| ఎంత అవగాహనో..! |
| ప్రచురణ తేది: 22/09/2009 |
|
ప్రజా సమాచార అధికారులందరికీ సహ చట్టంపై శిక్షణిచ్చాం.. ఇస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సమాచార కమిషన్ ఢంకా బజాయిస్తున్నాయి. ఆ మాటల్లోని డొల్లతనానికి సాక్ష్యమిది.
స హ చట్టంపై తమ అవగాహనరాహిత్యాన్ని కొందరు పీఐవోలు స్వయంగా బయటపెట్టుకుంటున్నారు. 4(1)(బి) సమాచారం సెక్షన్ 2(ఎఫ్) పరిధిలోకి రాదంటూ.. దాన్ని ఇవ్వని విశాఖపట్నం జిల్లా పౌర సరఫరా అధికారి(గ్రామీణ) నిర్వాకాన్ని చూస్తే.. హోదాలో ఉన్న ఆయన ఒక్కసారి కూడా సహ చట్టాన్ని చదవలేదన్న సంగతి అర్థమవుతోంది. జిల్లా పౌర సరఫరా అధికారి కార్యాలయం 4(1)(బి) సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు రక్షణ వేదిక (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో.) కన్వీనర్ కాండ్రేగుల వెంకటరమణ దరఖాస్తు చేశారు. సంబంధిత కార్యాలయానికి వచ్చిన సహ దరఖాస్తుల సంఖ్య, దరఖాస్తుదారుల పేర్లు, చిరునామాలు, నిర్దేశిత గడువులోగా పరిష్కరించిన దరఖాస్తుల సంఖ్య తదితర సమాచారాన్నీ అడిగారు. దానికి స్పందించిన జిల్లా పౌర సరఫరా అధికారి(గ్రామీణ) లేఖ రాస్తూ '4(1)(బి) సమాచారం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం సహ చట్టం పరిధిలోకి రాదు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించిన, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య తదితర సమాచారమూ సహ చట్టం పరిధిలోకి రాదు' అని చెప్పారు. సహ చట్టం అమల్లోకి వచ్చిన 120 రోజుల్లోగా ప్రతి ప్రభుత్వ యంత్రాంగమూ సెక్షన్ 4(1)(బి) సమాచారాన్ని స్వచ్ఛందంగా ప్రకటించాలని, ఆ తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని నవీకరించాలని.. చట్టంలో స్పష్టంగా ఉంది. అయినా.. ఇక్కడి ప్రజా సమాచార అధికారి ఆ విషయాన్ని మర్చిపోయారు(?).దీనిపై నిర్దేశిత గడువులోగా ప్రథమ అప్పీలు చేయలేకపోయిన వెంకటరమణ.. తిరిగి అదే దరఖాస్తును ఆ కార్యాలయానికే పెట్టారు. 'మీరు గతంలో చేసిన దరఖాస్తులోని అంశాలు ఇవి ఒక్కటే.. వాటికి సంబంధించి మేం గతంలోనే లేఖ పంపాం. ఇప్పుడూ అదే వర్తిస్తుంది' అని సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనిపై రాష్ట్ర కమిషన్‌కు వెంకటరమణ ఫిర్యాదు చేశారు. - ఎస్.కె.అలీషా, విశాఖపట్నం |
|