| గడువులోగా ఇవ్వాల్సిందే! |
| ప్రచురణ తేది: 06/10/2009 |
|
లేకుంటే జరిమానా కేంద్ర సమాచార కమిషన్ స్పష్టీకరణ
సహ దరఖాస్తుకు 30 రోజుల్లోగా అధికార యంత్రాంగం సమాచారం ఇవ్వాలి. మన రాష్ట్రంలో చాలా చోట్ల ఈ నిబంధన అమలు కావట్లేదు. నెలల తరబడి సమాచారం ఇవ్వకుండా దరఖాస్తుదారుణ్ని ఇబ్బంది పెడుతోన్న ప్రజా సమాచార అధికారులు కోకొల్లలు. వాస్తవానికి ఇలాంటి అధికారులపై సమాచార కమిషన్‌కు ఫిర్యాదు/ రెండో అప్పీలు వెళితే.. సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగిందని విచారణలో తేలితే సెక్షన్ 20(1) ప్రకారం జరిమానా విధించవచ్చు. అయితే.. గడువు దాటినా సమాచారం ఇవ్వలేదని పీఐవోలకు జరిమానాలు విధించిన ఉదంతాలు మన రాష్ట్రంలో అరుదు. కేంద్ర సమాచార కమిషన్ మాత్రం ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై కొరడా ఝళిపిస్తోంది.
జాప్యం చేస్తే.. అంతే న్యూఢిల్లీలోని జామియా హమ్‌దార్డ్ విశ్వవిద్యాలయం నుంచి కొంత సమాచారం అడుగుతూ అస్గర్‌ఖాన్ అనే వ్యక్తి సహ దరఖాస్తు చేశారు. 55 రోజులు గడిచినా విశ్వవిద్యాలయం స్పందించలేదు. దీనిపై కేంద్ర సమాచార కమిషన్‌కు అస్గర్‌ఖాన్ ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసి 55 రోజులైనా స్పందించకపోవడాన్ని బట్టి సమాచారాన్ని తిరస్కరించినట్లేనని.. విచారణ సందర్భంగా కమిషన్ అభిప్రాయపడింది. సమాచారం ఇవ్వాల్సిన రిజిస్ట్రార్.. చట్టాన్ని ఉల్లంఘించినట్లు విచారణానంతరం నిరూపితమైంది. దాంతో ఆయనకు రోజుకు రూ.250 చొప్పున 55 రోజులకు రూ.13,750 జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పు ఇచ్చింది. రిజిస్ట్రార్ జీతం నుంచి దాన్ని రాబట్టాలని ఉపకులపతిని ఆదేశించింది. - ప్రొఫెసర్ ఎ.వి.దత్తాత్రేయరావు, ఎ.ఎన్.యు., గుంటూరు |
|