|
|
| ప్రజాధనమేగా..! |
| ప్రచురణ తేది: 22/09/2009 |
|
గు డ్డెద్దు చేలో పడినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే ఎందుకూ కొరగాని ఫలితాలే వస్తాయి. రైల్వే శాఖ తీసుకున్న ఒక్క అనాలోచిత నిర్ణయంతో రూ.75 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైన విషయాన్ని సహ చట్టం వెలుగులోకి తెచ్చింది. అయిదు వేల స్లీపర్ బోగీల్లో ఏర్పాటు చేసిన అదనపు బెర్తులను రైల్వే అధికారులు ఇప్పుడు తొలగిస్తున్నారు. ఆదాయం కోసం.. బోగీల్లో ఉన్న బెర్తుల మధ్య కొత్తగా కిందటేడాది బెర్తులను ఇరికించారు. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 'తొలగింపు' ప్రక్రియను చేపట్టారు. అదనపు బెర్తులను ఏర్పాటు చేయడానికి ఒక్కో బోగీకి రూ.1.5 లక్షల చొప్పున అయిదు వేల కోచ్‌లకు రూ.75 కోట్ల వ్యయమైంది. ఇప్పుడు వాటి తీసివేతతో ఆ సొమ్మంతా వృథా అయింది. వినియోగదారుల హక్కుల ఉద్యమకారుడు అవినాష్ ప్రభూనే చేసిన దరఖాస్తుతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అదనపు బెర్తులను తొలగించినా.. అప్పర్ బెర్తుల వల్ల ఇంకా ప్రయాణీకులకు అసౌకర్యం కలుగుతోందని అవినాష్ అన్నారు. అప్పర్ బెర్తులను మళ్లీ సవరించడానికి (ఎడ్జెస్ట్) రైల్వే శాఖ మరిన్ని నిధులను ఖర్చు చేయాలని.. ఖజానాపై అది మరింత భారమని పేర్కొన్నారు. |
|