అధికారుల మాటల 'మర్మం' తెలుసుకోకుంటే కష్టమే! మన అధికారుల్లో ఇంకా కొద్ది మంది 'అధికార రహస్యాల' మత్తులోనే జోగుతున్నారు. 'గుంభనంగా' పనులు చేస్తూ.. 'వెనకేసుకోవడమే' కర్తవ్యమని భావిస్తున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు సమాచార హక్కు చట్టం పక్కలో బల్లెంలా మారింది. దాంతో ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు వారు శతథా ప్రయత్నిస్తున్నారు. దరఖాస్తు చేసే సమయంలోనే లేనిపోని 'రుసుం'లతో దరఖాస్తుదారులను భయపెడుతున్నారు. మరోసారి సమాచారం అడగకుండా చేస్తున్నారు. అసలు 'రుసుం' విషయంలో 'సహ' చట్టం ఏం చెబుతోంది? ఏ స్థాయిలో.. ఎంత రుసుం వసూలు చేయాలి? ఆ వివరాలు మీకోసం..

నగదు/ డిమాండ్‌డ్రాప్టు/ బ్యాంకర్స్ చెక్/ పోస్టల్ అర్డర్/ కోర్టు ఫీజు స్టాంపు రూపంలో రుసుంను దరఖాస్తుదారుడు చెల్లించవచ్చు. సక్రమ చెల్లింపులు జరిగిన దరఖాస్తులను సైతం పీఐవోలు తిరస్కరిస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో సెక్షన్ 19(1) ప్రకారం ఉన్నతాధికారికి అప్పీలు చేసుకోవచ్చు. చట్టంలోని సెక్షన్ 18(1) (సి) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు..
సెక్షన్ 4(1) (బి) కింద పదహారు అంశాల సమాచారాన్ని అడిగినప్పుడు ఎక్కువ రుసుం చెల్లించాలని సమాచార అధికారులు డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 4(4) ప్రకారం ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రజా సమాచార అధికారి ఉచితంగా లేదా ముద్రణ ఖర్చుతో అందజేయాలి. దీనికి విరుద్దంగా అధికారులు వ్యవహరిస్తే 18(1)(డి) ప్రకారం సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
ప్రథమ అప్పీలు/ ఫిర్యాదు పంపేటప్పుడు రుసుమేం చెల్లించనక్కర్లేదు. ప్రథమ అప్పీలు/ ఫిర్యాదులపై తప్పనిసరిగా సంతకం చేయాలి. అప్పీలు/ ఫిర్యాదు చేసేటప్పుడు ప్రజా సమాచార అధికారికి పంపిన దరఖాస్తు, తిరుగు రశీదు నకలు, అసంపూర్తిగా పంపిన సమాచారం నకళ్లను ధ్రువీకరించి జత చేయాలి.
గ్రామస్థాయిలో సమాచారానికి రుసుం చెల్లించనక్కర్లేదు. మండల స్థాయి కార్యాలయంలో రూ.అయిదు, ఇతర కార్యాలయాల్లో రూ.పది చెల్లించాలి. దారిద్య్రరేఖకు దిగవన ఉన్నవారయితే రుసుం కట్టక్కర్లేదు. దరఖాస్తుతో పాటు తెల్ల రేషన్ కార్డు నకలును మాత్రం ధ్రువీకరించి పంపించాలి. న్యాయస్థానాలకు దరఖాస్తు చేసేటప్పుడు రూ.25 కోర్టు ఫీజు స్టాంపు అతికించాలి.
సమాచారం పంపేటప్పుడు నిర్దేశించిన రుసుం కన్నా ఎక్కువ మొత్తాన్ని చెల్లించమని కొన్ని చోట్ల పీఐవోలు కోరుతున్నారు. వారి మీద సెక్షన్ 18(1) (డి) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా సెక్షన్ 19(1) ప్రకారం ప్రథమ అప్పీలు కూడా చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం పేజీకి రూ.రెండు, సి.డి.కి రూ.100, ఫ్లాపికి రూ.50, డి.వి.డి.కి రూ.200 వసూలు చేయాలి. న్యాయ వ్యవస్థకు సంబంధించినవి అయితే పేజీకి రూ.అయిదు చెల్లించాలి.
నిర్దేశించిన సమయంలోగా సమాచారం ఇవ్వని సందర్భాలలో కూడా కొందరు అధికారులు రుసుం చెల్లించాలంటున్నారు. ఇది చట్టవిరుద్ధం. గడువు తీరిన తర్వాత సమాచారాన్ని సెక్షన్ 7(6) ప్రకారం ఉచితంగా ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన అధికారిపై ఉన్నతాధికారికి అప్పీలు/ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే గడువులోగా సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 7(2) ప్రకారం ఆ దరఖాస్తును తిరస్కరించినట్లుగా భావించాలి. అటువంటి సందర్భాలలో సెక్షన్ 18(1) (సి) కింద ఫిర్యాదు/ ప్రథమ అప్పీలు చేసుకోవాలి.

|