| అన్నవరం చిట్టా.....అక్రమాల పుట్ట |
| ప్రచురణ తేది: 08/10/2009 |
|
* రూ. 55.56 కోట్ల జమాఖర్చులపై అనుమానాలు * మొత్తం 3,703 అంశాలపై ఆడిట్ అభ్యంతరాలు! * 'సమాచార హక్కు'తో వెల్లడైన వాస్తవాలు
న్యూస్‌టుడే , కాకినాడ : సమాజంలో జరిగే అన్యాయాలు, అవకతవకలు, అక్రమాల్ని అరికట్టమని దేవుణ్ణి వేడుకుంటుంటాం. కానీ.. అసలు ఆ దేవుడి సొమ్ముకే ఎసరు పెడితే.. ఏం చెయ్యాలి? ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో చేపట్టిన చాలా కార్యక్రమాల్లో ఇలాంటి అవకతవకలే చోటు చేసుకుంటున్నాయి. పెద్ద మొత్తంలో దేవుడి సొమ్ము పక్కదారి పడుతోందని, జమా ఖర్చుల పట్టికల్లో వేల సంఖ్యలో అభ్యంతరాలున్నట్లు రాష్ట్ర ఆడిట్ శాఖ తనిఖీల్లో వెల్లడైంది. నిజానికి ఇదంతా 2007-08 (అంటే గత ఆర్థిక సంవత్సరం)ఏడాది వరకూ మాత్రమే. ఇంకా వర్తమాన ఆర్థిక సంవత్సరం(2008-09)లో దేవుడి సొమ్ము పరిస్థితి ఏమిటో ఇంకా వెల్లడి కాలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా అందుబాట్లోకి వచ్చిన సమాచారం ప్రకారం.. 2007-08 ఆర్థిక సంవత్సరాంతంలో నిర్వహించిన ఆడిట్ వరకూ మొత్తం రూ. 55,56,81,022 మేరకు దేవస్థానంలో జరిగిన లావాదేవీలపై 3,703 ఆడిట్ అభ్యంతరాలు తెలిపారు. ఇందులో 1999 వరకూ జరిగిన రూ.18.00 కోట్లకు పైగా లావాదేవీలకు సంబంధించినవే 2,369 అభ్యంతరాలున్నాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఆడిట్ శాఖ వెలిబుచ్చే అభ్యంతరాల సంఖ్య, అందుకు సంబంధించిన లావాదేవీల సొమ్ము పెరుగుతూ వస్తోంది. అదే కేవలం 2007-08 ఆర్థిక సంవత్సరానికైతే.. మొత్తం రూ. 5,57,62,770/- మేరకు జరిగిన వివిధ లావాదేవీలకు ఆడిట్ అధికారులు మొత్తం 120 అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ప్రతి పనీ అభ్యంతరకరంగానే..! దేవస్థానంలో చేపట్టే చాలా పనుల్లో నిబంధనల ఉల్లంఘన, ఇష్టారాజ్యంగా సొమ్ము ఖర్చు, భగవంతుడి సొమ్ముని నిర్వహించడంలో నిర్లక్ష్యం కనబడుతోందని, ఇందుకు బాధ్యులైన వారి నుంచి సొమ్ము తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆడిట్ అధికారులు తమనివేదికలో సూచించారు. నాటి కార్యనిర్వాహక అధికారి(ఇ.ఒ) వినియోగించే స్కార్పియో వాహనానికి సంవత్సర కాలంలో అదనంగా రూ.1,35,333/- మేరకు డీజిల్ వాడటం నుంచి.. భక్తుల తలవెంట్రుకలు సమర్పించే కేశ ఖండన శాల ఆదాయం వరకూ అన్ని చోట్లా అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. చాలా పద్దుల నిర్వహణకు సంబంధించి సరైన అనుమతి, బిల్లులు, వోచర్లు, వినియోగ ధ్రువీకరణ పత్రాలు లేవని ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. దేవస్థానానికి సంబంధించిన వార్షికాదాయం, వ్యయం, నికర లాభం/నష్టం, దేవస్థానం చేసే వివిధ వేడుకలు, సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలకు సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరిచే నెం: 43రిజిస్టర్ లేదని ఆడిట్ నివేదికలో పేర్కొనటం గమనార్హం!
ఆదాయం ఎంతో వ్యయమూ అంతే(నా)! అన్నవరం దేవస్థానం ఆదాయ వ్యయాల లెక్కల్ని పరిశీలిస్తే.. 2007-08 సంవత్సరంలో మొత్తం 32.87 కోట్లుపైగా ఆదాయం రాగా, అందులో రూ. 32.24కోట్లకు పైగా వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహించే ఏడు బస్సులకు (రెండు మినీ బస్సులు సహా) కలిపి ఏడాదికి రూ. 96,66,010 వ్యయం అవుతుంటే, వీటి ద్వారా వచ్చే ఆదాయం కేవలం రూ. 67,82,378 మాత్రమే! అంటే రూ. 28,83,632 నికర నష్టమన్నమాట! అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోనూ (2006-07) బస్సుల నిర్వహణ ద్వారా దేవస్థానం రూ. 26,06,751.99 నష్టాన్ని మూటగట్టుకుంది! అయినా వీటి నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు, ఆదాయం పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలుశూన్యమని ఆడిట్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒక్క బస్సుల విషయంలోనే కాదు.. దేవస్థానంలో అత్యధిక శాతం ఉద్యోగులు దేవుడి సొమ్ముని ఇష్టారాజ్యంగా నిబంధనలు పాటించకుండా వాడుకుంటున్నారని ఆడిట్ రిపోర్టులో స్పష్టమైంది.
నష్ట నివారణచర్యల్లేవు: జిల్లా ఆడిట్ అధికారి అన్నవరం దేవస్థానానికి సంబంధించి ప్రతి ఏడూ ఆడిట్ చేశాక ఇచ్చే నివేదికలో నిబంధనల ఉల్లంఘన, అవకతవకలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటిని సరిదిద్దుకోవాలని సూచిస్తున్నట్లు జిల్లా ఆడిట్ అధికారి వై.అప్పారావు 'న్యూస్‌టుడే'కి తెలిపారు. అయితే, చాలా వరకూ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవటం లేదని, పైగా మళ్లీ అవే తరహా తప్పులు మరుసటి ఏడాది కూడా కనిపిస్తున్నాయి.. అన్నారు. |
|