| నరసరావుపేటలో స.హ.చట్టం అమలుపై విచారణ |
| ప్రచురణ తేది: 12/10/2009 |
|
నరసరావుపేట , న్యూస్‌టుడే : నరసరావుపేటలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కుకు సంబంధించిన సెక్షన్ 4(1)(బి) అమలులో లేదని స్థానిక లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సి.డి.అర్హ స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు నరసరావుపేటలో సమాచార హక్కు చట్టం అమలు ఎలా ఉన్నది, ఆయా కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులు ప్రదర్శిస్తున్నారా, లేదా, కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, వారి విధులు గురించి తెలిపే బోర్డులు ఏర్పాటు చేసిందీ లేనిదీ, పరిశీలన చేసి వారి వద్ద కూడా వివరణలు తీసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తమకు పంపాలని అర్హ జిల్లా కలెక్టర్‌ను కోరారు. స్థానిక లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కార్యదర్శి నాగసరపు నరసింహరావుకు రెండు రోజుల కిందట అర్హ పంపిన లేఖ అందింది. త్వరలో వీటిపై విచారణ జరిగే అవకాశం ఉంది. పట్టణంలో పలు కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులు లేని అంశాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 'ఈనాడు' ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. |
|