జనవరి 24, 1950, భారత రాజ్యాంగ మూలప్రతులపై రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సంతకం చేసే సమయం, ఆయన ‘ఇప్పటి వరకు అధికారులుగా చలామణి అవుతున్న వారు ఇక ప్రజాసేవకులుగా మారబోతున్నారు’ అని రాశారు. ఆరు దశాబ్దాలు గడిచాక కూడా ఆయన చెప్పిన మాటలు కాగితాలకే పరిమితమై పోయాయి. ప్రజలనే తమ సేవకులుగా మార్చి పరిపాలన సాగిస్తున్నారు. గ్రామీణులు, పేదలు ఇతరులపై ఆధారపడకుండా, లంచం ఇవ్వకుండా, రాజకీయ సిఫార్సులకు చూడకుండా తమ సమస్యలను పరిష్కరించుకునే శక్తిని సమాచార హక్కు చట్టం అందిస్తుంది.
సమాచారం కోసం దరఖాస్తు చేయడం ఇలా...
దరఖాస్త్రం
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు జరగడంలో జాప్యం సాధారణం. కొన్నిసార్లు ఆర్జీలు/దరఖాస్తులు/ఫిర్యాదులు చెత్తబుట్టలో దర్శనమివ్వడమూ తెలిసిందే. కార్యాలయంలోకి ప్రవేశించగానే అందంగా కనపడే పౌర సేవాపత్రం (సిటిజన్ ఛార్టర్)లో పేర్కొన్న గడువులోగా సమాధానం రావడం అరుదు. మన సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేందుకు ఏకైక మార్గం సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయడమే.
గ్రామస్థాయిలో దరఖాస్తు చేసేవారికి దరఖాస్తు రుసుము లేదు మండల స్థాయి కార్యాలయాలకు అయిదు రూపాయలు, సబ్ డివిజన్, సర్కిల్, రెవెన్యూ డివిజన్, పురపాలక, జిల్లా, నగర పాలక, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు పది రూపాయలు మాత్రమే. ఈ రుసుముకు కోర్టు ఫీ స్టాంపులను దరఖాస్తుపై అంటించి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాలి. పూర్తి చేసిన దరఖాస్తు నకలును, రిజిస్టర్డ్ పోస్టు రసీదును భద్రపరచుకోవాలి. రుసుమును కోర్టు ఫీ స్టాంపులు/ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించడం సులువు.
సమాచారం కోసం దరఖాస్తు
తేదీ............................
ప్రజా సమాచార అధికారి / సహాయ ప్రజా సమాచార అధికారి
కార్యాలయం పేరు : .....................................
చిరునామా : .........................................
పౌర సమాచార అధికారికి:
సమాచార హక్కు చట్టం 2005 సెక్షను 6(1) ప్రకారం కింది సమాచారం తెలుగులో లిఖిత పూర్వకంగా, ధ్రువీకరించి ఇవ్వగలరు.
(లేదా) కింది పనులు, రికార్డులు స్వయంగా తనిఖీ చేయాలనుకుంటున్నాను. తగిన సమయం, తేదీ, స్థలం తెలుపగలరు. ఆ సమయంలో అవసరమైన సామగ్రి ధ్రువీకృత నమూనాలు ఇవ్వగలరు.
(లేదా) ............................................. తేదీన మీ కార్యాలయంలో ...............................పై ఇచ్చిన ఆర్జీ / ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలు, రోజువారీ ప్రగతి, అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఫైల్ నోట్స్ ధ్రువీకరించి పంపగలరు.
దరఖాస్తు రుసుము రూ. .................. నగదు / డిమాండ్ డ్రాఫ్టు / బ్యాంకర్స్ చెక్కు / ఇండియన్ పోస్టల్ ఆర్డరు / కోర్టు ఫీ స్టాంపులు (వివరాలు) .......................... సమాచార హక్కు చట్ట నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నాను. రశీదు ఇవ్వగలరు. కృతజ్ఞతలు.
భవదీయ
దరఖాస్తుదారు సంతకం
పేరు: ...................................
చిరునామా
...................................
.....................................
ఫోన్ నెం: ......................................
కేసుల నుంచి రక్షణ ఇలా...
దరఖాస్తు చేశారన్న కోపంతో అధికారులు కొందరు కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి పన్నాగాలనుంచి స.హ.చట్టం సెక్షను 21 రక్షణ కల్పిస్తుంది. దరఖాస్తుదారుపై ఏ అధికారైనా అనవసర కేసులతో వేధిస్తే రాష్ట్ర సమాచార కమిషన్, హాకా భవన్, పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా, హైదరాబాద్-04 చిరునామాకు ఫిర్యాదు చేయవచ్చు. మీ దరఖాస్తు ప్రతి, మీపై మోపిన అభియోగ పత్రాల ప్రతులను జతచేసి రిజిస్టర్డ్ పోస్టులో ఫిర్యాదును పంపాలి.
స.హ. చట్టం ప్రయోజనాలు
* ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరుగుతుంది.
* ప్రజాధనం ఖర్చయ్యే తీరుతెన్నులు తెలుస్తాయి.
* అవినీతి తగ్గుతుంది.
* పనుల తనిఖీతో నాణ్యత, పారదర్శకత పెరుగుతాయి.
* ఫిర్యాదులు త్వరగా పరిష్కారమవుతాయి.
తహసీల్దార్ కార్యాలయాల్లో పౌర సేవా పత్రం (సిటిజన్ ఛార్జర్)
ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరసేవా పత్రంలో నిర్దేశించిన గడువులోగా పౌరుల ఆర్జీలపై చర్యలు తీసుకోవాలి. అలా జరగకపోతే... ఆర్జీ నకలు, అధికారులు ఇచ్చిన రశీదు కాపీలతో స.హ.చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
పని రోజులు
* ప్రభుత్వ/ సీలింగ్/ మిగులు భూములకు వ్యవసాయ పట్టా మంజూరు - 60
* వ్యవసాయం నిమిత్తం పట్టా మంజూరు చేసిన వారికి భూముల స్వాధీనం - 15
* భూమి తగాదా కేసుల పరిష్కారం - 10
* పట్టా భూములను సబ్ డివిజన్ చేయటం - 30
* భూమి కొలతలు సరిచూడటం/సవరించటం - 10
* పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేయటం - 10
* బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రతిపాదనలు - 10
|