శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: ఆర్.టి.ఐ. చట్టం :: సైంధవులకు సమాధానమిదే!
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
ఆర్.టి.ఐ. చట్టం
సైంధవులకు సమాధానమిదే!

ప్రజలు చట్టప్రకారం కోరిన సమాచారాన్ని ఇస్తే ఏ ఇబ్బందీ లేదు. కానీ చాలా సందర్భాల్లో అధికారులు సానుకూలంగా స్పందించటం లేదు. దరఖాస్తుదారుని బట్టి వారి తీరు మారుతోంది. కొన్ని సార్లు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన ఉన్న వారికి ఒక విధంగా, లేని వారికి మరో విధంగా చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో కోరిన సమాచారాన్ని పొందలేకపోతే ఏం చేయవచ్చన్నది చట్టం స్పష్టంగా పేర్కొంది...

సైంధవులకు సమాధానమిదే!

దరఖాస్తు చేసి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరాలు అయ్యింది. అధికారులు సమాచారం ఇవ్వడంలో అనుచిత జాప్యం, కారణాలు చెప్పడం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఇది...

దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వడం ప్రజా సమాచార అధికారుల ప్రాథమిక విధి (సెక్షను 7(1)). అలా ఇవ్వడంలో విఫలమైనా, దరఖాస్తులను, అప్పీలును స్వీకరించడానికి నిరాకరించినా, అధిక మొత్తం రుసుముగా కోరినా, అసంపూర్తిగా, తప్పుడు సమాచారం ఇచ్చినా... ఇలా ఏ రూపంలోనైనా దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటే సమాచార కమిషన్ కు (సెక్షన్ 18(1)) ఫిర్యాదు చేయవచ్చు. ఏపీ సమాచార కమిషన్ లేఖ 6653/ ఐసి-డి.ఆర్/2007/26.02.2008 ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది.

ఫిర్యాదు నమూనా

సమాచార హక్కు చట్టం, సెక్షన్ 18(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్, హైదరాబాద్

  1. ఫిర్యాదుదారు పేరు, చిరునామా:.........................
  2. ప్రజా సమాచార అధికారి, హోదా, చిరునామా
  3. ప్రజా సమాచార అధికారి పంపిన లేఖ వివరాలు:
  4. ఫిర్యాదుకు కారణాలు క్లుప్తంగా:

(కింది కారణాలలో ఏదో ఒకటి తప్పక పేర్కొనాలి)

  • సెక్షన్ 18(1): ప్రజా సమాచార అధికారుల నియామకం జరగకపోవడం, దరఖాస్తులు స్వీకరించకపోవడం.
  • సెక్షన్ 18(1)(బి): సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం.
  • సెక్షన్ 18(1)(సి): నిర్ణీత గడువులో దరఖాస్తుపై స్పందించకపోవడం.
  • సెక్షన్ 18(1) డి: అసమంజసమైన రుసుము కోరటం.
  • సెక్షన్ 18(1)(ఇ) అసంపూర్తి/తప్పుదారి పట్టించే/తప్పుడు సమాచారం ఇవ్వడం.
  1. కోరుతున్న పరిష్కారం:
  • సెక్షన్ 7(6) ప్రకారం కోరిన సమాచారాన్ని ఉచితంగా పంపమని ప్రజా సమాచార అధికారిని ఆదేశించగలరు.
  • సకాలంలో సమాచారం ఇవ్వకుండా చట్టాన్ని అగౌరవపరచినందుకు సెక్షన్ 20(1), (2) ప్రకారం చర్యలు తీసుకోగలరు.
  1. పై విషయాలన్నీ యథార్థాలని ధ్రువీకరిస్తున్నాను.

ఫిర్యాదుదారు సంతకం

జతపరచవలసిన నకళ్లు

  • దరఖాస్తు * దరఖాస్తు రుసుము డిడి/ బ్యాంకర్స్ చెక్కు/ ఐపీఓ * పోస్టల్/ కొరియర్ రసీదు * ప్రజా సమాచార అధికారి పంపిన లేఖ/ సమాచారం ఏమైనా ఉంటే

సూచన: మీరు పంపే ప్రతి పేజీపై సంతకం చేయాలి.

 

సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి అప్పీలు విధానం తెలియక విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకుంటున్నారు. సమాచారాన్ని పొందడంలోనూ విఫలమవుతున్నారు. సమాచార కమిషన్ వార్షిక నివేదిక (2007)లోని గణాంకాలు (కింద పట్టికలో) ఈ విషయాలనే చెబుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి చట్టమే మార్గం చూపుతోంది.

 

సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో ప్రజా సమాచార అధికారి సమాచారం ఇవ్వకుంటే సెక్షన్ 19(1) ప్రకారం ఆయన పై అధికారికి అప్పీలు చేసుకోవచ్చు. ఆ అధికారీ 45 రోజుల్లో సమాచారం పంపించడంలో విఫలమైనప్పుడు రాష్ట్ర సమాచార కమిషన్ కు (సెక్షన్ 19(3)) అప్పీలు చేయవచ్చు.

అప్పీలు విధానం

  1. అప్పీలుదారుని పేరు, చిరునామా
  2. ఏ అధికారి ఆదేశాలపై అప్పీలుకు వెళుతున్నామో... ఆ అధికారి పేరు, అధికారిక హోదా, చిరునామా
  3. ఆ అధికారి వెలువరించిన ఆదేశాల క్రమసంఖ్య, తదితరాలు
  4. అప్పీలు చేయాల్సి రావడానికి కారణాలు
  5. దరఖాస్తు తిరస్కారానికి గురికావడంపై అప్పీలుకు వెళ్తున్నట్లయితే.... ఆ దరఖాస్తు వివరాలు, సంఖ్య, తేదీ, తిరస్కరించిన అధికారి హోదా, చిరునామా
  6. కోరుతున్న పరిష్కారం
  7. అందుకు ఆధారమైన చట్టాలు, వాస్తవాలు
  8. అప్పీలుదారుని ధ్రువీకరణ

రాష్ట్ర సమాచార కమిషన్ 2007 వార్షిక నివేదిక వివరాలు

వచ్చిన అప్పీళ్లు           : 2484

తిప్పి పంపినవి            : 1128

తిరస్కరించినవి           : 172

స్వీకరించినవి             : 954

అప్పీలుకు వెళ్లిన వారు (శాతాల్లో)

ప్రజలు                     : 85.22

స్వచ్ఛంద సంస్థలు    : 07.57

మీడియా                  : 04.35

ప్రాంతాలవారీగా అప్పీళ్లు (శాతాల్లో)

ఆంధ్ర                       : 43.07

తెలంగాణ                  : 44.44

రాయలసీమ              : 12.49

 

అధికారులపై అవ్యాజ ప్రేమ

దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ కొరడా ఝళిపించాలి. నిజానికి అలా జరగక పోగా వారిపై మమకారాన్ని చూపుతున్నట్టనిపిస్తోంది. చట్టం కట్టబెట్టిన అధికారాలను కమిషన్ సరిగా వినియోగించటం లేదు. ఈ విషయం తాజా నివేదికే చెబుతోంది. పోయినేడాది కమిషన్ 33 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు, 9 మందికి హెచ్చరికలు జారీ చేసింది. మూడు కేసులు విచారణకు ఆదేశించింది. ఒక్కరిపై మాత్రమే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. చట్టంలోని వివిధ సెక్షన్లను ఉల్లంఘించినట్లు దరఖాస్తుదారులు నిరూపించినా సెక్షను 20(1), (2) ప్రకారం ప్రజా సమాచార అధికారులకు జరిమానాలు, శిక్షలు విధించడంలో కమిషన్ ది నిర్లిప్త ధోరణే!  మొదటి తప్పుగా భావించి ఏ చర్యా తీసుకోవద్దని అధికారులు కోరుతున్నారు. అందుకు అంగీకరిస్తూ సమాచారం ఇవ్వమని ఆదేశించేందుకే కమిషను పరిమితం అవుతోంది. అప్పీలు పద్ధతి తెలియని దరఖాస్తుదారులు అంతటితో ఆగిపోతున్నారు. ఒకవేళ అప్పీలు చేస్తే చేసిన విధానం సరిగా లేదని వచ్చిన మొత్తంలో సగానికిపైగా అప్పీళ్లను తిప్పిపంపారు.

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008