శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: సహ విజయాలు :: స్వాహాయణానికి అడ్డుకట్ట
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
సహ విజయాలు
స్వాహాయణానికి అడ్డుకట్ట
ప్రచురణ తేది: 20/10/2009

క్రమార్కులకు ముకుతాడు వేస్తూ.. ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి సహ చట్టం బాటలు పరిచింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహక నిధులను దిగమింగుతున్న వారి ఆటలు కట్టించింది. పార్టీల కుమ్ములాటలకు దూరంగా ఆయా గ్రామాల ప్రజలందరూ తమ సర్పంచులను ఎన్నుకున్నారు. ఏకగ్రీవాలైనందుకు ప్రభుత్వమూ 'ప్రోత్సాహకాల'ను అందించింది. అలా.. ఏకగ్రీవమైన ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.5లక్షలు చొప్పున కేటాయించింది. శ్రీకాకుళం జిల్లాలో 236 పంచాయతీలకు రూ.11.80 కోట్లను విడుదల చేసింది. నిధులతో గ్రామాల్లో శాశ్వత పనులైన మురుగుకాల్వలు, సీసీ రహదారులు, కల్వర్టులు నిర్మించాలి. అక్కడే కథ అడ్డం తిరిగింది. అభివృద్ధి పనులపై అక్కమార్కుల కన్ను పడింది. ఏకగీవ్రంగా ఎన్నికైన సర్పంచుల్లో కొందరు గ్రామ కార్యదర్శులతో కుమ్మక్కయ్యారు. ఎప్పుడో జరిగిపోయిన పనుల్ని కొత్తవిగా చూపిస్తూ నిధుల స్వాహాకు పూనుకున్నారు.

బయటపడిందిలా..
వ్యవహారంపై శ్రీకాకుళానికి చెందిన కర్ణకుమార్ సహ దరఖాస్తు చేశారు. జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీలకు చెల్లించిన ప్రోత్సాహక నిధుల వివరాలను కోరారు. దాంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయిదేళ్లుగా అభివృద్ధి పనులు జరగని గ్రామాల్లో సైతం 'నిర్మాణాలు' చేపట్టినట్లు రికార్డుల్లో రాశారు. 2002లో నిర్మితమైన రహదారులనూ జాబితాలో చేర్చారు. అక్రమాలపై 'ఈనాడు' జిల్లా పత్రికలో 'ప్రోత్సాహకం పక్కదారి' శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో డీపీవో టి.వెంకటేశ్వరరావు స్పందించారు. నిధుల వినియోగ తీరును పరిశీలించారు. వీరఘట్టం మండలం చలివేంద్రిలో పర్యటించారు. పాత పనులను కొత్తవిగా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ డీఎల్‌పీవో మోహనరావును విచారణాధికారిగా నియమించారు. అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేస్తామని.. నిధులు దుర్వినియోగమయితే సర్పంచుల చెక్‌పవర్ రద్దు చేస్తామని హెచ్చరించారు. నిధుల స్వాహాపర్వం సహ చట్టంతో వెల్లడవటంతో మిగిలిన గ్రామాల ప్రజలు చైతన్యవంతమయ్యారు. మరికొన్ని ఏకగ్రీవ పంచాయతీల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై సమాచారం ఇస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. అక్రమార్కులకు కళ్లెం వేయడంతో పాటు.. గ్రామీణుల్లో కూడా సహ చట్టం చైతన్య కాంతులను నింపింది.
- ఎం.సురేష్, న్యూస్‌టుడే, శ్రీకాకుళం

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008