| రూ.5 కోట్ల సంపద భద్రమేనా? |
| ప్రచురణ తేది: 01/11/2009 |
|
వెంకటగిరి , పొదలకూరు గోదాముల్లో 360 టన్నుల ఎర్రచందనం
నెల్లూరు , న్యూస్‌టుడే: జిల్లాలో సగటున ఏటా పట్టుబడుతున్న ఎర్రచందనం విలువ ఎంతో తెలుసా?.. అక్షరాలా రూ.2 కోట్ల పైచిలుకు. ఇలా అక్రమంగా తరలుతూ పట్టుబడిన ఎర్రచందనాన్ని వెంకటగిరి, పొదలకూరుల్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటగిరి ఎర్రచందనం గోదాంలో మొత్తం 3,00,400 కేజీల ఎర్రచందనం నిల్వ ఉండగా, పొదలకూరులో 60 టన్నులు నిల్వ ఉంది. ఈ రెండు చోట్లా కలిపి సుమారు రూ.5 కోట్ల పైచిలుకు విలువైన సంపద ఉందన్న మాట. ఈ సంపదకు రక్షణ మాత్రం ఉండాల్సినంత స్థాయిలో లేకపోవడంతో ఏడాదికి ఒక్కసారి నిర్వహించే గ్లోబల్ వేలం పాటల సమయానికి నిల్వల్లో చాలా మొత్తం కరిగిపోతోంది.
* జిల్లాలోని కడప, చిత్తూరు సరిహద్దు ప్రాంత మండలాలైన వెంకటగిరి, రాపూరు, ఆత్మకూరు, సీతారాంపురం, ఉదయగిరి, మర్రిపాడు తదితర మండలాల నుంచి టన్నుల కొద్దీ ఎర్రచందనం అక్రమంగా తరలిపోతోంది. జిల్లాలో ఎక్కడ అక్రమంగా ఎర్రచందనం పట్టుబడినా వెంకటగిరి, పొదలకూరు గోదాముల్లోకి తరలిస్తారు. అక్టోబరు 24వ తేదీ నాటికి ఈ గోదాముల్లో 360 టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. టన్ను ఎర్రచందనం విలువ అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.లక్షన్నర వరకు ఉంటుంది. తక్కువలో తక్కువ అన్నా వెంకటగిరి గోదాంలో ఉన్న నిల్వల విలువ రూ.4 కోట్ల పైమాటే. పొదలకూరులోనూ రూ.కోటి విలువైన నిల్వలున్నాయి. అయితే.. ఇక్కడ సరైన వసతుల్లేక గోదాములు నిండిపోయి ఆరుబయటే ఎర్రచందనాన్ని పడేస్తున్నారు.
* వెంకటగిరిలో పరిస్థితి ఇటీవల కాస్త మెరుగుపడగా, పొదలకూరులో మరింత అధ్వానంగా తయారైంది. వెంకటగిరిలో కొద్దికాలం క్రితం వరకు సరైన ఫెన్సింగు కూడా లేదు. ఇటీవలే ఆ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం అయిదుగురు ఆయుధాలతో కూడిన సిబ్బందిని నియమించారు. నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేక ఆరుబయటే ఎర్రచందనాన్ని పడేస్తుండటంతో చోరుల పాలవుతోంది. పొదలకూరులో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ప్రైవేటు కాపలాదారు పర్యవేక్షణలోనే గోదాం ఉండటం గమనార్హం. కోటి రూపాయల విలువైన సంపదకు కాపాలకాసే సిబ్బందికి కనీసం ఆయుధాలు కూడా లేవు. ఇద్దరు గార్డులు ఉన్నా వారు విధులు నిర్వహించడం అరుదు. గతంలో రాపూరు రేంజి కార్యాలయం ఇక్కడే ఉండేది. ఇటీవల దాన్ని రాపూరుకు మార్చడంతో కనీస భద్రత కరవైంది. ఏడాదికోసారి ఎర్రచందనం నిల్వలను గ్లోబల్ టెండర్ల ద్వారా వేలం వేస్తారు. వాస్తవ నిల్వలకు, వేలం వేసే నిల్వలకు ఏటా భారీగా తేడా వస్తుండటం గమనార్హం.
భద్రత పెంచుతాం - రమణారెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి వెంకటగిరిలో భద్రత మెరుగ్గానే ఉంది. పొదలకూరులో సిబ్బంది వెసులుబాటునుబట్టి అవసరమైన స్థాయిలో భద్రత పెంచుతాం. వేలం సమయంలో మొత్తం నిల్వలకు వేలం నిర్వహించం. |
|