీసం పాటించాల్సిన నియమ నిబంధనలు కేవలం కాగితాల్లో చూపి, అధికార పార్టీ నేతల సిఫారసులతో సంఘాలను చేజిక్కించుకున్నారు. చాలాచోట్ల నూతనంగా ఏర్పాటైన సంఘాల బోర్డులు కూడా కనిపించటం లేదు. ఆయా సంఘాలకు కార్యాలయాలు, మగ్గాల షెడ్లు మచ్చుకైనా కనిపించవు. ఇళ్ళ వద్దనే సంఘాలు ఏర్పాటుచేసి నామమాత్రంగా చేనేత సహకార సంఘాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో సంఘానికి తాజాగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ.లక్ష వంతున క్యాష్ క్రెడిట్ కింద ఆర్థిక సాయం అందజేసింది. ఒక్కో సంఘంలో పది నుంచి 20 మందికి పని కల్పిస్తున్నట్టు జిల్లా చేనేత, జౌళి శాఖకు ఆయా సంఘాల నివేదిక ఇస్తున్నాయి. నివేదికను ఇంకా అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించలేదు. అధికారుల అంచనా ప్రకారం మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటైన 14 సంఘాల్లో రెండు మాత్రమే ఉత్పత్తి చూపుతూ, కార్మికులకు ఉపాధి చూపలేక పోతున్నాయని అధికారుల అంచనా. ఓటరు జాబితాల్లోని పేర్లతో, మరికొన్ని బినామీ పేర్లు రాసి సంఘాలకు అనుమతి తీసుకు వస్తున్నారు. సంఘాలు నియమావళి పాటించి మగ్గాలు ఏర్పాటు చేసి వందమంది కార్మికులకు ఉపాధి చూపాలంటే షేర్‌క్యాపిటల్, ఉత్పత్తికి పెట్టుబడి భరించడం కష్టమవుతుందని సంఘాల నిర్వాహకుల వాదన. జిల్లా చేనేత, జౌళి శాఖ కూడా వీరి వాదనతో ఏకీభవిస్తోంది. కనీసం 10, 20 మంది కార్మికులకు కూడా ఉపాధి చూపలేకపోతే సదరు సంఘాలను వేరొక సంఘంలో ఆ శాఖ విలీనం చేస్తుంది. సంఘం రద్దు కాకుండా ఉండేందుకు అధికారుల సూచన మేరకే సంఘాల్లో నామమాత్రంగా ఉపాధి లభిస్తున్నట్టుగా రికార్డులు చూపుతున్నారు. ఈ చర్యల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం కార్మికుల దరిచేరకుండా పోతున్నాయి. సహకార రంగంలో కార్మికులకు మాత్రం ఉపాధి ఎండమావిగా మారింది. |
|