| సమాచార చట్టానికి ప్రచారం కల్పించండి |
| ప్రచురణ తేది: 18/09/2009 |
|
' ఈనాడు-ముందడుగు' సదస్సులో వక్తలు
జ డ్పీసెంటర్, న్యూస్‌టుడే ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వం నుంచి ఏమాత్రం ప్రచారం లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ప్రచారంలోకి తెచ్చేందుకు విద్యార్థులు కృషిచేయాలని సూచించారు. 'ఈనాడు- ముందడుగు' ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎస్ఆర్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో హైకోర్టు న్యాయవాది ఉడతనేని రామారావు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం సాధించేందుకు సహచట్టం తోడ్పడుతుందని చెప్పారు. అధికారి హోదా ఏదైనా ప్రజా సమాచార అధికారి పేరుతోనే దరఖాస్తు చేయాలని సూచించారు. తాను వ్యక్తిగతంగా 200 దరఖాస్తులు చేసి సమాచారాన్ని పొందినట్లు తెలిపారు. లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ తెలుసుకోవాల్సిన సమాచారాన్ని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. లేనిపక్షంలో ఆయా అధికారులు సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద చట్టానికి సంబంధించిన 17 అంశాలతో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. సదస్సులో కళాశాల సమాచార అధికారి బి.వి.రాఘవులు చట్టంలోని అంశాలను వివరించారు. ఈ సదస్సులో కళాశాల అధ్యాపకులు వెంకట రామారావు, అగస్టీన్, మాధురి తదితరులు పాల్గొన్నారు. |
|