| దరఖాస్తు దూరంలో జవాబుపత్రాలు |
| ప్రచురణ తేది: 08/09/2009 |
|
స హ చట్టం దెబ్బకు ఒరిస్సా మాథ్యమిక విద్యా బోర్డు (బీఎస్ఈ) దిగివచ్చింది. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల నకలు ప్రతులను విద్యార్థులకు అందించేందుకు అంగీకరించింది. నకలు ప్రతులను ఇవ్వడానికి నిరాకరించిన బోర్డు చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర సమాచార కమిషన్‌లో దాఖలైన అప్పీళ్ల ప్రభావంతో ఈ నిర్ణయం అనివార్యమైనట్లు బోర్డు కార్యదర్శి నిహార్ రంజన్ మహాపాత్రో తెలిపారు. జవాబు పత్రాల నకలు ప్రతులను అందించకపోవడంపై .. రాష్ట్ర సమాచార కమిషన్‌కు 23 అప్పీళ్లు రావడంతో బోర్డు ఈమేరకు కొత్త నిబంధనలను రూపొందించినట్లు బీఎస్ఈ ప్రజా సమాచార అధికారి కృష్ణప్రసాద్ పతి వివరించారు. రాష్ట్ర ఉన్నత మాథ్యమిక విద్యా మండలి (సీహెచ్ఎస్ఈ) తరహాలో జవాబు పత్రాల నకలు ప్రతులను సరఫరా చేసేందుకు బోర్డు తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రభుత్వం, రాష్ట్ర సమాచార కమిషన్‌తో బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ సదుపాయం విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. ఒక్కో సబ్జెక్టు జవాబు పత్రాల నకలు కోసం రూ.వంద, మార్కుల కూడిక పున:పరిశీలనకు రూ.60 జమ చేయాలి. ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన మూడు నెలల్లో జవాబు పత్రాల నకలు ప్రతులను పంపిణీ చేస్తారు.
-ఎస్.వి.రమణమూర్తి, భువనేశ్వర్ |