| కళాశాలల్లో కొరత పాఠాలు |
| ప్రచురణ తేది: 15/09/2009 |
|
* తగ్గుతున్న ఎయిడెడ్ కళాశాలలు * శ్రద్ధచూపని పాలకులు * సహ చట్టంతో సమాచారం
క డప నగరం , న్యూస్‌టుడే : ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న 220 ఎయిడెడ్ జూనియరు కళాశాలలు ప్రస్తుతం 180కి చేరుకున్నాయి. జిల్లాలో 29 నుంచి 23 వాటి సంఖ్యకు తగ్గిపోయింది. వాటిల్లోనూ వసతులు, అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యలుగా మారాయి. దీంతో సంవత్సర, సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో అవీ మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రామకృష్ణ జూనియరు కళాశాల, బాలాజీ జూనియరు కళాశాల, గుట్టకింద రాజుపల్లె, చెన్నూరు కళాశాలల్లో విద్యార్థులు బంగపడి, బతిమలాడి, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సీట్లు పొందేవారు.అలాంటి కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లోనూ అరకొరగా అధ్యాపకులు, రెండు మూడు గ్రూపులతో కొట్టుమిట్టాడుతున్నాయి.
* జిల్లాలో 23 ఎయిడెడ్ జూనియరు కళాశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అందులో ఒక్క మరియాపురం ఎస్టీజోసెఫ్ జూనియరు కళాశాల ఒక్కటే 674 మంది విద్యార్థులతో కళకళలాడుతుండగా బద్వేలు ఎస్‌కేపీ కళాశాల 336 మంది, టి.సుండుపల్లె ఎంకేఆర్ కళాశాల 275 మందితో, కమలాపురం సరస్వతి కళాశాల 271 మందితో నడుస్తుండగా మిగులు కళాశాలలు అంతకంటే తక్కువ సంఖ్యతో కొనసాగుతున్నాయి. అధ్యాపకుల కొరతతో కొన్ని కళాశాలల్లో బైపీసీ, హెచ్ఈసీ గ్రూపులు తొలగించేశారు.
* జమ్మలమడుగు కేఎస్‌జీ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో 36 మంది విద్యార్థులు, 6 మంది అధ్యాపకులతో కొనసాగుతుండగా... ప్రొద్దుటూరు ఎస్‌వీఎన్ కళాశాల 44 మంది పిల్లలతో ఏడుగురు అధ్యాపకులతో నడుస్తోంది. చెన్నూరు ఎస్ఎల్ఎల్‌సీఎస్ఆర్ కళాశాలలో 92 మంది విద్యార్థులు 8 మంది అధ్యాపకులు, బి.మఠం ఎస్‌వీబీ కళాశాల 94 మంది విద్యార్థులతో సాగుతోంది. ఎయిడెడ్ కళాశాలలు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో వీటిని చూస్తే అర్థం అవుతోంది. పుండుమీద పుట్రలా కళాశాలల్లో విద్యార్థులను పెంచాల్సిందిపోయి పిల్లలు తగ్గిపోతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది అధ్యాపకులను ప్రభుత్వ కళాశాలలకు రీడిప్లాయిడ్ కింద సర్దుబాటు చేశారు. జిల్లాలో వందమంది అధ్యాపకులను, మరో వందమంది సిబ్బందిని మార్చేశారు.
ఎయిడెడ్‌ను బలోపేతం చేస్తే కొత్త కళాశాలలెందుకు? ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలలకు వేతనాలు చెల్లిస్తుంది. వాటి నిర్వహణకు ఎంజీ గ్రాంటు నిలిపేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండదు. అయితే సర్కారు ప్రభుత్వ జూనియరు కళాశాలలకు అనుమతులు ఇచ్చి ఏర్పాటుచేయడంవల్ల ఆర్థికపరంగా భారం కానుంది. జిల్లాకు మంజూరుచేసిన అయిదు కళాశాలల్లో శాశ్వత భవనాలు, అధ్యాపకుల నియామకాలు లేవు. కోట్లాది రూపాయలు నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎయిడెడ్ కళాశాలలను బలోపేతం చేస్తే ప్రభుత్వానికి వచ్చేరోజుల్లో కొత్త కళాశాలల ఆవశ్యకత ఉండదని విద్యావేత్తలు అంటున్నారు. |
|