శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: అధికారులూ.. ఎప్పటికి మారతారు?
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
అధికారులూ.. ఎప్పటికి మారతారు?
ప్రచురణ తేది: 20/10/2009

ప్రిన్సిపల్ కార్యదర్శి నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకూ.. చాలా మంది ప్రభుత్వోద్యోగుల ఆలోచనాధోరణి ఒక్కటే. సామాన్య ప్రజలకంటే తాము అధికులమనేది వారి భావన. అలాంటి వారందరి వల్ల రాష్ట్రంలో సహ చట్ట అమలు గతి తప్పుతోంది. చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికారుల వ్యవహారశైలితో సామ్యాన్యునికి సమాచారం అందని ద్రాక్షే అవుతోంది.

చట్టం వచ్చి నాలుగేళ్లు గడిచినా.. ప్రాథమిక విషయాలపై అవగాహన లేకుండా దరఖాస్తుదారులను ఇబ్బందులు పెడుతున్న అధికారులు కోకొల్లలు. అవగాహన ఉన్నా.. లేనట్లు నటించే వారు కొందరు.తమ తప్పులు వెలుగులోకి వస్తాయని 'సమాచారాన్ని' తొక్కిపెడుతున్న వారు మరికొందరు. ఇలాంటి వారందరూ కలసి.. సహ చట్టాన్ని నీరుగారుస్తున్నారు. నెలల తరబడి సమాచారం ఇవ్వకుండా.. దరఖాస్తుదారులను నిరుత్సాహపరుస్తున్నారు. ప్రజాసామ్యానికి ప్రాణవాయువైన 'పారదర్శకత'ను సమాధి చేస్తున్నారు.

సహ చట్టం అమలుపై ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఆలోచనా ధోరణిలో ఉన్నారు? వారి వ్యవహారశైలిలో మార్పు రాకపోవటానికి కారణాలేంటి? వారిని ప్రభావితం చేస్తున్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే..

* ప్రభుత్వోద్యోగుల్లో ఎక్కువ మంది ఇప్పటికీ అధికార రహస్యాల చట్టం (1923) 'ఆధీనం'లోనే ఉన్నారు.

* సమాచారాన్ని తమ పై అధికారులకు ఇవ్వడానికే అలవాటు పడ్డారు.అదే సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడానికి మాత్రం వారికి మనసొప్పట్లేదు.

* కార్యాలయం, సమాచారం 'నాది' అనే భావన చాలామంది అధికారుల్లో ఉంది. అంతిమంగా తాము ప్రజా సేవకులమని.. సమాచారానికి నిజమైన హక్కుదారులు ప్రజలేనని భావించే వారు చాలా తక్కువ.

* గ్రామ, మండల స్థాయి అధికారులు సమాచారం ఇవ్వకపోయినా.. దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టినా.. జిల్లాస్థాయి అధికారులు పట్టించుకోరు. 'స్థాయీ భేదాలున్నా మేమంతా ఒక్కటే - ప్రజలే బయటి వారు'.. అనే వెనకేసుకొచ్చే ధోరణే ఎక్కువ. తత్ఫలితమే.. సమాచార స్వేచ్ఛకు సంకెళ్లు.

* సహ చట్టాన్ని తమపై రుద్దిన అదనపు బాధ్యతగానే భావిస్తున్నారు. ప్రజలకు సమాచారం ఇవ్వడం.. పారదర్శకత తమ విధి నిర్వహణలో భాగమనుకోవట్లేదు.

* ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కువ మంది ఒకరకమైన 'రహస్య సంస్కృతి'కి అలవాటు పడిపోయారు. దాన్ని ఛేదించి.. ప్రజల భాగస్వామ్యంతో కొత్త సంస్కృతిని నెలకొల్పడానికి ముందుకొస్తున్న వారి సంఖ్యా తక్కువే.

* ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందట్లేదు. (శిక్షణ పేరుతో కాలయాపన చేస్తున్నారు)

మార్పు రావాల్సిందే
దరఖాస్తుదారులకు గడువులోగా సమాచారం అందాలంటే.. ప్రభుత్వ కార్యాలయాల్లో రావాల్సిన మార్పులెన్నో ఉన్నాయి. వాటలో ముఖ్యమైనవి..

* ప్రతి కార్యాలయంలోనూ రికార్డుల నిర్వహణ సక్రమంగా జరగాలి.

* సహ చట్టం మౌలిక ఉద్దేశం నెరవేరేటట్లు.. సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగాలే స్వచ్ఛందంగా వెల్లడించాలి. అలా చేస్తే.. ప్రజలకు సమాచారం అడిగే అవసరమూ తగ్గుతుంది. దరఖాస్తులూ తగ్గుతాయి.

* సెక్షన్ 4(1)(బి) సమాచారాన్ని కచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

* సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలి.

* 30 రోజుల గడువు ఉంది కాదా.. అని అనుకోకుండా అధికారులు ఎంత త్వరగా దరఖాస్తుదారులకు సమాచారాన్ని అందిస్తే అంత ఒత్తిడి తగ్గుతుంది.

* అప్పీలేట్ అధికారులు, కమిషన్‌కు పని కల్పించకుండా పీఐవోల స్థాయిలోనే సమాచారం అందాలి. అప్పుడే విలువైన సమయం వృథాకాదు.

* దరఖాస్తుదారులకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి.

* వచ్చిన సహ దరఖాస్తులపై ప్రతి కార్యాలయంలోనూ నెలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించాలి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్ని అప్పుడు పరిష్కరించాలి.

* 'కనిపించని' ఫైళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

* ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించాలి.

దరఖాస్తుదారుల బాధ్యతలివి..
* కావాల్సిన సమాచారాన్ని సూటిగా, స్పష్టంగా అడగాలి.

* వ్యక్తిగతంగానే కాకుండా ప్రజాప్రయోజన అంశాలతో దరఖాస్తు చేయాలి.

* రశీదు, రిసీవ్‌డ్ కాపీలను తప్పనిసరిగా తీసుకోవాలి.

* దరఖాస్తు చేసి వదిలేయకుండా.. పూర్తి సమాచారం వచ్చే వరకూ ప్రయత్నించాలి. క్రమంలో రెండో అప్పీలు వరకైనా వెళ్లాలి.

* వచ్చిన సమాచారాన్ని పరిశీలించి.. తదనంతర కార్యాచరణకు పూనుకోవాలి.
- ఆర్.మంగారెడ్డి, స్టేట్ రిసోర్స్‌పర్సన్, నల్గొండ

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008