| పైపై పూత... నాణ్యతకు వాత...! |
| ప్రచురణ తేది: 25/10/2009 |
|
జిల్లాలో తూతూమంత్రంగా ఆర్.ఎస్.వి.వై. పనులు 'ఈనాడు- ముందడుగు' చొరవతో వెలుగుచూసిన వైనం
వి జయనగరం, మక్కువ - న్యూస్‌టుడే : గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రీయ స్వయం వికాశ్ యోజన (ఆర్.ఎస్.వి.వై.) కాంట్రాక్టర్ల పాలిట వరమయ్యింది. పైపై పూతలతో రహదారుల నిర్మాణం పూర్తయ్యిందనిపించారు. రూ.1.53 కోట్ల విలువైన రహదారుల పనులు పూర్తయినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నా లక్ష్యం పక్కదారి పట్టింది. పనులు పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ తీరు బయటపడింది. విజయనగరం డివిజన్‌లో ఆర్.ఎస్.వి.వై. ద్వారా చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధుల వివరాలను 'ఈనాడు-ముందడుగు' చొరవతో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది. వాటి ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు రహదారుల్లో డొల్లతనం బయటపడింది. 31.7.2009 వరకు మెంటాడ మండలంలో అయిదు రహదారుల నిర్మాణాలు చేపట్టగా నాణ్యత తీసికట్టుగా కనిపించింది. అయిదింటిలో రూ.1.18 లక్షల విలువైన నాలుగు పనులను విజయనగరానికి చెందిన బి.వి.ప్రభూజీకి అప్పగించగా, రూ.35 లక్షల విలువైన ఒక కాజ్‌వే నిర్మాణం కాంట్రాక్టును మాత్రం శ్రీకాకుళానికి చెందిన షిరిడిసాయి బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే పనులన్నీ ఇతరుల పేరిట ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడు, ప్రజాప్రతినిధి చేపట్టారని స్థానికులు బాహాటంగానే చెబుతున్నారు. రహదారుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చారని మెంటాడ మండలం గుర్ల గ్రామానికి చెందిన పల్లి వినోద్‌కుమార్, గండ్రేటి అప్పలనాయుడులు చెప్పారు. పనుల నిర్వహణ సమయంలో గ్రామస్థులు నాణ్యతపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నది వారి ప్రధాన ఆరోపణ. రహదారి పొడవునా పాత గొయ్యిల్లో గ్రావెల్ వేసి ఉమ్మి తడి పనులు చేపట్టినట్లు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రహదారుల్లో గోతులు ఏర్పడటంతో బస్సు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. దీంతో తమ్మిరాజుపేట మీదుగా గుర్ల ఆర్టీసీ బస్సు నడుపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. గజపతినగరం పంచాయతీరాజ్ ఇంజనీరింగు అధికారుల పర్యవేక్షణ లోపం అడుగడుగునా కనిపించింది. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు అత్యవసర వైద్య సదుపాయాలు అందడం లేదు. కనీసం అత్యవసర సర్వీసు అయిన 108 ఈ గ్రామాలకు రాలేని పరిస్థితులు దాపురించాయి. దీంతో గిరిజనులకు ఏదైనా సుస్తీ చేస్తే డోలీలే గతవుతున్నాయి.
పనుల వివరాలిలా.... * జక్కువ ఆర్ అండ్ బి - కూనేరు రోడ్డు నుంచి బుచ్చిరాజుపేట ఉద్దంగి మీదుగా కూనేరు వరకు తారు రోడ్డు నిర్మాణానికి రూ.72 లక్షలు కేటాయించారు. ఈ రహదారి ఒక పొర బి.టి. మాత్రమే వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల క్రితం పూర్తయిన ఈ రహదారి కూడా అదే రుజువు చేస్తోంది. అక్కడక్కడా పిక్కలు తేలి కనిపిస్తోంది.
* ఆండ్ర ఆర్ అండ్ బి రోడ్డు నుంచి వానిజ గ్రామానికి గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.17 లక్షలు కేటాయించారు. కిలోమీటరు మేరకు మెటల్ వేయాల్సి ఉండగా 100 మీటర్ల మేర మాత్రమే వేసి చేతులు దులుపుకొన్నారు. గ్రామస్థులు ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది.
* కొండలింగాలవలస నుంచి పసుపువానివలస మీదుగా పాతపాడు వరకు గ్రావెల్ రోడ్డుకు రూ.19 లక్షలు కేటాయించారు. ఇక్కడ పనులు కూడా తూతూమంత్రంగా జరిగాయి. రెడ్డివానివలస, సవరవిల్లి పుల్లేటివలస, పాతపాడు, మిర్తివలస, తెలుగువానివలస తదితర గిరిజన గ్రామాలకు ఈ రహదారి ఉపయోగపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నడవడానికే ఇబ్బంది కరంగా ఉందని గిరిజనులు అంటున్నారు.
* పోరాం రహదారి నుంచి పులిగుమ్మి రహదారుల పరిస్థితి అంతే. పులిగుమ్మి పాత రహదారిలో కొంతమేర మట్టి పనులు చదును చేసి, గ్రావెల్ పోశారే తప్ప రహదారి నిర్మాణపు పనులు పూర్తి చేయలేదు. ఈ రహదారికి రూ.9.5 లక్షలు వ్యయం చేయడం గమనార్హం. |
|