| జరిమానాలా.. ఎందుకు? |
సెక్షన్ 20(1)ని పట్టించుకోని రాష్ట్ర కమిషన్ 'సమాచార హక్కు చట్టం రాష్ట్రంలో బ్రహ్మండంగా అమలవుతోంది. దరఖాస్తుదారులు కోరిన వెంటనే పీఐవోలు సమాచారమిచ్చేస్తున్నారు. ఎక్కడా ఏ ఇబ్బందుల్లేవు'... రాష్ట్ర సమాచార కమిషన్ తరచూ చెప్పే మాటలివి. మరి జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉందా? నిర్ణీత గడువులోగానే పీఐవోలు సమాచారమిస్తున్నారా... అంటే సమాధానం రావడం కష్టం. ఇప్పటికీ దరఖాస్తు రుసుం కింద ఐపీవోలను, కోర్టు ఫీ స్టాంపులను జత చేస్తే తిప్పి పంపే అధికారులున్నారు. నెలల తరబడి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్న వారూ ఉన్నారు. అయినా వారెవరూ మన కమిషన్‌కు కనిపించరు. వారికి జరిమానాలు విధించరు. సరైన కారణం లేకుండా దరఖాస్తును స్వీకరించకపోయినా, గడువులోగా సమాచార మివ్వకున్నా, అసంపూర్తి, తప్పుడు సమాచారమిచ్చినా, దురుద్దేశంతో దరఖాస్తును తిరస్కరించినా, కోరినా సమాచారాన్ని ధ్వంసం చేసినా, సమాచారం అందకుండా అడ్డుపడినా సహ చట్టంలోని సెక్షన్ 20 (1) ప్రకారం పీఐవోలకు రోజుకు రూ.250 చొప్పున రూ. 25వేల వరకు జరిమానా విధించవచ్చు. అలా ఈ మూడేళ్లలో రాష్ట్రంలో జరిమానా విధించింది కేవలం ఒక్క కేసులోనే. అంటే కమిషన్ ప్రకారం రాష్ట్రంలో పైన చెప్పిన సమస్యలేవీ తలెత్తడం లేదన్న మాట. ఇది నిజం అనుకోవాలా? తప్పు చేసిన వారిని శిక్షిస్తేనే కదా... మరొకరు ఆ పని చేయకుండా ఉంటారు. ఈ కనీస సూత్రాన్ని విస్మరించి కమిషన్ సమాచారమివ్వని పీఐవోలను హెచ్చరికలతోనే వదిలేస్తోంది. జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల కమిషన్లు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తప్పు చేసిన వారికి గరిష్ఠ జరిమానాలను విధిస్తున్నాయి. అలాంటి కొన్ని కేసుల వివరాలివి..
ఒకే పీఐవోకి రూ.50 వేలు
రెండు వేర్వేరు కేసుల్లో ఒకే పీఐవోకి ఛత్తీస్‌గడ్ రాష్ట్ర సమాచార కమిషన్ రూ.50 వేల జరిమానా విధించింది. రాయిగఢ్ జిల్లాలోని పరిశ్రమలకు ఇచ్చిన నిర్మాణ అనుమతులు, జిందాల్ పరిశ్రమకు భూ సేకరణ అంశాలపై రమేష్ అగర్వాల్ అనే వ్యక్తి రెండు దరఖాస్తులు చేశారు. స్థానిక సబ్ డివిజన్ అధికారి వాటికి సమాచారం ఇవ్వలేదు. దరఖాస్తుదారు కమిషన్‌ను ఆశ్రయించారు. పీఐవో నిర్లక్ష్యాన్ని నిర్థరించిన కమిషన్ ఆయనకు రూ. 50 వేలు జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది.
ఫోరం ఛైర్మన్‌కే మొట్టికాయ
పాలము జిల్లా వినియోగదారుల ఫోరం ఛైర్మన్‌కు జార్ఖండ్ రాష్ట్ర సమాచార కమిషన్ రూ. 25వేల జరిమానా విధించింది. వినోద్ ప్రజాపతి అనే వ్యక్తి పాలము డిప్యూటీ కమిషనర్ కు సహ దరఖాస్తు చేశారు. కోరిన సమాచారం ఫోరం పరిధిలోకి వస్తుందని దరఖాస్తును అక్కడికి బదిలీ చేశారు. ఛైర్మన్ పట్టించుకోలేదు. దరఖాస్తుదారు కమిషన్‌కు వెళ్లారు. విచారణలో వాస్తవాలు తేలడంతో కమిషన్ రూ. 25 వేల జరిమానా విధించింది.
నిర్లక్ష్యానికి వాత
పంజాబ్ హౌస్‌ఫెడ్‌లో ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న మన్జిత్‌సింగ్‌కు రెండు కేసులకు సంబంధించి రూ.50 వేల జరిమానా విధిస్తూ ఆ రాష్ట్ర కమిషన్ తీర్పిచ్చింది. మల్కైత్‌సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన రెండు దరఖాస్తులకు సమాచారం ఇవ్వడంలో మన్జీత్ తీవ్ర జాప్యం చేశారు. ఒక దరఖాస్తుకి 126, మరో దానికి 173 రోజుల ఆలస్యంగా సమాచారం ఇచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర సమాచార కమిషన్ మన్జీత్‌కు రెండు కేసుల్లో గరిష్ఠ జరిమానా రూ.25 వేల చొప్పున విధిస్తూ ఆదేశాలిచ్చింది. |